ETV Bharat / city

'సోము వీర్రాజుకు రక్షణ కల్పించండి'.. డీజీపీకి భాజపా నేతల వినతి

author img

By

Published : Jun 10, 2022, 4:33 PM IST

BJP leaders meet DGP: భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుకు రక్షణ కల్పించాలని ఆ పార్టీ నేతలు డీజీపీకి వినతిపత్రం అందజేశారు. కోనసీమ అల్లర్లతో సంబంధం లేని యువమోర్చా నాయకుడి పేరును ఎఫ్​ఐఆర్​లో చేర్చడాన్ని తప్పుబట్టారు. భాజపా జాతీయ అధ్యక్షుడి రాష్ట్ర పర్యటన విజయవంతం కావడంతోనే వైకాపా ప్రభుత్వం కక్షగట్టి వ్యవహరిస్తుందని అన్నారు.

డీజీపీకి భాజపా నేతల వినతి
డీజీపీకి భాజపా నేతల వినతి

BJP on Somu Veerraju Security: భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుకు రక్షణ కల్పించాలని కోరుతూ ఆ పార్టీ నేతలు డీజీపీకి వినతిపత్రం అందజేశారు. భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివన్నారాయణ నేతృత్వంలోని ప్రతినిధుల బృందం డీజీపీ కార్యాలయానికి వెళ్లి వినతిపత్రం సమర్పించారు. ఇటీవల తూర్పుగోదావరి జిల్లాలో సోము పర్యటన సందర్బంగా జొన్నాడ జంక్షన్​ వద్ద ఆయన వాహనానికి అడ్డంగా ఒక ప్రైవేటు నిలిపారని..ఆ వాహనం ఎలా వచ్చిందని ? భాజపా నేతలు ప్రశ్నిస్తున్నారు. తమ పార్టీ అధ్యక్షునికి ప్రాణహాని తలపెట్టేందుకే ఆ విధంగా వ్యవహరించారని అందుకే డీజీపీకి ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు.

కోనసీమ జిల్లాలో జరిగిన అల్లర్లలో కొండేటి ఈశ్వర్ గౌడ్ పేరును ఎఫ్‌ఐఆర్‌లో అక్రమంగా చేర్చారని అన్నారు. గతనెల 24న ఆ వ్యక్తి గుంటూరులో నిర్వహించిన రాష్ట్ర యువ మోర్చా కార్యవర్గ సమావేశంలో పాల్గొని 26న కోనసీమ వెళ్లారన్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు తమ వద్ద ఉన్నాయని చెప్పారు. తప్పుడు కేసులపై ప్రత్యేకంగా దర్యాప్తు జరపాలని డీజీపీని కోరినట్లు శివన్నారాయణ వెల్లడించారు.

ఏం జరిగిందంటే: కోనసీమ జిల్లా ఆలమూరు మండలం జొన్నాడ 16వ నంబరు జాతీయ రహదారిపై ఈనెల 8న గంటపాటు హైడ్రామా నెలకొంది. జిల్లాలో మే నెలలో జరిగిన అల్లర్లలో అక్రమ అరెస్టులకు గురైన వారి కుటుంబాలను భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పరామర్శించేందుకు బయల్దేరారన్న సమాచారంతో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. ఉన్నతాధికారుల ఆదేశాలతో జొన్నాడ జాతీయ రహదారిపై ఆలమూరు ఎస్సై సోమన శివప్రసాద్‌ తన సిబ్బందితో ఆయన కాన్వాయ్‌ని అడ్డుకున్నారు. ఒక ప్రైవేటు లారీని తెచ్చి రోడ్డుపై అడ్డంగా పెట్టడంపై వీర్రాజు అసహనం వ్యక్తంచేశారు.

పర్యటనకు ఎలాంటి అనుమతులు లేవని పోలీసులు చెప్పడంతో ఆయన ఆగ్రహం వ్యక్తంచేస్తూ.. ఎస్సైతో వాదనకు దిగారు. ఒక దశలో ఆవేశానికి లోనై ఎస్సైని నెట్టేశారు. పోలీసు సిబ్బంది వారిస్తున్నా వినలేదు. ప్రైవేట్‌ వాహనదారుడితోనూ వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. చివరకు ఉన్నతాధికారులు అనుమతి ఇవ్వడంతో ఆయన తన వాహనంలో రావులపాలెం వెళ్లిపోయారు. అనంతరం సోము వీర్రాజుపై ఆలమూరు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసుల విధులకు ఆటంకం కలిగించడంతోపాటు విధుల్లో ఉన్న ఎస్సైని నెట్టారని 353, 506 సెక్షన్లపై కేసు పెట్టారు. మండపేట రూరల్‌ సీఐ శివగణేష్‌ ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చూడండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.