ETV Bharat / city

DGP ON ATTACKS: అసభ్యంగా తిట్టడంతోనే ప్రతిచర్యలు: డీజిపీ

author img

By

Published : Oct 20, 2021, 3:20 PM IST

Updated : Oct 21, 2021, 5:23 AM IST

తెదేపా కార్యాలయంపై జరిగిన దాడి ఘటనపై రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పందించారు. ముఖ్యమంత్రిని అసభ్యపదజాలంతో దూషించటమే ప్రతిచర్యలకు (రియాక్షన్‌) కారణమైందని.. అవేమిటో అందరూ చూశారని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్న ఓ రాజకీయ పార్టీ కార్యాలయం నుంచి అలాంటి దుర్భాషలు సరికాదన్నారు.

dgp goutham sawang on attacks
dgp goutham sawang on attacks

తెదేపా అధికార ప్రతినిధి రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న ముఖ్యమంత్రిని అసభ్యపదజాలంతో దూషించటమే ప్రతిచర్యలకు (రియాక్షన్‌) కారణమైందని, అవేమిటో అందరూ చూశారని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ అన్నారు. ఇది దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. అయితే తెదేపా అధికార ప్రతినిధి పొరపాటున నోరుజారి వ్యాఖ్యలు చేయలేదని.... కావాలనే పదేపదే అసభ్య పదజాలాన్ని వినియోగించారని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్న ఓ రాజకీయ పార్టీ కార్యాలయం నుంచి అలాంటి దుర్భాషలు సరికాదన్నారు. ఆ వ్యాఖ్యల పట్ల కొన్ని వర్గాల ప్రజల ఆకస్మిక ప్రతిచర్యను తామూ ఊహించలేదన్నారు. మంగళగిరిలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడారు.

‘గుజరాత్‌లోని ముంద్రా పోర్టులో హెరాయిన్‌ పట్టుబడ్డప్పటి నుంచి తప్పుడు ఆరోపణలతో వాతావరణాన్ని కలుషితం చేయటం మొదలుపెట్టారు. విజయవాడ చిరునామా వినియోగించుకోవటం మినహా ఆ కేసుతో ఆంధ్రప్రదేశ్‌కు ఎలాంటి సంబంధమూ లేదని విజయవాడ నగర పోలీసు కమిషనర్‌, నేనూ పదే పదే స్పష్టతిచ్చాం. డీఆర్‌ఐ, కేంద్ర సంస్థలూ ఎప్పటికప్పుడు వివరాలు వెల్లడిస్తున్నాయి. అయినా నెల రోజులుగా ఒక పద్ధతి ప్రకారం తప్పుడు ఆరోపణలు చేస్తూ మంగళవారం నాటికి హద్దులన్నీ దాటేశారు. రాజ్యాంగబద్ధ పదవుల్లోని రాష్ట్రపతి, ప్రధానమంత్రి, న్యాయస్థానాలు, న్యాయమూర్తులు, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా అసభ్యపదజాలం వాడకూడదు. దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాం. ఎవరైనా సరే హుందాగా వ్యవహరించాలి’ అని డీజీపీ వివరించారు. గురువారం జరగబోయే పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమం వివరాలు వెల్లడించిన డీజీపీ దాదాపు పావుగంటసేపు విలేకర్ల ప్రశ్నలకు సమాధానమిచ్చారు. అందులో ఏడున్నర నిమిషాలు తెదేపా అధికార ప్రతినిధి పట్టాభి వ్యాఖ్యలపైనే మాట్లాడారు. తెదేపా కార్యాలయంపై దాడి, పోలీసుల వైఫల్యంపై ప్రశ్నలకు నేరుగా సమాధానమివ్వకుండా దాటవేసేలా మాట్లాడారు.

