ETV Bharat / city

సహాయ చర్యల్లో నిర్లక్ష్యం వద్దు: సీఎం

author img

By

Published : Jul 27, 2022, 9:04 AM IST

‘వరద సహాయక చర్యల్లో ఎక్కడా నిర్లిప్తత కనిపించకూడదు. అందరితో మమేకమై సహాయక చర్యలు కొనసాగించాలి. పారిశుద్ధ్యం, ప్రజారోగ్యంపై దృష్టిపెట్టాలి. వరద నష్టాల లెక్కింపుల్లో నిస్పక్షపాతంగా, కచ్చితంగా వ్యవహరించాలి. లెక్కింపు పూర్తికాగానే సోషల్‌ ఆడిట్‌ కూడా నిర్వహిద్దాం’ అని అధికారులకు సీఎం జగన్‌ దిశానిర్దేశం చేశారు. మంగళవారం కోనసీమ జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల పరిశీలన అనంతరం రాజమహేంద్రవరంలో ఆయన అధికారులు, మంత్రులతో సమీక్షించారు.

CM Jagan
సీఎం జగన్​

‘వరదల వేళ అధికారులు, సిబ్బంది మంచి పనితీరు కనబరిచారు. ప్రస్తుతం వరద తగ్గినా పారిశుద్ధ్యం, ప్రజారోగ్యం, నష్టాల లెక్కింపుపై దృష్టి సారించాలి. ప్రజాప్రతినిధులను కూడా మమేకం చేసుకుని కష్టపడితే ప్రజలకు మరింత దగ్గరవుతాం. ఆవ డ్రెయిన్‌ ఏర్పాటుకు అంచనాలు సిద్ధం చేయండి. లంకగ్రామాల్లో కమ్యూనిటీ హాళ్లు నిర్మిస్తే పునరావాసానికి వినియోగించుకోవచ్చు. గతంలో అధికారులను సస్పెండ్‌ చేసి హడావుడి చేసేవారు. మనం అధికారులను ప్రోత్సహించటంతో మంచి ఫలితాలు వస్తున్నాయి. కరకట్టల ఆధునికీకరణపై అంచనాలు సిద్ధం చేయండి. డెల్టా ఆధునికీకరణ, గోదావరి వరదల నుంచి శాశ్వత పరిష్కారం కోసం అందజేసిన డీపీఆర్‌పై సాంకేతిక అంచనాలు తయారుచేసి నివేదించాలి. గట్లు ఎక్కడెక్కడ బలహీనంగా ఉన్నాయో గుర్తించి నవంబరులోగా టెండర్లు పూర్తిచేసి పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుందాం. విద్యుత్తు పునరుద్ధరణ విషయంలో జాప్యం జరిగిందని తప్పుగా ప్రచారం చేస్తే దాన్ని తిప్పికొట్టాలి. నిజంగా తప్పుంటే సరిదిద్దుకోవాలి’ అని సీఎం జగన్‌ అన్నారు. సమీక్ష సమావేశంలో మంత్రులు కొట్టు సత్యనారాయణ, వేణుగోపాలకృష్ణ, తానేటి వనిత, కారుమూరి నాగేశ్వరరావు, దాడిశెట్టి రాజా, గుడివాడ అమర్‌నాథ్‌, ఎంపీ భరత్‌, కలెక్టర్‌ మాధవీలత, ఎస్పీ ఐశ్వర్యరస్తోగి తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: సీపీఎస్‌ రద్దు హామీ కొండెక్కినట్లేనా?.. వాటా పేరుతో సర్కార్​ కొత్త అప్పు!

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.