ETV Bharat / city

TIRUMALA: ఆన్‌లైన్‌లో శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు.. అప్పట్నుంచే

author img

By

Published : Mar 18, 2022, 12:17 PM IST

Updated : Mar 18, 2022, 12:38 PM IST

TTD EO on tirumala tickets
ఆన్‌లైన్‌లో ఈ నెల20న శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు

TTD Tickets: తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను ఆన్​లైన్​లో విడుదల చేయనున్నట్టు తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డి పేర్కొన్నారు. ఆన్‌లైన్‌, సిఫార్సు లేఖలు, ఎలక్ట్రానిక్‌ డిప్‌ విధానంలో ఆర్జిత సేవల టికెట్లు జారీ చేస్తామని తెలిపారు.

TTD Tickets: ఆన్‌లైన్‌లో శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను ఈ నెల 20నుంచి విడుదల చేస్తామని తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డి తెలిపారు. కరోనాతో రెండేళ్లుగా ఏకాంతంగా ఆర్జిత సేవల నిర్వహించినట్లు తెలిపారు. ఆర్జిత సేవలకు ఏప్రిల్ 1 నుంచి భక్తులను అనుమతిస్తామని వెల్లడించారు.

ఆన్‌లైన్‌, సిఫార్సు లేఖలు, ఎలక్ట్రానిక్‌ డిప్‌ విధానంలో ఆర్జిత సేవల టికెట్లు జారీ చేస్తమని తెలిపారు. ఆఫ్‌లైన్‌లో సర్వదర్శన టోకెన్ల జారీని కొనసాగిస్తామన్నారు. దర్శన టికెట్ లేని భక్తులను తిరుమలకు అనుమతించేది లేదని స్పష్టం చేశారు. ఇకపై భక్తులు కంపార్టుమెంట్లలో వేచి దర్శనానికి వెళ్లే పరిస్థితి ఉండదని ధర్మారెడ్డి పేర్కొన్నారు.

ఎలక్ట్రానిక్‌ డిప్‌ విధానంలో టికెట్ల కేటాయింపు..

సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టాదళపాదపద్మారాధన, నిజపాద దర్శనం టికెట్లను ఆన్‌లైన్‌ ఎలక్ట్రానిక్‌ డిప్‌ విధానంలో కేటాయిస్తారు. ఈ సేవలను బుక్‌ చేసుకునేందుకు మార్చి 20వ తేదీ ఉదయం 10 గంటల నుంచి మార్చి 22వ తేదీ ఉదయం 10గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌ ఎలక్ట్రానిక్‌ డిప్‌ విధానంలో భక్తులకు టికెట్లు కేటాయిస్తారు. టికెట్లు పొందిన వారి జాబితాను మార్చి 22వ తేదీ ఉదయం 10గంటల తర్వాత వెబ్‌సైట్‌లో పొందుపరుస్తారు. భక్తులకు ఎస్‌ఎంఎస్‌, ఈ-మెయిల్‌ ద్వారా తెలియజేస్తారు. టికెట్లు పొందిన వారు రెండ్రోజుల్లో టికెట్‌ ధర చెల్లించాల్సి ఉంటుంది. కల్యాణోత్సవం, ఊంజల్‌ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్లను ముందు వచ్చిన వారికి ముందు అనే ప్రాతిపదికన భక్తులు నేరుగా బుక్‌ చేసుకోవచ్చు.

పర్వదినాల్లో పలు ఆర్జిత సేవలు రద్దు..

ఏప్రిల్‌ 2న ఉగాది సందర్భంగా కల్యాణోత్సవం, ఊంజల్‌ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఏప్రిల్‌ 10న శ్రీరామనవమి సందర్భంగా తోమాల, అర్చన, సహస్ర దీపాలంకార సేవలను తితిదే రద్దు చేసింది. అలాగే.. వసంతోత్సవాల సందర్భంగా ఏప్రిల్‌ 14 నుంచి 16 వరకు కల్యాణోత్సవం, ఊంజల్‌ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను, ఏప్రిల్‌ 15న నిజపాద దర్శనం సేవలను రద్దు చేసినట్టు అధికారులు తెలిపారు. శ్రీ పద్మావతి పరిణయోత్సవాల సందర్భంగా మే 10 నుంచి 12వ తేదీ వరకు ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలు, జూన్‌ 14న జ్యేష్టాభిషేకం మూడో రోజున అష్టాదళపాదపద్మారాధన, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం సేవలు రద్దయ్యాయి. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని తితిదే అధికారులు విజ్ఞప్తి చేశారు.

నెగిటివ్‌ సర్టిఫికెట్‌ తప్పనిసరి..

తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు కొవిడ్‌ నెగిటివ్‌ సర్టిఫికెట్‌ కానీ, రెండు డోసుల వ్యాక్సినేషన్‌ సర్టిఫికెట్‌ కానీ తప్పనిసరిగా తీసుకురావాలని తితిదే విజ్ఞప్తి చేసింది. భక్తులు తమ ఆరోగ్యం, తితిదే ఉద్యోగుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని సహకరించాలని అధికారులు కోరారు.

ఇదీ చదవండి: తేడావస్తే "రంగు పడుద్ది.." హోలీ జాగ్రత్తలు తీసుకున్నారా?

Last Updated :Mar 18, 2022, 12:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.