  • విలేకరి: అసభ్యపదజాలం వినియోగించినందునే ప్రతిచర్య అంటున్నారు. దాడుల్ని సమర్థిస్తున్నారా?
    డీజీపీ: నేను దాని గురించి చెప్పట్లేదు.
  • విలేకరి: నెల రోజులుగా ప్రణాళిక ప్రకారమే తెదేపా అధికార ప్రతినిధి ఆరోపణలు చేస్తున్నారని మీరు అంటున్నారు. దాడి కూడా పక్కా ప్రణాళిక ప్రకారమే జరిగే అవకాశం ఉందని గుర్తించి ఎందుకు అడ్డుకోలేకపోయారు? ఇది పోలీసు వైఫల్యం కాదా?
    డీజీపీ: దర్యాప్తు జరుగుతోంది. ఆ విషయాలన్నీ అందులో తేలుతాయి.
  • విలేకరి: పోలీసుల సహకారంతోనే దాడి జరిగిందని ప్రతిపక్షాలు అంటున్నాయి కదా.
    డీజీపీ: అవి ఆరోపణలు మాత్రమే
  • విలేకరి: దాడి జరిగే అవకాశం ఉందని చెప్పేందుకు డీజీపికి ఫోన్‌ చేసినా స్పందించలేదని చంద్రబాబు అంటున్నారు?
    డీజీపీ: మంగళవారం సాయంత్రం 5.03 గంటల సమయంలో నేను పరేడ్‌ గ్రౌండ్‌లో ఉండగా గుర్తుతెలియని నెంబర్‌ నుంచి వాట్సప్‌ కాల్‌ వచ్చింది. ఎవరు మాట్లాడుతున్నారో తెలియదు. అక్కడ పోలీసు బ్యాండ్‌ మోగుతుండటంతో నాకు సరిగ్గా వినిపించక తర్వాత ఫోన్‌ చేస్తానన్నాను. ఎస్పీకి, మంగళగిరి పట్టణ, గ్రామీణ పోలీసుస్టేషన్లకు ఫోన్‌ చేసినా స్పందించలేదంటున్నారు. వారంతా మాట్లాడి స్పందించారు.
  • విలేకరి: తెదేపా కార్యాలయంపై దాడి ఘటనలో ఎవరినైనా అరెస్టు చేశారా?
    డీజీపీ: ఈ రోజు అమరవీరుల గురించి మాట్లాడుకునే రోజు (సోల్‌మేన్‌ డే). ఇది సందర్భం కాదు. తర్వాత మాట్లాడదాం.
  • విలేకరి: తెదేపా కార్యాలయంలో కొందరు నాయకులు ఓ పోలీసు అధికారిని పట్టుకున్నారు. దీనిపై మీ స్పందనేంటి?
    డీజీపీ: మేం వివాదాల్లోకి వెళ్లదలుచుకోలేదు. చట్టప్రకారమే వ్యవహరిస్తాం. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తి అదుపులో ఉన్నాయి. వాటికి భంగం కలిగించాలని చూసే వారిని ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉన్నాం.
  • విలేకరి: విశాఖ మన్యంలో గిరిజనులపై కాల్పులు జరిపిన తెలంగాణ పోలీసులపై హత్యాయత్నం కేసు నమోదు చేశారా?
    డీజీపీ: గంజాయిని అరికట్టేందుకు తెలంగాణ, ఏపీ పోలీసులు సంయుక్తంగా సోదాలు, తనిఖీలు చేపడుతున్నాం. రాబోయేరోజుల్లో ఉద్ధృతం చేస్తాం.

గంజాయి సమస్య కొత్తది కాదు

‘గంజాయి సమస్య ఇప్పుడే పుట్టుకొచ్చింది కాదు. ఏవోబీలోని మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాల్లో దశాబ్దాలుగా సాగవుతోంది. దీన్ని అరికట్టేందుకు చర్యలు చేపడుతున్నాం. ఇప్పుడిప్పుడే మార్పులు వస్తున్నాయి. 2018లో 579 కేసులు నమోదు చేసి 2,174 మందిని అరెస్టు చేస్తే... మేం ఈ ఒక్క ఏడాదిలోనే 1,456 కేసులు పెట్టి 4,059 మందిని అరెస్టు చేశాం. 3 లక్షల కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నాం’ అని డీజీపీ చెప్పారు.

ఇదీ చదవండి: CM Jagan: అభిమానులకు బీపీ వచ్చింది.. రియాక్ట్ అయ్యారు: సీఎం జగన్

Last Updated : Oct 21, 2021, 5:23 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.