ETV Bharat / city

durga temple fraud: దుర్గ గుడి ఆదాయానికి టోకరా..!

author img

By

Published : Aug 18, 2021, 10:12 AM IST

దుర్గ గుడి ఆదాయానికి సిబ్బంది, గుత్తేదారులు టోకరా పెడుతున్నారు. రెండేళ్ల క్రితం జరిగిన చీరల కుంభకోణానికి సంబంధించి అప్పట్లో హడావుడి చేసిన అధికారులు.. ఆ తర్వాత కిమ్మనలేదు. గుత్తేదారులైతే.. నష్టాలొచ్చాయని.. వివిధ కారణాలు చెప్పి ఆదాయం చెల్లించకుండా గండి కొడుతున్నారు.

durga temple fraud: దుర్గ గుడి ఆదాయానికి టోకరా..
durga temple fraud: దుర్గ గుడి ఆదాయానికి టోకరా..

విజయవాడ దుర్గగుడిలో రెండేళ్ల కిందట చీరల స్కాం జరిగింది. చీరల కౌంటర్‌లో ఉండే సిబ్బంది చేతివాటం చూపించారు. గత ఈవో సురేష్‌బాబు నేతృత్వంలో ఐదుగురు సభ్యుల కమిటీతో అంతర్గత విచారణ కూడా చేపట్టారు. అప్పటి దేవాదాయశాఖ కమిషనర్‌ అనూరాధ, ఈవో సురేష్‌బాబు స్వయంగా పలుసార్లు చీరల కేంద్రాన్ని పరిశీలించి.. విచారణ చేపట్టారు. చివరికి రూ.11.78లక్షలు పక్కదారిపట్టినట్టు లెక్కలు తేల్చారు. పక్కదారి పట్టిన డబ్బులను దేవస్థానానికి కట్టిస్తామని, బాధ్యులపై చర్యలు చేపడతామని ప్రకటించారు. కానీ.. కనీసం పోలీసు కేసు కూడా పెట్టలేదు. ఆ తర్వాత ఈ విషయాన్ని పట్టించుకోకుండా వదిలేశారు. దేవస్థానానికి రావాల్సిన డబ్బుల్లో ఎంత వసూలు చేశారో.. ఎంత వదిలేశారో కూడా ఎవరికీ తెలియదు. దుర్గగుడికి వచ్చే ఆదాయం ఏళ్ల తరబడి పక్కదారి పడుతూనే ఉంది. అక్రమాలను గుర్తించినా.. అమ్మవారి సొమ్మును వెనక్కి రప్పించడంలో అధికారులు విఫలమవుతున్నారు.

.

రూ.76 లక్షలని తొలుత తేల్చి..

దుర్గగుడిలో జరిగిన చీరల స్కాంలో భారీగా అక్రమాలకు పాల్పడినట్టు ఆరంభంలో గుర్తించారు. వాస్తవంగా అయితే.. రూ.76 లక్షల వరకు పక్కదారి పట్టినట్టు తొలుత అధికారులే ప్రకటించారు. కానీ.. నెలల తరబడి విచారణ చేసిన తర్వాత చివరికి రూ.11.78లక్షలని తేల్చారు. విచారణలో అనేక అక్రమాలు బయటపడ్డాయి. తక్కువ రకం చీరలకు అధిక ధరల స్టిక్కర్లు అంటించారు. ఖరీదైన చీరలను మాత్రం పక్కదారి పట్టించి.. బయట మార్కెట్‌లో అమ్ముకున్నారు. చాలామంది భక్తులు అమ్మవారి కోసం ఖరీదైన చీరలను ఇస్తారు. అలాంటి వాటిని మాయం చేసి.. తక్కువ రకానివి ఆ స్థానంలో ఉంచారు.

