ETV Bharat / city

‘అయ్యాఎస్‌’ సర్వీసు.. రాష్ట్రంలో ఎనిమిది మంది ఐఏఎస్‌లకు జైలుశిక్ష

author img

By

Published : Apr 1, 2022, 9:30 AM IST

IAS officers: సమర్థత, సచ్ఛీలత, నిష్పాక్షికతలే విధి నిర్వహణలో ఐఏఎస్‌ అధికారులకు పరమ ప్రమాణాలు. ప్రజాస్వామ్య వ్యవస్థలు, పాలకుల అధికారాలకు రాజ్యాంగం విధించిన పరిమితులంటే ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డికి ఎనలేని ఏహ్యభావం. కోర్టు ఆదేశాలను పట్టించుకోనక్కర్లేదనే పెడపోకడ రాష్ట్రంలోని 90శాతం ఐఏఎస్‌లలో కనిపిస్తోందని ఏపీ హైకోర్టు నిరుడు చీవాట్లు పెట్టింది. పాఠశాల ప్రాంగణాల్లోని ఇతర నిర్మాణాలను తొలగించాలన్న తన తీర్పును ధిక్కరించిన ఎనిమిది మంది ఐఏఎస్‌లకు ఉన్నతన్యాయస్థానం నిన్న జైలుశిక్ష విధించింది.

AP High Court sentences eight IAS officers to jail in contempt of court case
రాష్ట్రంలో ఎనిమిది మంది ఐఏఎస్‌లకు జైలుశిక్ష

IAS officers: సమర్థత, సచ్ఛీలత, నిష్పాక్షికతలే విధి నిర్వహణలో ఐఏఎస్‌ అధికారులకు పరమ ప్రమాణాలు. దేశం దురదృష్టం కొద్దీ వారిలో అత్యధికులకు నేడు అవినీతి, అసమర్థత, ఉదాసీనతలే సహజాభరణాలయ్యాయి. రాజకీయ నేతలకు సలాములు కొడుతూ, వారికి గులాములుగా పనిచేసే ‘అయ్యాఎస్‌’లు రాష్ట్రాలకు అతీతంగా కోకొల్లలు. ప్రజాస్వామ్య వ్యవస్థలు, పాలకుల అధికారాలకు రాజ్యాంగం విధించిన పరిమితులంటే.. ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డికి ఎనలేని ఏహ్యభావం. చట్టబద్ధమైన కర్తవ్య పాలనకు పూచీ పడాల్సిన ఉన్నతాధికార గణమూ ఆయన ఏలుబడిలో ఆ అవలక్షణాన్ని ఆబగా అందిపుచ్చుకోవడమే ఆందోళనకరం. కోర్టు ఆదేశాలను పట్టించుకోనక్కర్లేదనే పెడపోకడ రాష్ట్రంలోని 90శాతం ఐఏఎస్‌లలో కనిపిస్తోందని ఏపీ హైకోర్టు నిరుడు చీవాట్లు పెట్టింది. పాఠశాల ప్రాంగణాల్లోని ఇతర నిర్మాణాలను తొలగించాలన్న తన తీర్పును ధిక్కరించిన ఎనమండుగురు ఐఏఎస్‌లకు ఉన్నతన్యాయస్థానం నిన్న జైలుశిక్ష విధించింది. క్షమాపణలు కోరిన మీదట- కారాగారవాసానికి మారుగా వసతిగృహాల్లో సేవచేయాలని వారికి నిర్దేశించింది. వృత్తిధర్మాన్ని నిర్లజ్జగా కాలరాసే అధికారులందరికీ ఇదో గుణపాఠం. 21వ రాజ్యాంగ అధికరణ, ఏపీ విద్యా చట్టం, జాతీయ విద్యావిధానాలను తుంగలో తొక్కుతూ జగన్‌ జమానాలో రాష్ట్రవ్యాప్తంగా బడి ఆవరణల్లో గ్రామ సచివాలయాలు, రైతుభరోసా కేంద్రాల వంటివి వెలశాయి. వాటిని తొలగించాలంటూ 2020లో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు దాదాపు ఏడాది పాటు కొల్లబోయాయి. అందుకు బాధ్యులుగా పంచాయతీరాజ్‌, పురపాలక, విద్యా శాఖాధికారులకు ప్రస్తుతం దండన తప్పలేదు. వారిలో ముగ్గురు గిరిజాశంకర్‌, బి.రాజశేఖర్‌, చినవీరభద్రుడు నిరుడే వేరే వ్యాజ్యాల్లో కోర్టు ధిక్కరణ అభియోగాలు ఎదుర్కొన్నారు. అటువంటి కేసులోనే విచారణకు గైర్హాజరు అయినందుకుగాను మరో సీనియర్‌ ఐఏఎస్‌ పూనం మాలకొండయ్యపై నాన్‌బెయిలబుల్‌ వారెంటు జారీ అయ్యింది. గతేడాదిలోనే నాటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ సైతం కోర్టు ధిక్కరణ అభియోగంతో హైకోర్టు మెట్లెక్కారు. కోర్టు ఆదేశాలను శిరసా వహించాల్సిన అధికారగణంలో పొటమరిస్తున్న ఆ తెంపరితనానికి ప్రోద్బలమేమిటి? న్యాయపాలికపై జగన్‌, ఆయన భృత్యగణాలు తరచూ వెళ్లగక్కే అసహనమే దానికి ప్రేరణ అవుతోందా?

