ETV Bharat / city

Covid second wave: తారాస్థాయికి గ్రామీణ నిరుద్యోగం

author img

By

Published : May 29, 2021, 6:25 AM IST

Updated : May 29, 2021, 5:30 PM IST

కరోనా రెండో దశ(covid second wave)తో దేశం ఉపాధి సంక్షోభంలోకి వెళ్లిపోయిందని, గ్రామీణ నిరుద్యోగం(unemployment) గతంలో ఎన్నడూ లేనంత గరిష్ఠ స్థాయికి చేరిందని భారత మాజీ ప్రధాన గణాంకవేత్త, ఆర్థికవేత్త డాక్టర్‌ ప్రణబ్‌ సేన్‌(dr. pronab sen) చెప్పారు. కేంద్ర ప్రభుత్వ టీకా విధానం ఏమాత్రం బాగా లేదని ఆయన అభిప్రాయపడ్డారు. కంపెనీల నుంచి టీకాలను ఉత్పత్తి ధరకంటే తక్కువకే కేంద్రం తీసుకుంటోందని... దీనివల్ల రాష్ట్రాలు, ప్రైవేటు సంస్థలు కంపెనీల నుంచి ఎక్కువ ధరకు కొనాల్సి వస్తోందని ఆయన అన్నారు. దేశంలో లాక్‌డౌన్‌ తొలగిన వెంటనే ఆర్థిక పరిస్థితులను మెరుగుపర్చేందుకు కేంద్రం ఒక ప్యాకేజీని ప్రకటించాలని.. దాని కోసం ఇప్పటి నుంచే ప్రణాళిక రూపొందించాలని సూచించారు. కొవిడ్‌ తొలిదశతో పోల్చితే రెండో దశలో వ్యవసాయరంగం ఎక్కువ సమస్యలు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడిందని ప్రణబ్‌ సేన్‌ అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థపై కొవిడ్‌ ఎలాంటి ప్రభావం చూపుతోందో డాక్టర్ ప్రణబ్ సేన్​తో ఈనాడు, ఈటీవీ భారత్​ ప్రతినిధి ఎన్. విశ్వప్రసాద్ ముఖాముఖి.

unemployment
unemployment

ప్రశ్న: రెండో దశలో పల్లెల్లోనూ కొవిడ్‌ వ్యాప్తి విపరీతంగా ఉంది. గ్రామీణ, దేశ ఆర్థిక వ్యవస్థలపై దీని ప్రభావం ఎలా ఉంటుంది?

జవాబు: చాలా తీవ్రంగా ఉంటుంది. గత ఏడాది గ్రామాల్లో ఇప్పటిలా కేసులు లేకపోవడంవల్ల వ్యవసాయ ఆర్థిక వ్యవస్థకు పెద్దగా నష్టం జరగలేదు. నిజానికి గత ఏడాది గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బాగుండటం వల్లే దేశ ఆర్థిక వ్యవస్థకు చెప్పుకోదగ్గ బలం చేకూరింది. ఆ సమయంలో వ్యవసాయోత్పత్తుల సరఫరా వ్యవస్థకు ఆటంకం ఏర్పడినా అది వ్యాపారికి, మరో వ్యాపారికి మధ్య జరిగింది. ఈ ఏడాది రైతుకు, వ్యాపారికి మధ్య పంట సరఫరాలోనే ఆటంకం కలుగుతోంది. కొవిడ్‌ విస్తరణ వల్ల గ్రామాల్లో గత ఏడాది కనిపించని భయం ఇప్పుడు చాలా ఎక్కువగా ఉంది. దీనివల్ల రైతు పంటను మార్కెట్‌కు తీసుకువెళ్లడం కష్టం.. వ్యాపారి గ్రామానికి వెళ్లడమూ కష్టం. రైతులకు ఈ ఏడాది పంటలు బాగా పండినా తగిన ధరలు రాక వారు నష్టపోయే ప్రమాదం ఉంది. ఇక సరఫరా వ్యవస్థల్లో ఇబ్బందుల వల్ల రాబోయే రోజుల్లో ఆహారధాన్యాలకు, అలాగే ఉద్యాన ఉత్పత్తులకు కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. అది ఆహార ద్రవ్యోల్బణానికి దారి తీయవచ్చు.

ప్రశ్న: ఉపాధి రంగంపై కొవిడ్‌ రెండో దశ ప్రభావం ఎలా ఉంది?

జవాబు: ఇప్పటికే జీవనోపాధి పరంగా దేశం సంక్షోభ దశకు చేరుకుంది. గతంలో ఎన్నడూ 3 శాతం దాటని గ్రామీణ నిరుద్యోగ రేటు తాజా గణాంకాల ప్రకారం 14 శాతం దాటింది. పట్టణ నిరుద్యోగ రేటు కూడా 14 శాతం ఉంది. ఉపాధి పరంగా ఇది చాలా తీవ్రమైన పరిస్థితి.

