ETV Bharat / city

' దేశాన్ని ముక్కలు చేయటానికి.. భాజపా ప్రయత్నిస్తోంది'

author img

By

Published : May 22, 2022, 5:00 AM IST

భారత పాఠశాల ఉపాధ్యాయుల సమాఖ్య జాతీయ మహాసభల్లో రెండో రోజు.. ఐద్వా జాతీయ ప్రధాన కార్యదర్శి మరియం ధావలే పాల్గోన్నారు. భాజపా ప్రభుత్వం పాలనపై ఆమె విమర్శలు చేశారు. పాఠ్యపుస్తకాల్లోకి ఆరెస్సెస్‌ భావజాలం చొప్పించి, దేశాన్ని ముక్కలు చేయడానికి భాజపా చూస్తోందని మండిపడ్డారు.

Mariam Dhawale
Mariam Dhawale

భాజపా ప్రభుత్వం పాఠ్యపుస్తకాల్లోకి ఆరెస్సెస్‌ భావజాలం చొప్పించి, దేశాన్ని ముక్కలు చేయడానికి చూస్తోందని ఐద్వా జాతీయ ప్రధాన కార్యదర్శి మరియం ధావలే ఆరోపించారు. భారత పాఠశాల ఉపాధ్యాయుల సమాఖ్య(ఎస్‌టీఎఫ్‌ఐ) జాతీయ మహాసభల్లో రెండో రోజు శనివారం ఆమె మాట్లాడారు. ‘‘పాఠ్యపుస్తకాల్లోకి మూఢ విశ్వాసాలను చొప్పించి, విద్యార్థుల ఆలోచన శక్తిని హరిస్తోంది. నర్సింగ్‌ కోర్సు పుస్తకంలో కట్నానికి అనుకూలంగా ఉన్న పాఠ్యాంశాన్ని ఉదహరించారు. డిజిటలైజేషన్‌, ఆన్‌లైన్‌ బోధన వల్ల విద్యార్థులు, ఉపాధ్యాయుల మధ్య దూరం పెరుగుతోంది. నూతన జాతీయ విద్యా విధానం విద్యను ప్రైవేటీకరణ చేసేందుకు అనుకూలంగా ఉంది. పాలకులు తమ లక్ష్యాల మేరకు పాఠ్యాంశాలను రూపొందిస్తున్నారు. సామాజిక స్పృహ కలిగిన ఉపాధ్యాయులు వాటిని ఏవిధంగా బోధించగలరు? సంస్కృతి పేరుతో మహిళల హక్కులు హరించే ప్రయత్నం చేస్తున్నారు. భాజపా పాలనలో కార్పొరేట్ల ఆదాయం మరింత పెరిగింది. ప్రజలకు అందించాల్సిన బియ్యాన్ని ఇథనాల్‌ తయారీకి ఇవ్వడం దేశ ద్రోహం కాదా?’’ అని ప్రశ్నించారు. భవిష్యత్తులో దళితులు, మైనార్టీలు, మహిళలకు భాజపా రూపంలో పెను ప్రమాదం పొంచి ఉందని, ఎస్‌టీఎఫ్‌ఐ వంటి సంస్థలు పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు.

ఎన్‌ఈపీ, సీపీఎస్‌ రద్దు చేయాలి: ఉద్యోగ, ఉపాధ్యాయులతోపాటు ప్రజల హక్కులను ప్రభుత్వాలు హరించి వేస్తున్నాయని ఎస్‌టీఎఫ్‌ఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సీఎన్‌ భారతి విమర్శించారు. విజయవాడలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. సమావేశ తీర్మానాలను వెల్లడించారు. వాటిలో... ‘ఆదాయపన్ను మినహాయింపు శ్లాబును రూ.7.50 లక్షలకు పెంచి, పింఛనుదారులకు పూర్తిగా మినహాయింపునివ్వాలి. ఒప్పంద, పొరుగుసేవల ఉద్యోగులను క్రమబద్ధీకరించాలి. జాతీయ విద్యా విధానం, కాంట్రిబ్యూటరీ పింఛను పథకం రద్దు. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలి. నూతన విద్యావిధానం, సీపీఎస్‌ రద్దుపై జాతీయ స్థాయి ఉద్యమం నిర్మించాలి’ అనే తీర్మానాలు ఉన్నట్లు పేర్కొన్నారు. అనంతరం ఎమ్మెల్సీ సాబ్జీ మాట్లాడుతూ... ఎన్నికల ముందు సీపీఎస్‌ రద్దు చేస్తామన్న సీఎం జగన్‌ ఇప్పుడు హామీ పింఛన్‌ పథకం(జీపీఎస్‌) అంటూ మోసం చేస్తున్నారని విమర్శించారు. సమావేశంలో ఐక్య ఉపాధ్యాయ సమాఖ్య అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వెంకటేశ్వర్లు, ప్రసాద్‌, ఎస్‌టీఎఫ్‌ఐ కోశాధికారి ప్రకాష్‌చందర్‌ మహంతి, కార్యదర్శి అరుణకుమారి పాల్గొన్నారు.

ఇదీ చదవండి: మాతృ భాషలోనే ప్రాథమిక విద్యను కొనసాగించాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.