జగన్మోహనరెడ్డితో జుగల్బందీకి ఫలితంగా- ఆయన అక్రమాస్తుల కేసులు కొందరు ఐఏఎస్‌లను కొన్నేళ్లుగా వెంటాడుతున్నాయి. అధికారం దఖలుపడగానే అయ్యవారి దర్శనానికి బారులుతీరిన ఉన్నతాధికారుల్లో బోలెడు మంది జగన్‌ను పరిపాలనాదక్షుడైన ప్రగతికాముకుడిగా నోరారా కీర్తించినట్లు కథనాలు వెలువడ్డాయి. ‘నాకిది-నీకది’ పద్ధతిలో ప్రభువుల మోచేతి నీళ్లను జుర్రుకొనే అధికారుల సర్వభ్రష్టత్వం- సుపరిపాలనకు సారథ్యం వహించాల్సిన వ్యవస్థగా ఐఏఎస్‌ యంత్రాంగాన్ని అభివర్ణించిన సర్దార్‌ పటేల్‌ కలలను ఛిద్రంచేస్తోంది. అంతిమంగా అది ప్రజాప్రయోజనాలను గంగ పాల్జేస్తోంది. దేశవ్యాప్తంగా 2015-21 మధ్య ఐఏఎస్‌ అధికారులపై 3464 ఫిర్యాదులు వెల్లువెత్తినట్లు, 44 సీబీఐ కేసులు నమోదైనట్లు సర్కారీ గణాంకాలు చాటుతున్నాయి. అందినకాడికి అందినట్లు కోట్ల రూపాయలను దండుకుంటున్న ఐఏఎస్‌ల లీలలు తామరతంపరగా వెలుగుచూస్తున్నాయి. ప్రజాక్షేమమే పరమావధిగా పనిచేసే కొద్దిమంది ఐఏఎస్‌ల నిర్భీతి, నిజాయతీలకు మాత్రం అకారణ బదిలీలు, అప్రధాన పోస్టులే బహుమతులవుతున్నాయి. అధికారులు కట్టుబడాల్సింది చట్టాలు, రాజ్యాంగానికే కానీ- ప్రభుత్వాధినేతల సొంత అజెండాలకు కాదు. తద్భిన్నంగా వ్యవస్థకు వేరుపురుగులవుతున్న అక్రమార్కులను సాగనంపాలని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శుల సదస్సు రెండున్నర దశాబ్దాల క్రితమే పిలుపిచ్చింది. అధికారపక్షంతో అంటకాగే అధికారుల తీరుపై సుప్రీంకోర్టు ఇటీవల ఆందోళన వ్యక్తంచేసింది. అయితేనేమి... అఖిల భారత సర్వీసుల ప్రక్షాళనకు సంబంధించిన మేలిమి సిఫార్సులెన్నో నేటికీ బుట్టదాఖలవుతున్నాయి. రాజకీయ నేతలు, వారి అడుగులకు మడుగులొత్తే అనుంగు అధికారుల అనైతిక జోడీకి కత్తెరపడేలా సంస్కరణలు కార్యరూపం దాల్చాలి. ప్రజల బాగోగులంటే లెక్కలేనితనం, న్యాయస్థానాల పట్ల అలవిమాలిన అలక్ష్యాలతో ప్రస్తుతం ఏపీలో వెర్రితలలు వేస్తున్న దుష్టసంస్కృతికీ అప్పుడే అడ్డుకట్ట పడుతుంది!

ఇదీ చదవండి:

Contempt of Court: కోర్టు ధిక్కరణ కేసులో 8 మంది ఐఏఎస్‌లకు జైలు శిక్ష.. కానీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.