ప్రశ్న: ఆర్థిక పరిస్థితులను మెరుగుపర్చడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలి?

జవాబు: ప్రస్తుతం వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న లాక్‌డౌన్‌ల వల్ల సరకుల సరఫరా వ్యవస్థకు ఆటంకం కలుగుతోంది. కేంద్రం ఇలాంటి ఆటంకాలను తొలగించేందుకు కృషిచేయాలి. నాలుగైదు నెలల్లో పరిస్థితులు మెరుగయ్యాక కేంద్రం మంచి ఆర్థిక ప్యాకేజీని ప్రకటించడం చాలా అవసరం. గత ఏడాది లాక్‌డౌన్‌ తర్వాత... ఒక మంచి ప్రణాళికతో ముందుకు వచ్చి అదనంగా అయిదు లక్షల కోట్ల రూపాయలను ఖర్చు చేయాలని ఆర్థికవేత్తలం కేంద్రాన్ని కోరాం. అయితే కేంద్రం లక్షన్నర కోట్లే ఖర్చుపెట్టింది. ఇక గత మార్చి నుంచి కరోనా వల్ల ప్రజల ఆరోగ్య సంరక్షణపై, నగదు బదిలీలపై రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కువ దృష్టి పెట్టి ఖర్చు చేయాల్సి వస్తోంది. దీంతో రాష్ట్రాలు ఇతర రంగాలపై పెట్టుబడులను తగ్గించాల్సి వస్తోంది. దేశవ్యాప్తంగా తాజా గణాంకాలను విశ్లేషిస్తే ఇదే కనిపిస్తోంది. ఇది చాలా ఆందోళనకరం. దీనివల్ల రాష్ట్రాల ఆర్థిక సామర్థ్యంలో ఎదుగుదల ఉండదు. ఈ పరిస్థితుల్లో ప్రాథమిక సౌకర్యాల ప్రాజెక్టులకు కేంద్రం ఆర్థికంగా బాగా ఊతం ఇవ్వాలి. దురదృష్టవశాత్తు ఇది జరగడం లేదు.

ప్రశ్న: ప్రజారోగ్య రంగాన్ని మనం చాలా దశాబ్దాలుగా నిర్లక్ష్యం చేస్తున్నాం. ప్రభుత్వం జీడీపీలో 1.2శాతాన్నే దీనిపై ఖర్చుపెడుతోంది. ఈ రంగంలో ఎలాంటి మార్పులు అవసరం?

జవాబు:ప్రజారోగ్య రంగాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని 90లలోనే ప్రభుత్వాలు గుర్తించాయి. తొమ్మిదో పంచవర్ష ప్రణాళికలోనూ ఈ ప్రస్తావన ఉంది. ఆచరణలో ఇవేమీ అమలు కాలేదు. 1999 ప్రాంతంలో కేంద్రం తీసుకున్న నిర్ణయం ప్రకారం ప్రతి జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి అనుబంధంగా వైద్యశాలను ఏర్పాటు చేసి డాక్టర్లను, నర్సులను సిద్ధం చేయాలి. అది ఇప్పటికీ జరగలేదు. ఇలాంటి కారణాలతో ప్రస్తుతం ఇబ్బందులు పడుతున్నాం. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వంటి మౌలిక సదుపాయాలు మనకు చాలా తక్కువ ఉన్నాయి. అదే సమయంలో ఉన్న వాటిలోనూ పనిచేసేందుకు డాక్టర్లు, నర్సులు లేరు. సాంకేతిక నిపుణుల కొరతా ఉంది. వీరిని తక్కువ సమయంలో తయారు చేసుకోలేం. ఒక ఇరవయ్యేళ్ల వ్యవధికి సంబంధించి కార్యాచరణ రూపొందించుకుని పనిచేయాలి. విరివిగా కళాశాలలు ఏర్పాటు చేసుకుని నైపుణ్యం ఉన్న సిబ్బందిని తయారు చేసుకోవాలి.

ప్రశ్న: కొవిడ్‌ వల్ల గత ఏడాది కాలంలో దేశంలో 23 కోట్లమంది పేదరికంలోకి జారారని అజీమ్‌ ప్రేమ్‌జీ విశ్వవిద్యాలయ అధ్యయనం చెబుతోంది. ఈ స్థితిలో ప్రతి పేద కుటుంబానికి నెలకు సుమారు రూ.7000 వంతున కొంతకాలం నగదు బదిలీ చేయాలని కొందరు నిపుణులు చెబుతున్నారు. మీరేమంటారు?

