ETV Bharat / city

దిల్లీలో రెండో రోజు అమరావతి ఐకాస ప్రతినిధుల పర్యటన

author img

By

Published : Apr 6, 2022, 9:48 AM IST

Amaravathi farmers : రాజధాని అమరావతి నిర్మాణాన్ని పూర్తి చేయడంతో పాటుగా.. కేంద్ర ప్రభుత్వ సంస్థల కార్యాలయాల నిర్మాణాలు వెంటనే చేపట్టాలని కోరుతూ అమరావతి రైతుల ఐకాస నేతలు దిల్లీలో పర్యటిస్తున్నారు. మొదటిరోజు అనేకమందిని కలిసిన వాళ్లు.. ఈరోజు మరికొందరిని కలవనున్నారు.

దిల్లీలో రెండో రోజు అమరావతి ఐకాస ప్రతినిధుల పర్యటన
దిల్లీలో రెండో రోజు అమరావతి ఐకాస ప్రతినిధుల పర్యటన

Amaravathi farmers : రాజధాని అమరావతి నిర్మాణాన్ని పూర్తి చేయడంతో పాటుగా...కేంద్ర ప్రభుత్వ సంస్థల కార్యాలయాల నిర్మాణాలు వెంటనే చేపట్టాలని కోరుతూ అమరావతి రైతుల ఐకాస దిల్లీలో పర్యటిస్తోంది. పర్యటనలో భాగంగా నేడు కేంద్రమంత్రులు హర్‌దీప్‌ సింగ్ పురి, భూపేంద్ర యాదవ్‌ను కలవనున్నారు. కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను అమరావతి ప్రతినిధి బృందం కలవనుంది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ సంస్థల కార్యాలయాల నిర్మాణాలు వెంటనే చేపట్టాలని ఐకాస కోరనుంది.

మొదటిరోజు పర్యటనలో..: కాంగ్రెస్ సీనియర్ నేత రేణుకా చౌదరితో కలిసి ఎన్​సీపీ అధినేత పవార్‌ను కలిసిన రైతులు.. ఆయనకు వినతిపత్రం అందించారు. అమరావతిలో కేంద్ర ప్రభుత్వ నిర్మాణాలు ప్రారంభం చేస్తామనడం శుభపరిణామమన్న ఐకాస నేత సుధాకర్‌.. ఇది రాష్ట్ర పునర్నిర్మాణానికి దోహదం చేస్తుందన్నారు. ఇవాళ కూడా కేంద్రమంత్రులను కలుస్తామన్న రైతులు.. అపాయింట్‌మెంట్‌ దొరికితే హోంమంత్రి అమిత్‌షాను కలిసి అమరావతి అభివృద్ధికి చేయూత అందించాలని కోరతామని చెప్పారు.

చిన్న రాష్ట్రానికి 3 రాజధానులా?: మహారాష్ట్రలోనూ రెండు రాజధానులున్నాయని, వాటిలో ఒకటి విదర్భలో ఉన్నా ఆ ప్రాంతం ఏమీ అభివృద్ధి చెందలేదని.. అలాంటి పరిస్థితుల్లో మహారాష్ట్ర కంటే చిన్నరాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులేమిటని ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌పవార్‌ ఆశ్చర్యం వ్యక్తంచేశారు. మంగళవారం ఆయన్ను కలిసిన రైతు ప్రతిధి బృందం ఈ విషయం పేర్కొంది. మాజీ కేంద్రమంత్రి రేణుకాచౌదరి, ఆంధ్రప్రదేశ్‌ మహిళా కాంగ్రెస్‌ నాయకురాలు సుంకర పద్మ ఆధ్వర్యంలో ఈ బృందం శరద్‌పవార్‌ను కలిసి తమ సమస్యను ఏకరువుపెట్టినప్పుడు ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన సుమారు అరగంటకు పైగా రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక పరిస్థితి ప్రస్తావిస్తూ.. ఈ అంశంపై అనేక వార్తలు వస్తున్నాయని.. ఉన్న రాజధానిలోనే పనులు చేయలేని వ్యక్తి మూడు రాజధానులు ఎలా నిర్మిస్తారని ఆయన సందేహం వ్యక్తం చేశారు.

తాము హైకోర్టుకు వెళ్లామని.. కోర్టు సైతం అమరావతే రాజధాని అని, సీఆర్డీఏ ప్రకారం రైతుల ప్లాట్లను అభివృద్ధి చేయాలని తీర్పు ఇచ్చిందని వారు శరద్‌పవార్‌కు వివరించారు. హైకోర్టు తీర్పుపై ముఖ్యమంత్రి స్పందన ఏమిటని అడగ్గా.. సీఎం పట్టించుకోవడం లేదని చెప్పారు. దానికి ఆయన.. తీర్పును పట్టించుకోకపోవడమేమిటని ప్రశ్నించారు. రాజధానిపై భాజపా వైఖరి గురించి అడిగినప్పుడు ఆ పార్టీ నాయకులు అమరావతి రాజధానికి మద్దతు తెలుపుతున్నారని, కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి మాత్రం సరైన మద్దతు లభించడం లేదని రైతులు ఆయనతో అన్నారు. పార్లమెంట్‌లో అమరావతికి తమ పార్టీ తరఫున మద్దతు ఇస్తామని ఆయన హామీ ఇచ్చినట్లు ప్రతినిధి బృందం సభ్యులు తెలిపారు.

ఇదీ చదవండి : దిల్లీలో అమరావతి రైతులు.. రాజధానిలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుపై విజ్ఞప్తి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.