ETV Bharat / city

అవినీతిపై ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేక యాప్‌.. ఆవిష్కరించిన ముఖ్యమంత్రి జగన్‌

author img

By

Published : Jun 1, 2022, 6:45 PM IST

Updated : Jun 2, 2022, 5:15 AM IST

అవినీతి నిరోధానికి ఏసీబీ మొబైల్‌ యాప్‌
అవినీతి నిరోధానికి ఏసీబీ మొబైల్‌ యాప్‌

ACB Mobile App: ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరకు అవినీతి నిరోధానికి ఏసీబీ మొబైల్‌ యాప్‌ రూపొందించింది. 'ఏసీబీ 14400' పేరుతో రూపొందిన మొబైల్‌ యాప్​ను క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ప్రారంభించారు.

లంచం అడిగితే నేరుగా ‘ఏసీబీ 14400’ యాప్‌ ద్వారా అవినీతి నిరోధకశాఖకు (ఏసీబీ) ఫిర్యాదు చేయాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని.. అందులో ఉన్న వీడియో, ఆడియో ద్వారా లంచం అడిగిన వారి సంభాషణలను రికార్డు చేస్తే.. ఆ వివరాలు నేరుగా ఏసీబీకి చేరతాయని తెలిపారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో బుధవారం ఆయన ‘ఏసీబీ 14400’ యాప్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అవినీతి నిరోధక చర్యల్లో ప్రతి కలెక్టరు, ఎస్పీకి బాధ్యత ఉందని స్పష్టం చేశారు. అవినీతిపై ఎలాంటి ఫిర్యాదులు వచ్చినా వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని సూచించారు.

.

‘‘మన స్థాయిలో అనుకుంటే 50శాతం అవినీతి అంతమవుతుంది. అవినీతికి పాల్పడి ఎవరైనా పట్టుబడితే వారిపై కఠిన చర్యలు ఉంటాయి. దేశంలో మరే ఇతర రాష్ట్రంలోనూ లేని విధంగా రూ.1.41 లక్షల కోట్ల మొత్తాన్ని అవినీతి, పక్షపాతం లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి అత్యంత పారదర్శకంగా వేశాం’’ అని తెలిపారు.

యాప్‌ ఎలా పని చేస్తుందంటే

* గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి ‘ఏసీబీ 14400’ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకొని.. ఫోన్‌ నంబరు ద్వారా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి.

* యాప్‌లోని లైవ్‌ రిపోర్టు విభాగంలో ఫొటో, వీడియో, ఆడియో విభాగాలు ఉంటాయి. లంచం అడిగితే ఆ దృశ్యాలు, సంభాషణలను రికార్డు చేయొచ్చు. అవి నేరుగా ఏసీబీకి చేరుతాయి.

* ‘లాడ్జ్‌ కంప్లైంట్‌’ విభాగంలోకి వెళ్తే ఏ ప్రభుత్వోద్యోగిపై ఫిర్యాదు చేయాలనుకుంటున్నారో వారి వివరాలు, ఫిర్యాదు సారాంశం పొందుపరిచేందుకు వీలుంటుంది. ఆ ఫిర్యాదుకు సంబంధించిన ఫొటో, ఆడియో, వీడియో, డాక్యుమెంటు ఆధారాలు కూడా పొందుపరిచేందుకు అవకాశం ఉంటుంది. ఫిర్యాదు పూర్తికాగానే ఫోన్‌కు ఒక రెఫరెన్స్‌ నంబరు వస్తుంది. దాని ద్వారా ఫిర్యాదు స్థితిని ట్రాక్‌ చేయొచ్చు.

* ప్రస్తుతం ఆండ్రాయిడ్‌లోనే ఈ యాప్‌ అందుబాటులో ఉంది. త్వరలో ఐవోఎస్‌లోనూ తీసుకురానున్నారు.

.


ఇవీ చూడండి

Last Updated :Jun 2, 2022, 5:15 AM IST

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.