స్టిక్కర్లు మాత్రం అధిక ధరలవి అంటించేశారు. ఇలా ఏకంగా 2500కు పైగా ఖరీదైన చీరలను మార్చేసినట్టు అధికారులు గుర్తించారు. 2018 నుంచి ఈ అక్రమ తంతు చేస్తూ.. భక్తులకు వాటిని అధిక ధరలకు విక్రయించాలని చూశారు. కానీ.. అంత ధరలు ఆ చీరలకు ఉండవని తెలిసిన భక్తులెవరూ వాటిని కొనుగోలు చేయలేదు. దీంతో అవన్నీ గోదాములో ఉండిపోవడంతో.. స్కాం బయటపడింది. దీనికితోడు చీర ముక్కలతో సంచులు కుట్టిస్తామని, పని చేసే కుర్రాళ్లకు జీతాలు ఇవ్వాలని చెప్పి దేవస్థానం డబ్బులను మరికొంత డ్రా చేసుకుని.. సొంత జేబుల్లో వేసుకున్నారు.

గతంలోనూ చాలా ఘటనలు..

గతంలో దుర్గగుడి టోల్‌ గేట్‌కు సంబంధించిన కాంట్రాక్టును తీసుకున్న ఓ గుత్తేదారు.. ఆలయానికి ఏకంగా రూ.25 లక్షల వరకు ఎగ్గొట్టి వెళ్లిపోయాడు. వాస్తవానికి కాంట్రాక్టు ఇచ్చేటప్పుడే సవాలక్ష నిబంధనలు పెడతారు. దాని ప్రకారం.. గుత్తేదారు నుంచి ముందుగానే ఆలయానికి రావాల్సిన డబ్బులను వసూలు చేయాల్సి ఉంటుంది. కానీ.. అతనికి ఇచ్చిన కాంట్రాక్టు గడువు పూర్తయ్యే వరకు డబ్బులు చెల్లించకపోయినా.. చూస్తూ ఊరుకున్నారు. టోల్‌గేట్‌ ద్వారా వచ్చే డబ్బులన్నీ తీసుకుని.. చివరికి సమయం తీరిపోయాక.. తనకు నష్టం వచ్చిందంటూ చెప్పి డబ్బులు ఎగ్గొట్టాడు. వాస్తవంగా ఇలాంటి వారిపై కేసు పెట్టి.. ఆలయానికి రావాల్సిన డబ్బులను వసూలు చేయాల్సి ఉంటుంది.

ఆలయానికి సంబంధించిన దుకాణాలు, సరకులు, క్లోక్‌రూం, సెల్‌ఫోన్‌ కౌంటర్లు, టోల్‌గేట్‌, కొబ్బరి చిప్పలు, ఫొటోలు.. ఇలా ఏ టెండర్‌ విషయంలోనూ గుత్తేదారులకు నష్టం అనేది ఎట్టిపరిస్థితుల్లోనూ రాదు. నష్టం వస్తే.. పోటీ పడి మరీ టెండర్లను దక్కించుకోరు. కావాలనే ఇక్కడి పనిచేసే కొంతమంది సిబ్బంది ఇచ్చే సలహాలతో ఇలా.. టోకరా వేసి వెళ్లిపోతూ ఉంటారు. ఇలాగే గతంలో ఆలయ క్లోక్‌రూం, సెల్‌ఫోన్‌ కౌంటర్లు, కొబ్బరికాయలు, ఫొటోలు తీసే కాంట్రాక్టులు దక్కించుకున్న గుత్తేదారులు సైతం తాము పాడుకున్న మొత్తాలను చెల్లించకుండా ఎగ్గొట్టి వెళ్లిపోయారు. ఆలయానికి సంబంధించిన పొలాలను లీజులకు తీసుకున్న కొంతమంది కూడా డబ్బులు చెల్లించలేదు.

ఇదీ చదవండి:

e-KYC for ration: రేషన్‌ కార్డులో పేర్లు ఉన్న లబ్ధిదారులందరికీ.. ఈ-కేవైసీ తప్పనిసరి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.