ETV Bharat / city

CM KCR: ప్రధాని మోదీ చెప్పేదొకటి.. చేసేదొకటి: సీఎం కేసీఆర్‌

author img

By

Published : Feb 13, 2022, 7:40 PM IST

Updated : Feb 13, 2022, 10:17 PM IST

CM KCR Comments
ప్రధాని మోదీ చెప్పేదొకటి.. చేసేదొకటి: సీఎం కేసీఆర్‌

CM KCR Comments: ప్రధాని నరేంద్ర మోదీ చెప్పేదొకటి.. చేసేదొకటి అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆరోపించారు. దేశంలో 4 లక్షల మెగావాట్ల విద్యుత్‌ ఉన్నా.. వాడే తెలివి కేంద్రానికి లేదని సీఎం కేసీఆర్‌ ఎద్దేవా చేశారు.

ప్రధాని మోదీ చెప్పేదొకటి.. చేసేదొకటి: సీఎం కేసీఆర్‌

CM KCR: ప్రధాని నరేంద్ర మోదీ చెప్పేదొకటి.. చేసేదొకటి అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆరోపించారు. ప్రగతిభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ విధానాలపై మరోసారి విమర్శలు గుప్పించారు. విద్యుత్‌ సంస్కరణలపై కేంద్రం ముసాయిదా బిల్లు తెచ్చిందని.. కేంద్ర ముసాయిదా బిల్లు అంశాలను సీఎం కేసీఆర్‌ వివరించారు. సాగు రంగం ఆశాజనకంగా లేదని కేంద్రం చెబుతోందన్న ఆయన సాగు కోసం కొత్త విద్యుత్‌ కనెక్షన్లు ఇవ్వకూడదనేది కేంద్ర విధానమని మండిపడ్డారు. వంద శాతం మీటరింగ్‌పై డిస్కంలు చర్యలు తీసుకోవాలన్నారని ముఖ్యమంత్రి కేసీఆర్​ తెలిపారు.

పచ్చి అబద్ధాలు చెప్పారు..
మిషన్‌ భగీరథ పథకం ప్రారంభోత్సవానికి ప్రధానిని పిలిచానని సీఎం కేసీఆర్​ పేర్కొన్నారు. ఆ బహిరంగ సభలో ప్రధాని పచ్చి అబద్దాలు చెప్పారని సీఎం ఆరోపించారు. యూనిట్‌కు రూ.11 చొప్పున కొని రూ.1.10కే రాష్ట్రాలకు ఇచ్చినట్లు చెప్పారని తెలిపారు. కేంద్రం ఎన్నడూ రూ.1.10కు ఏ రాష్ట్రానికి విద్యుత్‌ ఇవ్వలేదన్నారు. కేంద్ర అబద్దాలపై చర్చకు రావాలన్నా భాజపా నేతలు ముందుకు రారన్నారు. దేశంలో 4 లక్షల మెగావాట్ల విద్యుత్‌ ఉన్నా.. వాడే తెలివి కేంద్రానికి లేదని సీఎం కేసీఆర్​ ఎద్దేవా చేశారు.

గోల్​మాల్​ చేస్తున్నారు..

"విద్యుత్‌ సంస్కరణలు తెస్తున్నారు.. అందులో భాగంగా ముసాయిదా బిల్లును వివిధ రాష్ట్రాలకు పంపించారు. ఆ బిల్లుపై 7, 8 రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ అభిప్రాయాలను కూడా చెప్పారు. బిల్లు ఆమోదానికి ముందే రాజ్యాంగాన్ని ఉల్లంఘించారు. విద్యుత్‌ సంస్కరణలు వ్యతిరేకిస్తూ తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించాం. సంస్కరణలు అమలు చేస్తే అరశాతం ఎఫ్ఆర్‌బీఎం ఐదేళ్ల పాటు ఇస్తామన్నారు. విద్యుత్‌ సంస్కరణలకు అదనపు రుణాలు తీసుకుంటున్నారు. అదనపు రుణాల విషయమై కేంద్ర బడ్జెట్‌లో కూడా చెప్పారు. కేంద్ర ముసాయిదా బిల్లుకు ఏపీ అంగీకరించింది. శ్రీకాకుళం జిల్లాలో 25వేల వ్యవసాయ మోటార్లకు మీటర్లు కూడా పెట్టారు. మిగతా విద్యుత్‌ మీటర్లకు రూ.737 కోట్లతో టెండర్లు పిలిచారు. కేంద్రం చెప్పినట్టు విద్యుత్‌ సంస్కరణలు అమలు చేయకపోతే తెలంగాణ రాష్ట్రం ఐదేళ్లలో రూ.25వేల కోట్లు నష్టపోయే అవకాశముంది. అయినా సరే, మోటార్లకు మీటర్లు పెట్టబోమని స్పష్టంగా చెప్పాం. చరిత్రను కప్పిపుచ్చి భాజపా నేతలు గోల్‌మాల్‌ చేస్తున్నారు. బహిరంగ సభల్లో అన్ని విషయాలు చెప్పలేం. విద్యుత్‌ సంస్కరణలు అమలు చేయమని కేంద్రం చెప్పినట్టు నిరూపిస్తే క్షమాపణ చెబుతానని బండి సంజయ్‌ అన్నారు. ఇవిగో.. ఆధారాలు. బండి సంజయ్‌ క్షమాపణ చెప్పాలి. సాగుకోసం కొత్త విద్యుత్‌ కనెక్షన్లు ఇవ్వకూడదనేది కేంద్ర విధానం. వందశాతం మీటరింగ్‌పై డిస్కంలు చర్యలు తీసుకోవాలన్నారు. వినియోగదారులకు ఏడాదిలోగా విద్యుత్‌మీటర్లు పెట్టాలన్నారు"

-కేసీఆర్, తెలంగాణ ముఖ్యమంత్రి​

CM KCR Comments: దమ్ముంటే తనను జైలుకు పంపాలని భాజపా నేతలకు కేసీఆర్ సవాల్​ విసిరారు. కేంద్ర ప్రభుత్వంపై సీఎం కేసీఆర్‌ మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. దేశంలో 4 లక్షల మెగావాట్ల విద్యుత్‌ ఉన్నా.. వాడే తెలివి కేంద్రానికి లేదని సీఎం కేసీఆర్‌ అన్నారు. భాజపా తన సిద్ధాంతాలు గాల్లో కలిపేసిందని ఆరోపించారు. కర్ణాటక, మధ్యప్రదేశ్‌, మణిపూర్​లో గెలవకపోయినా భాజపా పాలిస్తోంది. మహారాష్ట్రలోనూ గెలవకపోయినా పాలించాలని యత్నించి.. బోల్తా పడ్డారని ఎద్దేవా చేశారు.

"రఫేల్‌ జెట్‌ విమానాల కొనుగోలులో గోల్‌మాల్‌ జరిగింది. మనకంటే చౌకగా ఇండోనేషియా రఫేల్‌ విమానాలు కొన్నది. భాజపా పాలకుల అవినీతి చిట్టా నాదగ్గర ఉంది. అవినీతి గురించి దిల్లీలో పంచాయతీ పెడతా. మీకు దమ్ముంటే నన్ను జైలుకు పంపాలి. నన్ను జైల్లో పెట్టుడు కాదు.. మేం మిమ్మల్ని జైలుకు పంపేది మాత్రం పక్కా. ఎన్నికల్లో గెలవకపోయినా పాలించే సిగ్గులేని పార్టీ భాజపా." - తెలంగాణ సీఎం కేసీఆర్​

ఇదీ చూడండి:

Last Updated :Feb 13, 2022, 10:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.