Car fired and Man burnt alive : కారులో ఓ వ్యక్తి సజీవ దహనమైన సంఘటన వెంకటాచలం మండలం గొలగమూడి రైల్వేగేటు సమీపంలో శనివారం మధ్యాహ్నం చోటుచేసుకొంది. పోలీసుల కథనం ప్రకారం... బుచ్చిరెడ్డిపాళేనికి చెందిన మాలేటిపాటి మల్లికార్జున్(45) గత కొన్నేళ్లుగా ఆర్‌కే జిరాక్స్ దుకాణం నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం నెల్లూరు నగరంలోని విజయ మహాల్ రైల్వేగేటు ప్రాంతంలోని అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. శనివారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఇంటికి వెళుతున్నట్లు చెప్పి దుకాణం నుంచి కారులో బయలుదేరారు.
మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో గొలగమూడి రైల్వేగేటు సమీపంలో మొగల్‌చెరువుకు వెళ్లే మార్గంలోని ఖాళీ ప్రదేశానికి చేరుకున్నారు. ఆ తర్వాత ఏమైందో తెలియదు.. అక్కడ కారులో ఉవ్వెత్తున మంటలు రావడాన్ని గుర్తించిన స్థానికులు.. పోలీసులకు సమాచారమందించారు. దాంతో వారు అగ్నిమాపక సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పారు. కారును పరిశీలించగా డ్రైవింగ్ సీటులో ఓ వ్యక్తి మంటల్లో పూర్తిగా సజీవ దహనమైనట్లు గుర్తించారు. నెల్లూరు గ్రామీణ డీఎస్పీ హరినాథ్‌రెడ్డి, సీఐ జగన్మోహన్‌రావు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రాథమిక ఆధారాల మేరకు ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.
వివరాల సేకరణ..
సీసీ ఫుటేజీని పరిశీలించడంతో పాటు డాగ్‌స్క్వాడ్, క్లూస్‌టీంను పిలిపించి ఆధారాలు సేకరించారు. కారు రిజిస్ట్రేషన్ ఆధారంగా మల్లికార్జున్‌గా గుర్తించి.. అతడి దుకాణం వద్దకు వెళ్లి ఆరా తీశారు. ఇంటికి వెళ్తున్నట్లు చెప్పి కారులో బయల్దేరారని సిబ్బంది తెలిపారు. వారిని వెంట తీసుకుని పోలీసులు మృతుడి ఇంటికి వెళ్లారు. మధ్యాహ్నం ఫోన్ చేస్తే బయట ఉన్నానని, ఇంటికి వస్తున్నానని చెప్పారని, ఆ తర్వాత ఫోన్ స్విచ్ఛాఫ్ చేశారని కుటుంబ సభ్యులు తెలిపారు. దాంతో కుటుంబ సభ్యులను వెంట పెట్టుకుని సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మల్లికార్జున్ దేహం పూర్తిగా కాలిపోయి గుర్తుపట్టలేని విధంగా మారింది. కుటుంబ సభ్యుల సమాచారం మేరకు మృతదేహాన్ని గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడి సతీమణి శ్రావణి సంఘటన స్థలంలో సొమ్మసిల్లారు. వీరికి ఇద్దరు పిల్లలు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టామని, పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని డీఎస్పీ హరినాథ్‌రెడ్డి తెలిపారు.
ఇదీ చదవండి:
WOMAN HULCHAL : మద్యం మత్తులో యువతి హల్చల్.. పోలీసు చొక్కా పట్టుకుని వీరంగం