ETV Bharat / city

మూడు రోజుల్లో మిగతావారికీ ఆర్థిక సాయం అందాలి: సీఎం

author img

By

Published : May 11, 2020, 2:15 PM IST

Updated : May 11, 2020, 3:09 PM IST

విశాఖ గ్యాస్ లీకేజ్ ప్రభావితం ప్రాంతాల్లో ప్రతి మనిషికీ రూ.10 వేలు ఇవ్వాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. మంత్రులంతా ఐదు గ్రామాల్లో ఈ రాత్రికి బస చేయాలని సూచించారు. ఈ రాత్రికి ఊళ్లోకి వచ్చిన వారందరికీ భోజనాలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు తెలిపారు.

cm jagan video conferenc on vishaka gas leakage
cm jagan video conferenc on vishaka gas leakage

మూడు రోజుల్లో మిగతావారికీ ఆర్థిక సాయం అందించాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు. విశాఖ గ్యాస్‌ లీక్‌ ఘటనపై అధికారులతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. సహాయకచర్యలు, పరిహారంపై మంత్రులు, అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి జగన్‌కు మంత్రులు, అధికారులు వివరాలు అందించారు.

మరణించిన కుటుంబాల్లోని 8 మందిలో ఐదుగురికి పరిహారం ఇచ్చామని ముఖ్యమంత్రికి మంత్రులు వివరించారు. మిగిలినవారు నగరానికి దూరంగా ఉన్నారని.. వారికి కూడా పరిహారం అందిస్తామని తెలిపారు.

గ్రామాల్లో, ఇళ్లల్లో శానిటేషన్‌ పనులు ప్రారంభమయ్యాయని, సాయంత్రానికి ముగుస్తాయని సీఎం దృష్టికి మంత్రులు తీసుకొచ్చారు. సాయంత్రం 4 గంటల తర్వాత ప్రజలను ఊళ్లలోకి అనుమతించనున్నట్లు తెలిపారు.

మంత్రులంతా విశాఖ గ్యాస్ లీకేజ్ పరిసరాల్లోని ఐదు గ్రామాల్లో ఈ రాత్రికి బస చేయాలని సీఎం ఆదేశాలు జారీచేశారు. ఈ రాత్రికి ఊళ్లోకి వచ్చిన వారందరికీ భోజనాలు ఏర్పాటు చేయాలన్న సీఎం.. గ్యాస్‌ లీక్‌ ప్రభావిత గ్రామాల్లో ప్రతి మనిషికీ రూ.10 వేలు ఇవ్వాలని ఆదేశించారు. మహిళల ఖాతాల్లో డబ్బు జమ చేయాలన్నారు. లీకేజీ సంభవించిన ట్యాంకులో ప్రస్తుతం 73 డిగ్రీల సెంటీగ్రేడ్‌ ఉందని కలెక్టర్‌ తెలిపారు. ఐదు ట్యాంకుల్లో 13 వేల టన్నుల స్టైరిన్‌ను కొరియాకు తరలిస్తున్నామని వెల్లడించారు.

సీఎం ఇంకా ఏమన్నారంటే..

  1. రేపు ఉదయం వాలంటీర్లతో బ్యాంకు ఖాతాలు సేకరించాలి.
  2. అన్‌ఇన్‌కంబర్డ్‌ ఖాతాల్లో డబ్బు వేసేలా బ్యాంకర్లతో మాట్లాడి చర్యలు తీసుకోవాలి.
  3. పారదర్శకంగా, ఫిర్యాదులు లేకుండా ఆర్థికసాయం అందించే కార్యక్రమాలు కొనసాగించాలి.
  4. ఆర్థిక సహాయం పొందేవారి జాబితాలను గ్రామ సచివాలయాల్లో ఉంచాలి.
  5. ఎవరి పేరైనా లేకపోతే.. వారు పేరు ఎలా నమోదు చేసుకోవాలో తెలియజేయాలి.
  6. ఆస్పత్రిలో ఉన్నవారికీ వీలైనంత ఆర్థికసాయం అందించాలి.
  7. రాష్ట్రమంతటా పరిశ్రమల్లో విస్తృతంగా తనిఖీలు చేయాలి.
  8. కేంద్ర ప్రభుత్వ కమిటీల అభిప్రాయాలను కూడా పూర్తిగా పరిగణనలోకి తీసుకోవాలి.
Last Updated : May 11, 2020, 3:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.