ETV Bharat / city

అలా చేస్తే.. చంద్రబాబు గౌరవం పెరిగేది : వైకాపా

author img

By

Published : Oct 22, 2021, 3:45 PM IST

సీఎం జగన్ పై తెదేపా అధికార ప్రతినిధి పట్టాభి చేసిన వ్యాఖ్యల్ని.. వైకాపా మంత్రులు, ఎమ్మెల్యేలు తీవ్రంగా ఖండించారు. పట్టాభిని తెదేపా నుంచి తప్పించాలని చంద్రబాబును డిమాండ్ చేశారు.

ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్
ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని అసభ్య పదజాలంతో దూషించిన తెదేపా అధికార ప్రతినిధి పట్టాభి తీరును.. వైకాపా మంత్రులు, ఎమ్మెల్యేలు ఖండించారు. దీనికి బాధ్యున్ని చేస్తూ.. పట్టాభిని తక్షణమే పార్టీ నుంచి బహిష్కరించాలని.. లేదంటే ముఖ్యమంత్రి జగన్ కు చంద్రబాబు క్షమాపణలు చెప్పాలని ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ డిమాండ్ చేశారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మారుతీ నగర్ జంక్షన్ వద్ద శుక్రవారం జనాగ్రహ దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. తెలుగుదేశం నాయకులు ఎవరూ ఇకపై ప్రజల్లో తిరగలేరని అన్నారు.

తెదేపా చేస్తున్నవి దొంగ దీక్షలు..
తెలుగుదేశం పార్టీని కాపాడుకునేందుకే.. ఆ పార్టీ నాయకులు కుట్రలు చేస్తున్నారని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖమంత్రి శంకరనారాయణ ఆరోపించారు. సంతోషంగా ఉన్న ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకే.. దొంగ దీక్షలు చేస్తున్నారని అన్నారు. తెదేపా చేస్తున్న దీక్షల్ని ప్రజలు నమ్మరని అన్నారు మంత్రి. అనంతపురం జిల్లా పెనుకొండలో వైకాపా చేపట్టిన జనాగ్రహ దీక్ష రెండవ రోజుకు చేరింది. ఈ దీక్షలో పాల్గొన్న మంత్రి శంకరనారాయణ.. తెదేపాపై విమర్శలు గుప్పించారు.

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి.. చంద్రబాబు నాయుడు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి విశ్వరూప్ జనాగ్రహ దీక్ష చేపట్టారు. జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి చేసిన వ్యాఖ్యల్ని మంత్రి విశ్వరూప్ ఖండించారు.

'అలా చేస్తే.. చంద్రబాబు గౌరవం పెరిగేది'
తెదేపా అధినేత చంద్రబాబు తన వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకే.. అసభ్య పదజాలంతో సీఎం జగన్ ను తిట్టిస్తున్నారని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మండిపడ్డారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన పట్టాభిని పార్టీ నుంచి సస్పెండ్ చేసినా.. క్షమాపణ చెప్పించినా చంద్రబాబు గౌరవం పెరిగేదని అన్నారు. అలా కాకుండా పట్టాభిని సమర్థించేలా దీక్ష చేపట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని కరెంట్ ఆఫీస్ సెంటర్ వద్ద వైకాపా చేపట్టిన జనాగ్రహ దీక్షలో కోటం రెడ్డి పాల్గొన్నారు.

ఇదీ చదవండి: TDP Leaders On Jagan : ప్రశ్నిస్తే దాడులు చేస్తారా.. తెదేపా నేతల ఆగ్రహం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.