ETV Bharat / city

కృషి ఉంటే.. క్రీడాకారులు 'విశ్వాస్ విజయరాజ్' అవుతారు

author img

By

Published : Dec 8, 2020, 9:37 PM IST

అభిరుచి, ఆసక్తి ఉంటే ఏ రంగంలోనైనా రాణించవచ్చు. కష్టమైనా ఇష్టంగా చేస్తే విజయం సాధిస్తామని నెల్లూరు నగరానికి చెందిన ఓ యువకుడు నిరూపించారు. ఎంచుకున్న మార్గం కష్టమైనా.. సాధన చేస్తే గమ్యం చేరతామని అంటున్నాడు. మోటార్ రేసింగ్​లో జాతీయస్థాయిలో సత్తా చాటారు. రాష్ట్రంలో ఇప్పటివరకు ఎవరూ సాధించని విజయాన్ని సొంతం చేసుకున్న నెల్లూరుకు చెందిన విశ్వాస్ విజయరాజ్​పై 'ఈటీవీభారత్' ప్రత్యేక కథనం.

Nellore Young Racer won Medals in Competitions
కృషి ఉంటే.. క్రీడాకారులు 'విశ్వాస్ విజయరాజ్' అవుతారు

కృషి ఉంటే.. క్రీడాకారులు 'విశ్వాస్ విజయరాజ్' అవుతారు

నెల్లూరు నగరంలోని బాలాజీనగర్​కు చెందిన యువకుడు విశ్వాస్ విజయరాజ్. తండ్రి విజయరాజన్, తల్లి స్వప్న.. నగరంలో వ్యాపారం చేస్తారు. విశ్వాస్(18) బీబీఏ ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. తండ్రికి కార్లంటే పిచ్చి ప్రేమ. అదే విశ్వాస్​కు నచ్చింది. నాలుగో తరగతిలో టీవీల్లో వస్తున్న మోటార్ కార్ రేసింగ్​లు చూసి సంబరపడేవాడు. పెద్దవాడయ్యాక కార్ రేసింగ్​లో పాల్గొనాలని కలలు కన్నాడు. తండ్రి నుంచి సలహాలు తీసుకున్నాడు.

ఫేస్​బుక్​లో పరిచయం..

ఇంటర్ చదువుతుండగా.. ఫేస్​బుక్​లో ఓ మోటార్ రేసర్​తో పరిచయం ఏర్పడింది. విశ్వాస్ అతని వివరాలు సేకరించాడు. ఎక్కడ శిక్షణ ఇస్తారు..? పోటీల్లో పాల్గొనాలంటే ఏమి చేయాలని తెలుసుకున్నారు. తల్లిదండ్రులను ఒప్పించారు. 2018లో కోయంబత్తూరులో ఓ శిక్షణా కేంద్రంలో చేరాడు. పట్టుదలగా మెళకువలు నేర్చుకున్నాడు. చిన్నప్పటినుంచి ఉన్న ఇష్టంతో.. తన ప్రత్యేకతను చాటుకోవాలని కష్టపడ్డాడు. వేగానికి మరో పేరయిన ఫార్ములా రేస్​లో మెళకువలు ఒడిసిపట్టాడు. ఆరు రేస్​ల్లో విజయం సాధించాడు.

ఆత్మస్థైర్యంతో...

నవంబర్ 27, 28, 29 తేదీల్లో చెన్నైలో జరిగిన ఫార్ములా 1300 కేటగిరిలో పొల్గొన్నారు విశ్వాస్. జాతీయస్థాయి పోటీకావడంతో ఉత్కంఠభరితంగా సాగింది. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన 22మంది పోటీపడ్డారు. జాతీయస్థాయి పోటీల్లో పాల్గొనాలంటే ఎనిమిది విభాగాల్లో పాల్గొనాల్సి ఉంటుంది. వచ్చిన పాయింట్లు ఆధారంగా జాతీయస్థాయి టోర్నీలో అవకాశం కల్పిస్తారు. ఈ క్రమంలో విశ్వాస్ అన్ని విభాగాల్లో ప్రథమ స్థానంలో నిలిచారు. చివరిగా జరిగిన జాతీయస్థాయి పోటీలో ఆత్మస్థైర్యంతో పాల్గొన్నాడు.

జీజీ సీరిస్​లో పాల్గొనడమే లక్ష్యంగా...

బెంగళూరుకు చెందిన టిజిల్​రావు ప్రథమ స్థానంలో నిలిచారు. ద్వితీయ స్థానంలో విశ్వాస్ నిలిచి భళా అనిపించుకున్నాడు. విశ్వాస్ విజయంలో తల్లిదండ్రుల పాత్ర కీలకమని చెప్పాలి. మోటార్ రేసింగ్ అంటేనే ప్రాణాలతో చెలగాటమే. అయినా చిన్న వయస్సు నుంచే కుమారుడి ఆలోచనలను నిరాశపరచలేదు. అంతర్జాతీయ స్థాయిలో ఇంకా అనేక విజయాలు సాధించేందుకు ప్రోత్సహిస్తామని అంటున్నారు. మోటార్ స్పోర్ట్స్​లో అంతర్జాతీయ స్థాయిలో రాణించడమే తన లక్ష్యమని. ఫార్ములా జీజీ సీరిస్​లో పాల్గొనడమే తన ఆశయమని చెబుతున్నారు విశ్వాస్ విజయరాజ్.

ఇదీ చదవండీ... ట్రంప్​ ఆహ్వానాన్నే తిరస్కరించిన భారత యువ కెరటం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.