ETV Bharat / city

CM JAGAN REVIEW: పెళ్లికి హాజరయ్యే వారి సంఖ్య 150కి పరిమితం చేయాలి: సీఎం జగన్‌

author img

By

Published : Aug 2, 2021, 3:30 PM IST

Updated : Aug 3, 2021, 4:43 AM IST

కొవిడ్ నియంత్రణ, వైద్యశాఖలో 'నాడు-నేడు'పై అధికారులతో ముఖ్యమంత్రి జగన్ సమీక్షించారు. ప్రభుత్వాసుపత్రుల్లో సేవలు మరింత మెరుగుపరచాలని సీఎం అధికారులను ఆదేశించారు. కొవిడ్ నివారణ చర్యలపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్న ఆయన..పెళ్లిళ్లు, శుభకార్యాలకు తక్కువమంది హాజరయ్యేలా చూడాలన్నారు.

ముఖ్యమంత్రి జగన్
ముఖ్యమంత్రి జగన్

కొవిడ్‌ ప్రమాణాలకు అనుగుణంగా పెద్ద ఎత్తున జనం గుమికూడకుండా చూడాలని అధికారులను ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశించారు. పెళ్లిళ్ల సీజన్లో ప్రజలు ఒకేచోట భారీగా గుమిగూడే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. ఒక్కో పెళ్లికి 150 మందే హాజరయ్యేలా చూడాలని స్పష్టం చేశారు. ఊరేగింపులు, మతపరమైన కార్యక్రమాల్లోనూ ఎక్కువ మంది గుమికూడకుండా చూడాలన్నారు. వ్యాక్సినేషన్‌ ప్రక్రియ జోరుగా సాగేంతవరకు ఈ జాగ్రత్తలు తప్పనిసరని పేర్కొన్నారు. ముఖ్యంగా వచ్చే 2 నెలలపాటు మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులకు స్పష్టం చేశారు. కొవిడ్‌-19 నియంత్రణ, టీకాల పంపిణీ పురోగతిని సోమవారం ఉన్నతాధికారుల సమావేశంలో ఆయన సమీక్షించారు. ‘ఆర్టీపీసీఆర్‌ ద్వారానే వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేయాలి. అప్పుడే కచ్చితమైన ఫలితాలొస్తాయి. ఇంటింటి సర్వే ద్వారా అనుమానిత లక్షణాలున్న వారిని గుర్తించి వెంటనే పరీక్షలు చేయాలి. నిరంతరం పర్యవేక్షిస్తూ 104 కాల్‌సెంటర్‌ను సమర్థంగా ఉపయోగించుకోవాలి. ఆగస్టు 16 నుంచి పాఠశాలలు పునఃప్రారంభమవుతున్నందున ఉపాధ్యాయులందరికీ టీకాలు వేయడం పూర్తి చేయాలి. గర్భిణులు, 45ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సినేషన్‌లో ప్రాధాన్యమివ్వాలి’ అని సీఎం పేర్కొన్నారు.

విలేజ్‌ క్లినిక్‌లను అనుసంధానించాలి

పీహెచ్‌సీలతో విలేజ్‌ క్లినిక్‌లను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అనుసంధానించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ‘గ్రామంలో ప్రజల ఆరోగ్య వివరాలపై మ్యాపింగ్‌ జరగాలి. ఆరోగ్యశ్రీ కార్డుపై ఉండే ‘క్యూఆర్‌ కోడ్‌’ ద్వారా సంబంధిత వ్యక్తి పూర్తి ఆరోగ్య వివరాలను తెలుసుకునేలా ఏర్పాట్లు ఉండాలి. ఇవి విలేజ్‌ క్లినిక్‌లలోనూ అందుబాటులో ఉంచాలి. ఫ్యామిలీ డాక్టర్‌ విధానంలో వైద్యుడు గ్రామానికి వెళ్లినప్పుడు ఇది ఉపకరిస్తుంది. డిసెంబరు నాటికి విలేజ్‌ క్లినిక్‌ల భవనాలను పూర్తి చేయాలి. వాటిల్లో ఆశా కార్యకర్తలు రిపోర్టు చేసేలా చర్యలు తీసుకోవాలి.

నాడు-నేడు కింద ఆసుపత్రుల అభివృద్ధి పనులు వేగంగా సాగాలి. కొత్తగా ఏర్పాటయ్యే 16 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో కార్పొరేట్‌ తరహా వాతావరణం కనిపించాలి. పడకలపై దుప్పట్ల నుంచి అందించే ప్రతి వైద్య సేవ ప్రైవేటు ఆసుపత్రులకు దీటుగా ఉండాలి. అనారోగ్యం పాలైన ప్రభుత్వ ఉద్యోగుల తొలి ఎంపిక ఈ ప్రభుత్వాసుపత్రులే అయ్యేలా తీర్చిదిద్దాలి’ అని సీఎం స్పష్టం చేశారు. బీఎస్సీ నర్సింగ్‌ (సీపీసీహెచ్‌) చదివిన వారిని విలేజ్‌ క్లినిక్‌లలో ఎంఎల్‌పీహెచ్‌గా నియమిస్తున్నామని సీఎంకు అధికారులు వివరించారు. ‘ఇక్కడ 65 రకాల మందులు, 67 రకాల పరికరాలను అందుబాటులో ఉంచుతాం. టెలీమెడిసిన్‌ సేవలు అందుబాటులోకి వస్తాయి. అవుట్‌పేషంట్‌ ఎగ్జామినేషన్‌ రూం, ల్యాబ్‌, ఫార్మసీ, వెయిటింగ్‌ హాల్‌, ఏఎన్‌ఎం క్వార్టర్‌ విలేజ్‌ క్లినిక్‌లలో భాగంగా ఏర్పాటు చేస్తున్నాం’ అని తెలిపారు.

ఇదీ చదవండి

payyavula keshav: 'బయటపెట్టిన అంశాలు కొన్నే.. ఇంకా పెద్ద ఆర్థిక ఉల్లంఘనలు జరిగాయ్​..'

Last Updated : Aug 3, 2021, 4:43 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.