కనకదుర్గ పైవంతెన...ఇదో ఇంజినీరింగ్ అద్భుతం. స్పైన్ అండ్ వింగ్స్ టెక్నాలజీతో దేశంలో నిర్మితమైన అతి పొడవైన వంతెన. మనకంటే ముందు దిల్లీ, ముంబయిలలో ఈ టెక్నాలజీతో ఫ్లై ఓవర్లు నిర్మించినప్పటికీ..,దేశంలో అతి పొడవైనది మాత్రం విజయవాడలోని కనకదుర్గ ప్లై వంతెనేనని ఇంజినీరింగ్ అధికారులు చెబుతున్నారు. వంతెన పొడవు 2.60 కిలోమీటర్లు కాగా...నిర్మాణానికి రూ.447.80 కోట్లు ఖర్చు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యయం 114.59 కోట్లు ఖర్చుచేయగా...కేంద్రం 333.21 కోట్లు భరించింది. కనకదుర్గ ఫ్లై ఓవర్ ప్రాజెక్టులో నాలుగు వరుసల రోడ్డు, ఆరు లైన్ల ఫ్లై ఓవర్ అంతర్భాగంగా ఉన్నాయి.
సోమా ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ సంస్థ ప్రాజెక్టును దక్కించుకోగా...కేంద్ర ప్రభుత్వం 2015 డిసెంబరు 28ని అపాయింట్ డేట్‌గా ఇచ్చింది. పన్నెండు నెలల్లో పూర్తి చేయాలని నిర్దేశించింది. విభిన్నమైన టెక్నాలజీ, సాంకేతిక పరమైన అంశాల కారణంగా ఈ ఫ్లై ఓవర్ పూర్తి కావటానికి దాదాపుగా ఐదేళ్ల సమయం తీసుకుంది. మొత్తం 47 పిల్లర్లపై ఫ్లై ఓవర్‌ను నిర్మించారు. అందులో ఆరు భారీ వై పిల్లర్స్. పిల్లర్స్ కోసం భూమిలో 417 పైల్స్‌ను నిర్మించారు. అలాగే..667 స్పైన్స్ నిర్మించారు. ఈ స్పైన్స్‌తో 46 స్పాన్ బ్లాక్స్‌లను నిర్మించి స్సైన్స్‌కు 1,406 రెక్కలను అమర్చారు. 47 సింగిల్ పిల్లర్స్ మీదనే ఆరు వరసలతో ఈ ఫ్లై ఓవర్‌ను నిర్మించారు.
కనకదుర్గ పైవంతెనను దసరాకు ముందు విజయవాడ వాసులకు కానుకగా అందించబోతున్నారు. ఉదయం 11.30 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రి జగన్‌మోహనరెడ్డి, కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరీ లాంఛనంగా ప్రారంభించనున్నారు. దీంతోపాటు 15 వేల కోట్ల ఇతర అభివృద్ధి పనులకూ ప్రారంభోత్సవం, భూమిపూజ వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ వంతెన ప్రారంభం ద్వారా విజయవాడ నగర వాసుల ట్రాఫిక్ కష్టాలు తీరుతాయనే అభిప్రాయాన్ని ప్రజాప్రతినిధులు, అధికారులు వ్యక్తం చేశారు.
ఇదీచదవండి