ETV Bharat / city

Paddy Crop Damage : వరి "వెన్ను" విరిగింది.. అన్నదాత కన్ను చెమ్మగిల్లింది..

author img

By

Published : Nov 3, 2021, 1:33 PM IST

అసలే ప్రభుత్వం నుంచి సాయం అందక అవస్థలు పడుతుంటే.. భారీగా కురిసిన వర్షాలు వరి సాగు చేసే రైతులను మరింత దెబ్బ తీశాయి. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు చేతికందాల్సిన వరి పంట నీట మునిగింది.

Paddy Crop Damage
భారీ వర్షాలతో మునిగిన వరి చేలు..

అటు ప్రభుత్వ సాయం అందక బాధపడుతుంటే.. ఇటు భారీ వర్షాలు అన్నదాత కంట కన్నీరు పెట్టిస్తున్నాయి. వ్యవసాయాన్నే నమ్ముకున్న తమను.. నష్టాల ఊబిలోకి నెడుతున్నాయని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

భారీ వర్షాలకు తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలోని తాళ్ళరేవు, ఐ పోలవరం, ముమ్మిడివరం, కాట్రేనికోన మండలాల్లోని వందల ఎకరాల్లో పంట చేలు నీటమునిగాయి. గత వారం రోజులుగా ఈదురు గాలులతో కురుస్తున్న భారీ వర్షాలకు.. కోత దశకు వచ్చిన పంట నేలవాలింది. పొట్ట దశ.. గింజ దశలో ఉండటంతో గాలుల ప్రభావానికి వెన్ను విరిగి, తలలు వాల్చేశాయి.

ఎకరాకు 15 నుండి 20 వేల వరకు పెట్టుబడి పెట్టిన రైతులు.. నేలవాలిన పంట చేలను చూసి తీవ్ర నిరాశకు గురవుతున్నారు. చేలల్లో నీళ్లు దిగే పరిస్థితులు లేకపోవడంతో పంట పూర్తిగా నష్టపోతామని రైతులు ఆందోళన చెందుతున్నారు. పంట నష్టపోతున్న తమను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు.

ఇదీ చదవండి : పనికెళ్తే గానీ పూట గడవదు... కరెంట్​ బిల్లు ఎక్కువ వచ్చిందని..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.