ETV Bharat / city

Car Accident: కరీంనగర్‌ కారు ప్రమాద ఘటనలో నిందితులు అరెస్టు

author img

By

Published : Jan 30, 2022, 4:00 PM IST

Updated : Jan 30, 2022, 5:19 PM IST

కరీంనగర్‌ కారు ప్రమాద ఘటనలో నిందితులు అరెస్టు
కరీంనగర్‌ కారు ప్రమాద ఘటనలో నిందితులు అరెస్టు

15:56 January 30

కారు యజమాని అరెస్టు...

Karimnagar Car Accident: కరీంనగర్‌ కారు ప్రమాదం ఘటనలో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. కారు యజమాని రాజేంద్రప్రసాద్​తో పాటు, మరో ముగ్గురు మైనర్లను అరెస్టు చేసినట్లు కరీంనగర్​ సీపీ సత్యనారాయణ.. మీడియా సమావేశంలో వెల్లడించారు. కారు యజమాని కుమారుడు(మైనర్‌) డ్రైవింగ్ చేశాడని సీపీ తెలిపారు. ప్రమాదానికి కారణం మైనర్​ డ్రైవింగేనని పేర్కొన్నారు.

హత్య కేసుగా

ఇద్దరు మైనర్​ స్నేహితులతో కలిసి బాలుడు కారు నడిపాడని.. కానీ వాహనం తానే నడిపినట్లు రాజేంద్రప్రసాద్​ పోలీసులను నమ్మించే ప్రయత్నం చేశారని సీపీ చెప్పారు. తర్వాత విచారణలో అతని కుమారుడే కారు నడిపినట్లు తేలిందన్నారు. బ్రేక్​ బదులు, ఎక్స్​లేటర్​​ తొక్కడంతో ఘోర ప్రమాదం జరిగిందని వివరించారు. ఘటనపై యాక్సిడెంట్‌ కేసు కాకుండా హత్య కేసు నమోదు చేస్తున్నామన్న సీపీ.. నలుగురి అమాయకుల ప్రాణాలు పోయినందునే హత్య కేసు నమోదు చేసినట్లు స్పష్టం చేశారు. మైనర్లకు కారు అందుబాటులో ఉంచినందునే యజమానిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు.

"కారు యజమాని కుమారుడు (మైనర్‌) డ్రైవింగ్ చేశాడు. ఇద్దరు మైనర్‌ స్నేహితులతో కలిసి కారు నడిపాడు. కారును తానే నడిపినట్లు నమ్మించేందుకు రాజేంద్రప్రసాద్‌ ప్రయత్నించారు. మా దర్యాప్తులో రాజేంద్రప్రసాద్‌ కుమారుడే కారు నడిపినట్లు తేలింది." - కరీనంగర్ పోలీసు కమిషనర్

ప్రతిరోజూ వాకింగ్​కు

మైనర్లు ప్రతిరోజు ఉదయం కారు బయటికి తీస్తున్నారని.. అంబేడ్కర్‌ స్టేడియంలో వాకింగ్‌ కోసం కారులో వెళ్తారని సీపీ తెలిపారు. కారుపై ఓవర్‌ స్పీడ్‌ చలాన్లు ఇప్పటికే చాలా ఉన్నాయని వెల్లడించారు. స్మార్ట్​ సిటీ పనుల కోసం రోడ్డు పక్కన గుడిసెలను వారం క్రితం తొలగించామన్న సీపీ.. కొందరు రోడ్డు పక్కన గుడిసెల్లో వృత్తిపనులు చేస్తున్నారని పేర్కొన్నారు.

అసలేం జరిగిందంటే

నగరంలోని కమాన్‌ సమీపంలో కరీంనగర్‌- హైదరాబాద్‌ ప్రధాన రహదారి పక్కన కొందరు కూలీలు కొలిమి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంటారు. ఆదివారం కావటంతో మేకలు, గొర్రెల తలకాయలు, కాళ్లు కాల్చుకుంటూ.. ఉపాధి పొందుతుంటారు. ఈ క్రమంలోనే ఉదయం 7 గంటల ప్రాంతంలో అటుగా దూసుకొచ్చిన కారు.. రోడ్డుపక్కన పనులు చేసుకుంటున్న కూలీలపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో జ్యోతి అనే మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. తీవ్రంగా గాయపడిన మరో ఆరుగురిని హుటాహుటిన కరీంనగర్‌ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ... మరో ముగ్గురు మహిళలు మృతిచెందారు. చనిపోయిన వారిలో ఫరియాద్‌, సునీత, లలిత ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

100 కి.మీల వేగంతో

ప్రమాదానికి 5 నిమిషాల ముందు కారులో ఇంధనం నింపుకొని.. రాంగ్​ రూట్​లో వేగంగా వెళ్లినట్లు సీసీ కమెరాల్లో నమోదైంది. బాలుడికి డ్రైవింగ్​ రాకపోవడమే ప్రధాన కారణంగా పోలీసులు భావిస్తున్నారు. 100 కి.మీల వేగంతో కూలీలపైకి వాహనం దూసుకెళ్లినట్లు ఘటనాస్థలంలో ఆధారాలు లభ్యమయ్యాయి. ప్రమాదం జరిగిన అనంతరం కారును వదిలేసి అందులో ఉన్న వారు పరారయ్యారు.

ఇదీ చదవండి

Car Accident at Karimnagar: గుడిసెల్లోకి దూసుకెళ్లిన కారు..నిద్రిస్తున్న నలుగురు దుర్మరణం

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

Last Updated : Jan 30, 2022, 5:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.