ETV Bharat / city

గడువులోగా ప్రాజెక్టుల పనులు పూర్తిచేయాలి: సీఎం జగన్

author img

By

Published : Mar 29, 2022, 5:13 PM IST

Updated : Mar 30, 2022, 4:08 AM IST

సంగం బ్యారేజికి మేకపాటి గౌతమ్‌ రెడ్డి సంగం బ్యారేజిగా నోటిఫై చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. జలవనరులశాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్.. పోలవరం సహా ప్రాధాన్యత ప్రాజెక్టులను నిర్ణీత వ్యవధిలోగా పూర్తయ్యేలా కార్యాచరణ అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతిపైనా దృష్టిపెట్టాలని అధికారులకు సూచించారు.

గడువులోగా ప్రాజెక్టుల పనులు పూర్తిచేయాలి
గడువులోగా ప్రాజెక్టుల పనులు పూర్తిచేయాలి

‘పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టులో మొదటి టన్నెల్‌ నుంచి సెప్టెంబరులో నీళ్లిచ్చేలా చర్యలు తీసుకోవాలి. 2023 నాటికి ప్రాజెక్టులో అన్ని పనులనూ పూర్తి చేసి రెండు టన్నెళ్ల ద్వారా నీళ్లివ్వాలి. వంశధార- నాగావళి అనుసంధానం పనులను అక్టోబరు నాటికి పూర్తి చేయాలి. నేరడి బ్యారేజి పనులనూ ప్రారంభించాలి’ అని అధికారులను ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశించారు. ప్రాధాన్య ప్రాజెక్టుల పురోగతి, పోలవరం పనుల తీరుపై ఆయన మంగళవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. వివిధ ప్రాజెక్టులకు సంబంధించి ఇప్పటివరకు జరిగిన పనులు, చేయాల్సిన పనులపై అధికారులతో మాట్లాడారు. గడువులోగా ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాలని ఆదేశించారు.

* ‘వెలిగొండ ప్రాజెక్టు నుంచి ఉదయగిరి, బద్వేలు ప్రాంతాలకు నీటిని అందించేందుకు అవసరమైన పనులకు టెండర్లు పిలవాలి. ప్రధాన డ్యాం డిజైన్లు త్వరలో ఖరారవుతాయి. వీలైనంత త్వరగా డిజైన్లను ఆమోదింపజేసుకోవాలి.

* పోలవరం నిర్వాసితులకు పునరావాస ప్యాకేజి నిధులను నేరుగా బదిలీ చేయాలి.

* సంగం బ్యారేజిని మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజిగా నోటిఫై చేయాలి.

* అవుకు రెండో టన్నెల్‌లో లైనింగుతో సహా ఆగస్టు నాటికి పనులన్నీ పూర్తి చేయాలి.

* నేరడి బ్యారేజి నిర్మాణ వ్యయం మొత్తాన్ని దాదాపుగా రాష్ట్రమే భరిస్తోంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఒడిశా సగం నీళ్లు వాడుకునేందుకు అవకాశముంటుంది. వీలైనంత త్వరగా పనులను ప్రారంభించాలి.

* ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు ప్రధాన కాలువను శ్రీకాకుళం వరకూ తీసుకెళ్లాలి.

* గజపతినగరం బ్రాంచి కాలువలో, తారకరామ తీర్థసాగర్‌ ప్రాజెక్టులో మిగిలిన పనులకు ఆర్థికశాఖ అనుమతులు తీసుకుని టెండర్లు పిలవాలి. సారిపల్లి గ్రామానికీ పునరావాస ప్యాకేజీ ఇవ్వాలి’ అని సీఎం జగన్‌ ఆదేశించారు.

మే 15 నాటికి సంగం, నెల్లూరు బ్యారేజి పనులు పూర్తి: ఆయా ప్రాజెక్టుల చీఫ్‌ ఇంజినీర్లు, అధికారులు పనుల పురోగతిపై సీఎంకు సమావేశంలో వివరించారు. పోలవరం పునరావాసంపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. +41.15 మీటర్ల ఎత్తులో నీటిని నిల్వ చేస్తే 20,946 కుటుంబాలను తరలించాల్సి ఉంటుందని, ఇప్పటివరకు 7,962 కుటుంబాలను తరలించామని పేర్కొన్నారు. నెల్లూరు, సంగం బ్యారేజిల పనులు పూర్తి చేసి మే15 నాటికి ప్రారంభోత్సవానికి సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు. అవుకు రెండో టన్నెల్‌లో మిగిలిన పనులు 120 రోజుల్లో పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించామని వివరించారు. సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మ, జల వనరులశాఖ మంత్రి అనిల్‌ కుమార్‌, ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌, పునరావాస కమిషనరు చెరుకూరి శ్రీధర్‌, ఉన్నతాధికారులు హాజరయ్యారు.

వంశధారపై నేరడి వద్ద బ్యారేజీకి పనులు ప్రారంభించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని జగన్ అధికారులను ఆదేశించారు. తోటపల్లి ప్రాజెక్టు కింద అన్ని పనులనూ వీలైనంత త్వరగా పూర్తిచేయాలన్నారు. సంగం బ్యారేజికి మేకపాటి గౌతమ్‌ రెడ్డి సంగం బ్యారేజిగా నోటిఫై చేయాలని సీఎం ఆదేశించారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతిపైనా దృష్టిపెట్టాలన్న సీఎం.. మెయిన్‌ కెనాల్‌ను శ్రీకాకుళం వరకూ తీసుకెళ్లాలన్నారు. దీనికి సంబంధించిన భూ సేకరణ తదితర అంశాలపై దృష్టిపెట్టాలని సూచించారు.

పోలవరం సహా ఇతర ప్రాధాన్యతా ప్రాజెక్టులను గడువులోగా పూర్తిచేయాలి. ఈసీఆర్‌ఎఫ్‌ డ్యామ్‌ డిజైన్లు త్వరలో ఖరారవుతాయి. వీలైనంత త్వరగా డిజైన్లు తెప్పించుకోవాలి. సంగం బ్యారేజీకి మేకపాటి గౌతమ్‌ రెడ్డి పేరు నోటిఫై చేయాలి. ఉత్తరాంధ్ర సుజల స్రవంతిపై దృష్టిపెట్టాలి. మెయిన్‌ కెనాల్‌ను శ్రీకాకుళం వరకు తీసుకెళ్లాలి. కెనాల్‌కు భూ సేకరణ తదితర అంశాలపై దృష్టిపెట్టాలి. -జగన్ సీఎం

ఇదీ చదవండి: తనపై నమోదైన కేసు కొట్టేయాలని.. తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన సీఎం జగన్

Last Updated : Mar 30, 2022, 4:08 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.