ETV Bharat / city

పోలీసుల ప్రోత్సాహంతోనే వైకాపా నేతల దౌర్జన్యాలు: తెదేపా

author img

By

Published : Mar 3, 2021, 6:42 PM IST

పోలీసులు, వైకాపా ప్రభుత్వ తీరుపై తెదేపా ఆగ్రహం వ్యక్తం చేసింది. విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల ప్రచారంలో మహిళా అభ్యర్థులపై వైకాపా నేతలు దాడులు చేస్తుంటే.. పోలీసులు ప్రోత్సహిస్తున్నారని ఆరోపించింది. ప్రభుత్వ తీరుతో తమ అభ్యర్థులను పక్క రాష్ట్రాల్లో దాచుకోవాల్సి వస్తోందని పేర్కొంది.

పోలీసుల ప్రోత్సాహంతోనే వైకాపా నేతల దౌర్జన్యాలు: తెదేపా
పోలీసుల ప్రోత్సాహంతోనే వైకాపా నేతల దౌర్జన్యాలు: తెదేపా

విజయవాడ నగరపాలక ఎన్నికల్లో పోలీసుల ప్రోత్సాహంతోనే ప్రచారం చేయకుండా వైకాపా నేతలు తమపై దౌర్జన్యాలు చేస్తున్నారని.. తెదేపా మహిళా అభ్యర్థులు ఆరోపించారు. 28వ డివిజన్​లో పోటీ చేస్తున్న తనను బెదిరించి ప్రచారాన్ని అడ్డుకుంటున్నారని లలితా కిషోర్ వాపోయారు. 31వ డివిజన్ నుంచి పోటీ చేస్తున్న తనపై వైకాపా నేతల దాడిని స్థానిక ఎస్సై ప్రోత్సహించారని అభ్యర్థిని గాయత్రిదేవి ఆరోపించారు.

నగరపాలక ఎన్నికల ప్రక్రియను వైకాపా అపహాస్యం చేసిందని పొలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమా విమర్శించారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న తెదేపా మహిళా అభ్యర్థుల్ని వేధిస్తూ... అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని ధ్వజమెత్తారు. నగరపాలక ఎన్నికల్లో పోటీ చేయకుండా నామినేషన్లు ఉపసంహరించుకుని బహిష్కరించాలా అని పోలీసుల్ని నిలదీశారు.

ఎన్నికల్లో మహిళల భద్రతపై పోలీసుల స్పష్టమైన హామీ ఇవ్వకుంటే అదే పనిచేస్తామని.. బొండా ఉమా హెచ్చరించారు. ఇతర జిల్లాల నుంచి రౌడీలను దింపి.. విజయవాడలో వైకాపా నేతలు అరాచకాలు సృష్టిస్తున్నారని ఆక్షేపించారు. జగన్ పరిపాలనలో పోటీ చేసే అభ్యర్థుల్ని పక్క రాష్ట్రాలకు తీసుకెళ్లి దాచుకోవాల్సి వస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండీ... ముగిసిన పుర ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.