ETV Bharat / city

మహిళా కేసుల విచారణకు త్వరలో ప్రత్యేక న్యాయస్థానాలు: డీజీపీ

author img

By

Published : Jul 10, 2021, 3:36 PM IST

Updated : Jul 11, 2021, 2:10 PM IST

లేటరైట్ సమస్య ఈనాటిది కాదని.. దాన్ని రాజకీయం చేయటం తగదని డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. నేతలు మారుమూల ప్రాంతాలకు వెళ్లడం సురక్షితం కాదన్నారు. మహిళలకు సంబంధించిన కేసుల విచారణకు ప్రత్యేక న్యాయస్థానాలు అందుబాటులోకి తేనున్నామని ఆయన అన్నారు.

dgp-comments
dgp-comments

మహిళలకు సంబంధించిన కేసుల విచారణకు ప్రత్యేక న్యాయస్థానాలు అందుబాటులోకి తేనున్నామని డీజీపీ గౌతం సవాంగ్‌ వెల్లడించారు. మహిళల భద్రతలో దేశానికే ఆంధ్రప్రదేశ్‌ ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. శనివారం విశాఖలోని ఎ.యు. కన్వెన్షన్‌ కేంద్రంలో ‘మహిళా భద్రత ధ్యేయంగా దిశ.. విధి విధానాలు’ పేరిట నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ‘ స్పందనకు వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా గత 20 నెలల్లో సుమారు 31,900 కేసులు నమోదు చేశాం. పోలీసులకు అందిన 1,26,500 ఫిర్యాదుల్లో 52 శాతం మహిళల నుంచే ఉన్నాయి. ప్రాథమిక దశలోనే మహిళల సమస్యలను గుర్తించి తగిన న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. గ్రామ, వార్డు స్థాయిలో మహిళా పోలీసులు, మిత్రలు ఆ మేరకు తగిన చర్యలు తీసుకోవాలి. దిశా యాప్‌తో నిమిషాల వ్యవధిలోనే పోలీసు సాయం అందే పరిస్థితి వచ్చింది. శ్రీకాకుళం జిల్లాలో 12 ఏళ్ల బాలికను గర్భవతిని చేసిన ఓ వంచకుడి ఉదంతం ఓ మహిళా పోలీసు కారణంగానే వెలుగులోకి వచ్చిందని’ పేర్కొన్నారు.

విజయనగరం జిల్లా కొత్తవలసకు చెందిన అనితా మార్గరేట్‌ అనే మహిళా పోలీసు మాట్లాడిన తీరు స్ఫూర్తివంతంగా ఉందని పేర్కొంటూ ఆమెను వేదికపైకి పిలిచి అభినందించారు. టెక్నికల్‌ విభాగం డీఐజీ పాలరాజు మాట్లాడుతూ త్వరలో మొబైల్‌ ఫోరెన్సిక్‌ వ్యాన్లు కూడా అందుబాటులోకి రానున్నాయన్నారు. మహిళలు తాము ఎదుర్కొంటున్న సమస్యలను పోలీసులకు చెప్పాలా? వద్దా? అని సంకోచిస్తుంటారని, అలాంటి భయాల్ని తొలగించి మహిళా పోలీసులు వారిలో ధైర్యం నింపాలని విశాఖ సీపీ మనీశ్‌కుమార్‌ సిన్హా అన్నారు. దిశ యాప్‌, మహిళలకు పోలీసులు అందిస్తున్న వివిధ సేవలను వివరించే కరపత్రాన్ని డీజీపీ ఆవిష్కరించారు.

లేటరైట్‌ సమస్య ఎప్పటి నుంచో ఉంది..!

లేటరైట్‌ సమస్య ఎప్పటి నుంచో ఉందని, నాయకులు మారుమూల ప్రాంతాలకు వెళ్లడం సురక్షితం కాదని తాము అడ్డుకున్నామని డీజీపీ గౌతం సవాంగ్‌ ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. విశాఖ నుంచి గంజాయి తరలింపులో మావోయిస్టుల సహకారం ఉందని, దీని రవాణాపై నిఘా పెట్టామన్నారు.. కొవిడ్ సోకిన నక్సల్స్​ లొంగిపోతే మెరుగైన వైద్యం అందిస్తామన్నారు.

తెదేపా నేతల అరెస్ట్

తూర్పుగోదావరి - విశాఖ జిల్లాల సరిహద్దు మన్యం ప్రాంతంలో మైనింగ్‌ తవ్వకాలపై తెలుగుదేశం నిజనిర్ధారణ బృందం శుక్రవారం చేపట్టిన యాత్ర.. తీవ్ర ఉద్రిక్తత, అరెస్టులకు దారి తీసింది. రౌతులపూడి మండల అటవీ ప్రాంతంలో పర్యటించిన తెలుగుదేశం బృందం.. రిజర్వ్‌ ఫారెస్టులో రోడ్డు నిర్మాణం, మైనింగ్‌ ప్రాంతం నుంచి లేటరైట్‌ తరలింపు అంశాలను పరిశీలించింది. తవ్వకాలపై గిరిజనుల అభిప్రాయాలు తెలుసుకుంది. ఆ తర్వాత వివరాలను మీడియాకు వివరించేందుకు సిద్ధమైన నేతలను అడ్డుకున్న పోలీసులు.. అరెస్టు చేసి కోటనందూరు తరలించారు. అనంతరం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు.

ఇదీ చదవండి

CHANDRABABU: బాక్సైట్​ తవ్వకాలపై సీబీఐ విచారణ జరిపించాలి: చంద్రబాబు

Last Updated : Jul 11, 2021, 2:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.