ETV Bharat / city

SRISAIALAM: తిరుగులేని వైభవం చెరిగిపోని శాసనం!

author img

By

Published : Jul 5, 2021, 7:49 AM IST

ancient inscriptions found in Srisailam
శ్రీశైలంలో ఇటీవల వెలుగులోకి వచ్చిన తామ్ర పత్రాలు

శ్రీశైలంలో ఇటీవల దొరుకుతున్న శాసనాలు ఆ క్షేత్ర చారిత్రక వైభవాన్ని మరింత ఇనుమడింపజేస్తున్నాయి. తరతరాల ఆధ్యాత్మిక శక్తికి తిరుగులేని సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. ఎందరో రాజులు, రాణులు శ్రీశైలేసుడిని ఆరాధించి, ఆ విశేషాలను రాగి రేకులు, రాతి స్తంభాలపై లిఖించారు. దేవస్థానం 2020 సెప్టెంబరు నుంచి చేపట్టిన పంచ మఠాల పునరుద్ధరణ పనుల్లో అవి వెలుగుచూస్తున్నాయి. పంచ మఠాల్లో ఒకటైన ఘంటా మఠం పనుల్లో పలు తామ్ర పత్రాలు లభ్యమయ్యాయి. రెండు వారాల కిందట కూడా పది పత్రాలు దొరికాయి. వీటి ఆధారంగా పంచ మఠాలు ఏడో శతాబ్దం నుంచి 16వ శతాబ్దం మధ్య నిర్మించినట్లు తెలుస్తోంది.

ancient inscriptions found in Srisailam
శ్రీశైలంలో ఇటీవల వెలుగులోకి వచ్చిన తామ్ర పత్రాలు

రాజులు ‘శ్రీపర్వతం’గా పిలుచుకున్న కర్నూలు జిల్లాలోని శ్రీశైలంలో ఇప్పటివరకు తామ్ర శాసనాలు 53, బంగారు- 15, వెండి-265, ఒక తామ్ర నాణెం లభించాయి. ప్రాథమిక ఆధారాల ప్రకారం ఇవి 13-17వ శతాబ్దాల మధ్య కాలానికి చెందినవిగా గుర్తించారు. శాసనాల్లో తెలుగు, సంస్కృతం, కన్నడ, ఒరియా లిపిలో ఉన్నా.. ప్రధానంగా ‘నంది నాగరి’ లిపి ఎక్కువ కనిపిస్తోంది. రుద్రాక్ష మఠానికి ఉత్తరం వైపు పరుపు బండ (షీట్‌ రాక్‌)పై చిత్ర లిపిలోనూ ఉన్నాయి. ఇప్పటి వరకు ఎక్కడా లభ్యం కాని రేచర్ల లింగమనాయక తామ్ర శాసనం ఘంటా మఠంలో వెలుగుచూసింది.

లింగమనాయక 1350లో దేవరకొండను పరిపాలించినట్లు ఆర్కియాలజీ ఆఫ్‌ సర్వే ఇండియా మైసూరు విభాగం డైరెక్టర్‌ డాక్టర్‌ మునిరత్నంరెడ్డి తెలిపారు. గతనెల 13న లభించిన 21 శాసనాలను డాక్టర్‌ మునిరత్నం రెడ్డి పరిశీలిస్తున్నారు. ఇప్పటికే 17 శాసనాల సమాచారం సేకరించారు. మిగతా వాటినీ తెలుగులోకి అనువదించి పుస్తక రూపంలో తీసుకురానున్నారు. ఆగస్టు నెలాఖరుకు పుస్తకం అందుబాటులోకి వస్తుందని ఆలయ ఈవో రామారావు, మునిరత్నం రెడ్డి తెలిపారు. తామ్ర శాసనాలు, నాణేల కోసం మ్యూజియం ఏర్పాటు చేయనున్నట్లు ఈవో తెలిపారు.

ఇదీ చదవండి..

JAC LETTERS: దేశంలో ఎంపీలకు అమరావతి ఐకాస లేఖలు

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.