జవాబు: నిజంగా అవసరం ఉన్నవారిని గుర్తించి, వారికి మాత్రమే సహాయం అందించేందుకు కావాల్సిన గణాంకాలు మనకు అందుబాటులో లేవు. ఇదొక సమస్య. సహాయం చేయాలంటే సార్వత్రికంగా ఆధార్‌ ఉన్న ప్రతి ఒక్కరికీ సహాయం చేయాల్సి వస్తుంది. అలాకాకుండా ఏదో పద్ధతి పెట్టుకుని పరిమితంగా అందిస్తే... నిజంగా అవసరమైన వాళ్లలో కొంత మందికే సహాయం చేరుతుంది. గత ఏడాది కొంత మందికి కేంద్రం నెలకు రూ.500 వంతున కొంతకాలం ఆర్థికసాయం అందించింది. అయితే ప్రజలు ఈ మొత్తాన్ని పెద్ద ప్రయోజనకరంగా భావించలేదు. అప్పటిలా ఈసారి నగదు బదిలీ చేయకపోవడానికి ఇదొక కారణం కావచ్చు.

ప్రశ్న: మొదటి దశలో కేంద్రం ప్రకటించిన ఉపశమన ప్యాకేజీ ఎలాంటి ఫలితాలిచ్చింది?

జవాబు: గత ఏడాది ఉచితంగా ఆహార ధాన్యాలు ఇవ్వడం బాగా ఉపయోగపడింది. ఈ ఏడాది కూడా దాన్ని అమలు చేయడం మంచి ఆలోచన. నిరుడు ప్రకటించిన ఉపశమన ప్యాకేజీతో... ప్రజల ప్రాణాలను కాపాడే విషయంలో, జీవనోపాధిని నిలబెట్టే విషయంలో పెద్ద ప్రయోజనం కలగలేదు. ప్యాకేజీలో గణనీయ భాగాన్ని పెద్ద, చిన్న పరిశ్రమలకు ఉపశమనం కలిగించేలా అమలు చేశారు. కొత్తగా భారీగా రుణాలు ఇవ్వడంతోపాటు, పాతవాటి చెల్లింపులపై మారటోరియాన్ని అమలు చేశారు. దీంతో పాటు వివిధ పరిశ్రమలకు ప్రభుత్వ సంస్థలు బాకీపడి ఉన్న మొత్తాలను చెల్లించారు. ఇవన్నీ ఆయా సంస్థలకు ప్రయోజనాలు కలిగించాయి.

ప్రశ్న: కేంద్రం 45 ఏళ్లు దాటిన వారికే ఉచితంగా టీకా ఇస్తోంది. మిగిలిన వాళ్ల కోసం టీకాలు కొనుగోలు చేసేందుకు ప్రతి రాష్ట్రం మిగిలిన రాష్ట్రాలతో, ప్రైవేటు ఆస్పత్రులతో పోటీ పడాల్సి వస్తోంది. దీనిపై మీరేమంటారు?

జవాబు: కేంద్ర ప్రభుత్వం టీకా కంపెనీల నుంచి ఉత్పత్తి ధరకంటే తక్కువ వ్యయానికి టీకాలను తీసుకుంటోంది. ఆ లోటును పూడ్చుకుని లాభాలు మిగుల్చుకునేందుకు కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వాలకు, ప్రైవేటు రంగానికి ఎక్కువ ధరకు టీకాలను ఇవ్వాల్సి వస్తోంది. ఈ విధానం ఏ మాత్రం బాగాలేదు. కేంద్రం తీరువల్లే టీకాల ధరలు ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం పలు కార్పొరేట్‌ కంపెనీలు తమ సిబ్బంది కోసం పెద్దఎత్తున టీకాలు కొనుగోలు చేస్తుండటంతో, రాష్ట్ర ప్రభుత్వాలు వాటితో పోటీపడి తగినన్ని పొందలేక పోతున్నాయి. అలాగే పేద రాష్ట్రాలు ధనిక రాష్ట్రాలతో పోటీపడే పరిస్థితి ఉంది. ఇది చాలా అనారోగ్యకర వాతావరణం. ప్రస్తుత సంక్లిష్ట పరిస్థితుల్లో ఈ పరిణామాలు అవాంఛనీయం. మొత్తం టీకాలను కేంద్రమే కొనుగోలు చేసి, పంపిణీకి నిర్దిష్ట విధానాన్ని రూపొందించాలి.

ఇవీ చూడండి:

CM Jagan on Health Hubs : రూ.100 కోట్లు పెట్టుబడి పెట్టే ఆస్పత్రులకు భూములు: సీఎం

Last Updated : May 29, 2021, 5:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.