ETV Bharat / city

Graduation Ceremony: నేడు శ్రీ పద్మావతి మహిళా వర్సిటీ 18వ స్నాతకోత్సవం

author img

By

Published : Aug 25, 2021, 10:24 AM IST

ఇవాళ తిరుపతి పద్మావతి మహిళా వర్సిటీ 18వ స్నాతకోత్సవం జరగనుంది. గవర్నర్ బిశ్వభూషణ్ ఈ కార్యక్రమానికి వర్చువల్‌గా పాల్గొననున్నారు. కులపతి హోదాలో గవర్నర్ ప్రసంగించనున్నారు.

Padmavati Mahila university
పద్మావతి మహిళా వర్సిటీ

తిరుపతి పద్మావతి మహిళా వర్సిటీ 18వ స్నాతకోత్సవం ఇవాళ జరగనుంది. వర్చువల్‌గా పాల్గొననున్న గవర్నర్ బిశ్వభూషణ్.. కులపతి హోదాలో ప్రసంగిస్తారు. ఈ వేడుకలో ప్రముఖ రచయిత్రి ఓల్గా (పోవూరి లలితకుమారి)కు, అమెరికాకు చెందిన ఎన్‌ఆర్‌ఐ మీనాక్షిలకు డాక్టరేట్ ప్రదానం చేయనున్నారు. ఎంఫిల్, పీజీ, యూజీ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు పట్టాలు అందించనున్నారు.

ఎన్టీఆర్ ఆలోచనలకు ప్రతిరూపం..

మహిళలను ఉన్నత విద్యావంతులను చేయాలనే ఆశయంతో తిరుపతిలో శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించారు. అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ఆలోచనకు ప్రతిరూపంగా 1983 ఏప్రిల్‌ 14న విశ్వవిద్యాలయం పురుడుపోసుకుంది. 138.43 ఎకరాల స్థలంలో రెండు పీజీ కోర్సులు, 4 పీజీ డిప్లొమా, ఒక అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సు, రెండు సర్టిఫికెట్‌ కోర్సులతో 300 మంది విద్యార్థినులు, 10 మంది అధ్యాపక సిబ్బందితో వర్సిటీ ప్రారంభమైంది. నేడు 59 కోర్సులు, 5600కు పైగా విద్యార్థినులు, 105 మంది శాశ్వత అధ్యాపకులు, 150 మంది అకడమిక్‌ కన్సల్టెంట్లు, 500 మంది బోధనేతర సిబ్బందితో అలరారుతూ దక్షిణ భారత దేశంలోనే మొదటి మహిళా వర్సిటీగా ఖ్యాతి గడిస్తోంది. వేలాది మంది విద్యార్థినులకు ఉన్నత విద్యను అందించి వారి భవిష్యత్తుకు బాటలు వేస్తోంది. ఎంతో మందిని మేధావులుగా తీర్చిదిద్దిన వర్సిటీ 38 వసంతాలు పూర్తి చేసుకుంది. మేధావులకు గౌరవ డాక్టరేట్లు, పరిశోధనలు పూర్తి చేసుకున్న పరిశోధకులకు డాక్టరేట్‌ డిగ్రీ పట్టాలు, అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థినులకు బంగారు పతకాలు ప్రదానం చేయడానికి, కోర్సులు పూర్తి చేసుకున్న వారికి డిగ్రీలు అందించేందుకు బుధవారం మహిళా వర్సిటీ 18వ స్నాతకోత్సవాన్ని ఉత్సవంలా నిర్వహించేందుకు సన్నద్ధమైంది.

ప్రత్యేక కేంద్రాలు

వృత్తి విద్యాకోర్సులే కాదు ఫుల్‌టైం, పార్ట్‌టైం కోర్సులు అందిస్తూ విద్యార్థినుల ఉపాధికి మార్గం చూపుతోంది. విద్యార్థినుల్లో నైపుణ్యాలను పెంచేందుకు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌, ప్లేస్‌మెంట్‌ సెల్‌, డీఎన్‌ఏ బార్‌కోడింగ్‌ సెంటర్‌, సెంటర్‌ ఫర్‌ ఎక్సలెన్స్‌, టీవోటీ, సెంటర్‌ ఫర్‌ ఉమెన్‌ స్టడీస్‌, యంగ్‌లైవ్స్‌, ఎంటర్‌ ప్రెన్యూర్‌షిప్‌ సెల్‌, రీసెర్చ్‌ ట్రాన్స్‌లేషన్‌ సెంటర్‌ వంటి పలు కేంద్రాలతో పాటు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను, వారి ఆలోచనలకు కార్యరూపం ఇచ్చేందుకు టీబీఐ, ఉమెన్‌ బయోటెక్‌ వంటి ఎన్నో ప్రత్యేకతలు మహిళా వర్సిటీ సొంతం.

విదేశీ ఒప్పందాలు

వర్సిటీలో విద్యలో మరింత నాణ్యత, పరిశోధనలు, ఉద్యోగావకాశాలను పెంచే ఉద్దేశంతో ఇప్పటి వరకు 20 వరకు జాతీయ, అంతర్జాతీయ స్థాయి వర్సిటీలు, సంస్థలతో మహిళా వర్సిటీ అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. అమెరికాలోని కాలిఫోర్నియా, చైనా, స్టాన్‌ఫర్డ్‌ వర్సిటీ వంటి 10 వరకు విదేశీ వర్సిటీలతో ఒప్పందాలు కుదిరాయి.

ఉద్యోగాలు

గతంతో పోల్చితే ఆరు సంవత్సరాలుగా మహిళా వర్సిటీలో ఉద్యోగాల సాధన సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకు 1800 మంది విద్యార్థినులు పలు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలు సాధించారు. వర్సిటీ పూర్వ విద్యార్థినులు వర్సిటీలోని పలు విభాగాల్లో ఆచార్యులుగా, వివిధ హోదాల్లో పని చేస్తున్నారు. ప్రముఖ సంస్థలు ఏటా వర్సిటీలో ప్రాంగణ ఎంపికలు నిర్వహిస్తున్నాయి.

ఇదీ చదవండీ.. ILLEGAL EARNING: తండ్రి స్థానంలో కూర్చొని.. ఏడాదిలో రూ.కోట్లు కాజేసి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.