ETV Bharat / city

Cemetery: ఆరడుగుల స్థలం కోసం... ఆ గ్రామస్తుల ఆవేదన

author img

By

Published : May 25, 2022, 7:43 PM IST

Cemetery
స్మశానవాటిక కోసం గ్రామస్తుల ఆందోళన

Cemetery: తమ సమస్యకు శాశ్వత పరిష్కారం ఎప్పుడు లభిస్తుందో తెలియక ఆ గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. బంధుమిత్రుల మధ్య జరగాల్సిన అంత్యక్రియలు.. గ్రామకంఠం భూమి కబ్జా కావడంతో పోలీసుల బందోబస్తు మధ్య జరపుకోవాల్సిన పరిస్థితి నెలకొందని వాపోతున్నారు. ఎవరూ చనిపోయినా ఇదే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు శాశ్వత శ్మశాన వాటిక కేటాయించాలని కోరుతున్నారు.

Cemetery: జీవితమంతా కష్టపడి.. ఆయువు తీరిన తర్వాత చివరి మజిలీకి చేరాల్సిన ఆరడుగుల స్థలం కోసం గత కొన్ని సంవత్సరాలుగా అలుపెరగని పోరాటం చేస్తున్నారు ఆ గ్రామస్థులు.. తిరుపతి జిల్లా తిరుపతి రూరల్ మండలం బ్రాహ్మణపట్టు పంచాయతీలోని మిట్టమీద కండ్రిగ గ్రామస్థులకు శ్మశానం లేదు. ఉన్న గ్రామకంఠం భూమిని ఒకరు కబ్జా చేసి గ్రామస్థులకు శ్మశానం లేకుండా చేశారు. గ్రామంలో ఎవరైనా చనిపోతే పోలీసు బందోబస్తు నడుమ దహనక్రియలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. శ్మశాన వాటికగా ఉన్న భూమిని రెవెన్యూ అధికారులతో లాలూచీ పడి ఓ వ్యక్తి తన పేరుపై రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.

విధిలేని పరిస్థితుల్లో రెవెన్యూ అధికారులు మరోచోట శ్మశాన స్థలం కేటాయించారు. ఆ స్థలంలో గ్రామస్థులు ఫెన్సింగ్ వేయడానికి.. సిమెంటు దిమ్మలు, ఇనుప కమ్ములను తెచ్చి నాటడానికి ప్రయత్నిస్తుండగా ఈ స్థలం తమదేనంటూ మళ్లీ అదే వ్యక్తి రావడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. గ్రామస్థులు మండల రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు.. ఆ భూమిపై ఎవరికీ ఎలాంటి హక్కులు లేవని అధికారులు నిర్ధారించారు. అయితే ఈ భూమి తనదేనన్న గ్రామస్తుడికి చట్టపరంగా నోటీసులు ఇచ్చి.. తగిన చర్యలు తీసుకుంటామని రెవెన్యూ అధికారులు తెలిపారు. గ్రామస్తులు చేసేదిలేక శాశ్వత పరిష్కారం కోసం అలుపెరగని పోరాటం చేస్తామని చెప్పారు. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు స్పందించి తమకు కేటాయించిన శ్మశాన స్థలాన్ని రికార్డుపూర్వకంగా ఇవ్వాలని కోరుతున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.