ETV Bharat / city

Tirumala: మేం ఊహించి సిద్ధమైతే.. మాపై ఆరోపణలు చేస్తారా?: ధర్మారెడ్డి

author img

By

Published : Apr 13, 2022, 1:54 PM IST

TTD Additional EO
తిరుపతిలో నిన్న జరిగిన ఘటనపై తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డి వివరణ

TTD Additional EO: తిరుపతి టికెట్ కౌంటర్ల వద్ద నిన్న జరిగిన తోపులాటపై దుష్ప్రచారం చేస్తున్నారని తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డి అన్నారు. దేవస్థానం తరఫున అన్ని ఏర్పాట్లు చేసినా.. టికెట్లు దొరకవేమోనని భక్తులు ఆందోళన చెందడం వల్లే.. పరిస్థితి అదుపు తప్పిందన్నారు. అయినా వెంటనే తగిన చర్యలు చేపట్టి.. భక్తులను తిరుమలకు తీసుకొచ్చి దర్శన ఏర్పాట్లు చేశామన్నారు.

మేం ఊహించి సిద్ధమైతే.. మాపై ఆరోపణలు చేస్తారా?

TTD Additional EO: తిరుపతిలో నిన్న జరిగిన తోపులాటలో తితిదే నిర్లక్ష్యంగా వ్యవహరించిందనే విమర్శలు చేయడం సరికాదని అదనపు ఈవో ధర్మారెడ్డి అన్నారు. టైమ్‌ స్లాట్‌ వల్ల భక్తులకు చాలా త్వరగా దర్శనాలు కల్పించామని తెలిపారు. 9, 10, 11 తేదీలకు సంబంధించిన టోకెన్లను ఒకేరోజు పంపిణీ చేసినట్లు వెల్లడించారు. వారాంతాల్లో దర్శనానికి వచ్చే వారి సంఖ్య పెరిగిందన్నారు. మొత్తం మూడు కౌంటర్లు కలిపి సుమారు 18 నుంచి 20 వేల మంది వచ్చినట్లు చెప్పారు. రోజుకు 35 వేల చొప్పున దర్శన టోకెన్లు ఇచ్చేలా ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. భక్తులు ఎక్కువ సంఖ్యలో వస్తున్నారని తెలిసి కౌంటర్లు నిలిపివేశామని తెలిపారు. రెండు రోజుల విరామం అనంతరం కౌంటర్లు ఓపెన్‌ చేద్దామని భావించినట్లు వెల్లడించారు.

టోకెన్లు లేకున్నా శ్రీవారిని దర్శించేందుకు వీలుగా ఏర్పాట్లు చేసినట్లు ధర్మారెడ్డి పేర్కొన్నారు. భక్తులు ఎక్కువమంది వస్తారని అంచనా వేసి.. ముందుగానే వైకుంఠం-2 కాంప్లెక్స్‌ సిద్ధం చేసినట్లు వివరించారు. తాగునీరు, భోజన వసతితోపాటు ఏసీ, టీవీలు అన్నీ సిద్ధం చేసినట్లు తెలిపారు. మేం ముందుగానే ఇలాంటి పరిస్థితిని ఊహించి సిద్ధమైతే మాపై ఆరోపణలు చేస్తారా అని ప్రశ్నించారు. ముందే సిద్ధంగా ఉండబట్టే.. అరగంటలో భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించామన్నారు. భగవంతుడికి భక్తులను దూరం చేస్తున్నామని ఆరోపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టైమ్‌ స్లాట్‌ టోకెన్ల వల్ల వీఐపీ తరహాలో దర్శనాలకు అవకాశం ఉంటుందని, వీఐపీకి ఉన్న అన్ని సౌలభ్యాలు టైమ్‌ స్లాట్‌ టోకెన్ల వల్ల సాధ్యమవుతాయని వెల్లడించారు.

తిరుమలలో భక్తుల అవస్థలు: తిరుమల వేంకటేశ్వరస్వామిని కళ్లారా దర్శించి తరించాలని సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులకు... తితిదే అధికారుల ఘోర వైఫల్యంతో మంగళవారం నరకం కనిపించింది. వేలసంఖ్యలో భక్తులు వస్తారని తెలిసీ అధికారులు కనీస ఏర్పాట్లు చేయకపోవడంతో శ్రీవారి ఉచిత దర్శన టోకెన్ల జారీ కేంద్రాల వద్ద భక్తులు తీవ్ర అవస్థలు పడ్డారు. గోవిందరాజస్వామి సత్రాల వద్ద టోకెన్ల జారీ కేంద్రం వద్ద తొక్కిసలాటలో అయిదుగురు గాయపడ్డారు. పలువురు భక్తులు స్పృహ కోల్పోయారు. వారిని అంబులెన్సులలో రుయా ఆస్పత్రికి తరలించి చికిత్స చేశారు. భూదేవి కాంప్లెక్స్‌ వద్ద కూడా తీవ్రస్థాయిలో తోపులాట జరిగింది. వృద్ధులు, మహిళలు, పిల్లలు ఊపిరాడక విలవిల్లాడిపోయారు. కొందరు సొమ్మసిల్లిపోయారు. వారిని 108లలో ఆస్పత్రులకు తరలించారు. నిప్పులు చెరుగుతున్న ఎండలో, దాహంతో తడారిపోతున్న గొంతులతో, ఏడుస్తున్న పిల్లా, పాపలతో గంటల కొద్దీ క్యూలైన్లలో వేచి ఉండాల్సి రావడం... అంతసేపు ఎదురుచూసినా టోకెన్లు దొరుకుతాయో లేదో తెలియని సందిగ్ధత భక్తుల్ని తీవ్ర అసహనానికి గురిచేసింది. సాధారణ రోజుల కంటే వేసవిలో తిరుమలకు భక్తుల రద్దీ ఎక్కువ. కొవిడ్‌ పూర్తిగా తగ్గుముఖం పట్టడంతో ఇటీవల రద్దీ మరింత పెరిగింది. ఇదంతా తెలిసీ తితిదే అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం, ముందస్తు వ్యూహం, ప్రణాళిక లేకపోవడంతో భక్తులు తీవ్ర అవస్థలు పడ్డారు. మంగళవారం తెల్లవారుజాము నుంచే వేలకొద్దీ భక్తులు క్యూలైన్లలో వేచి చూస్తున్నా, తీరిగ్గా ఉదయం 6 గంటలకు టోకెన్ల జారీ ప్రారంభించారు. చూస్తుండగానే భక్తుల రద్దీ బాగా పెరిగిపోయింది. వారు వేచి ఉండేందుకు తగిన ఏర్పాట్లు లేవు. ఎంతసేపటికీ క్యూలైన్లు తరగక సహనం కోల్పోయిన భక్తులు తోసుకురావడంతో... తితిదే భద్రతా సిబ్బంది వారిని నియంత్రించలేకపోయారు. పోలీసులు వచ్చేసరికే పరిస్థితి అదుపు తప్పింది.

ఇదీ చదవండి: RTC Charges hike: ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపునకు రంగం సిద్ధం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.