ETV Bharat / city

MLC Anantha Babu అభియోగపత్రం దాఖలులో తాత్సారం.. అనంతబాబుకు సహకరించటమే?

author img

By

Published : Aug 13, 2022, 11:37 AM IST

MLC Anantha Babu: హత్య కేసులో అభియోగపత్రం దాఖలులో తాత్సారం చేయడం... అనంతబాబుకు సహకరించటమేననే విమర్శలు జోరుగా వినిపిస్తున్నాయి. దళిత యువకుడి హత్య కేసులో పోలీసుల తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిందితుడు బెయిల్‌ పొందితే.. తమ ప్రాణాలకు ముప్పని బాధితులు ఆందోళన చెందుతున్నారు.

MLC Anantha Babu
అనంతబాబు

MLC Anantha Babu: దళిత యువకుడు, కారు డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం హత్య కేసులో అభియోగపత్రం దాఖలు చేయటంలో పోలీసులు ఉద్దేశపూర్వకంగానే తాత్సారం చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడైన ఎమ్మెల్సీ అనంత ఉదయ్‌భాస్కర్‌(అనంతబాబు) బెయిల్‌ పొందేలా మార్గం సుగమం చేసేందుకు ప్రణాళిక ప్రకారం జాప్యం చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పదేళ్లు.. అంతకంటే ఎక్కువ శిక్ష పడేందుకు వీలున్న నేరాల్లో నిందితుడికి జ్యుడీషియల్‌ రిమాండు విధించిన నాటి నుంచి 90 రోజుల్లోగా అభియోగపత్రం వేయకపోతే అతను బెయిల్‌ పొందేందుకు ఆస్కారం లభిస్తుంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు అనంతబాబుకు పరోక్షంగా సహకరిస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

బెయిల్‌కు మార్గం సుగమం చేసేందుకేనా?
మే 19న సుబ్రహ్మణ్యం హత్యకు గురయ్యారు. నిందితుడైన ఎమ్మెల్సీ అనంతబాబును నాలుగు రోజుల తర్వాత మే 23న అరెస్టు చేశారు. అదే రోజు న్యాయమూర్తి ఆయనకు రిమాండు విధించారు. ఈ నెల 20 నాటికి ఆయన రిమాండులోకి వెళ్లి 90 రోజులు పూర్తవుతుంది. బెయిల్‌ కోరుతూ న్యాయస్థానాల్లో ఆయన వేసిన పిటిషన్‌లు ఇప్పటికే పలుమార్లు తిరస్కరణకు గురయ్యాయి. గడువు తేదీలోగా అభియోగపత్రం దాఖలు చేయకపోతే ఆయన బెయిల్‌ పొందేందుకు వీలు కలుగుతుంది. కేసు దర్యాప్తు తీరు, పోలీసుల నుంచి తగిన చొరవలేకపోవటం వంటి అంశాల్ని గమనిస్తే గడువులోగా అభియోగపత్రం దాఖలు కష్టమేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

నిందితుడు విడుదలైతే దర్యాప్తుపై ప్రభావం?
అనంతబాబు బెయిల్‌పై బయటకు వస్తే తమ ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందంటూ బాధితుడి కుటుంబ సభ్యులు, సాక్షులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయన జైలు నుంచి విడుదలైతే పలుకుబడి ఉపయోగించి దర్యాప్తును ప్రభావితం చేస్తారన్న ఆందోళన వ్యక్తమవుతోంది. తొలుత ఇప్పటివరకూ దర్యాప్తులో గర్తించిన అంశాలతో ప్రాథమిక అభియోగపత్రం దాఖలు చేసి.... మరిన్ని వివరాలతో తర్వాత అనుబంధంగా దాఖలు చేసుకునేందుకు వీలున్నా పోలీసుల నుంచి ఆ దిశగా చొరవ లేదు. హత్యకు గురైన సుబ్రహ్మణ్యం దళితుడు కావటంతో.... ఈ కేసులో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్లు కూడా జోడించారు. ఆ కేసుల్లో 60 రోజుల్లోనే అభియోగపత్రం దాఖలు చేయాలి. కానీ అదీ జరగలేదు.

కస్టడీ పిటిషన్‌ సమయంలోనూ అదే వ్యూహం
అనంతబాబును కస్టడీకి కోరుతూ పోలీసులు వేసిన పిటిషన్‌, ఈ హత్య కేసును సీబీఐ అప్పగించాలని కోరుతూ హతుడి కుటుంబ సభ్యులు వేసిన వ్యాజ్యం హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నాయని, వాటిపై ఏదో ఒక స్పష్టత రాకుండా అభియోగపత్రం దాఖలు చేసే పరిస్థితి లేదని పోలీసు అధికారులు అనధికారిక సంభాషణల్లో చెబుతున్నారు. అయితే వాటి విచారణకు, అభియోగపత్రం దాఖలుకు సంబంధం ఏమిటన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఏదైనా కేసులో నిందితులు అరెస్టై, జ్యుడీషియల్‌ రిమాండులోకి వెళ్లినప్పుడు వారిని మొదటి 15 రోజుల్లోనే పోలీసులు కస్టడీకి కోరాలి. అనంతబాబు విషయంలో 15వ రోజున చివరి నిమిషంలో ఆయన్ను కస్టడీకి కోరుతూ పోలీసులు పిటిషన్‌ వేశారు. ఎందుకు కస్టడీ అవసరమో సహేతుక కారణాలేవీ ఆ పిటిషన్‌లో ప్రస్తావించలేదు. న్యాయస్థానం ఆ పిటిషన్‌ కొట్టేసింది. ఆ తర్వాత దానిపై పోలీసులు హైకోర్టుకు అప్పీలుకు వెళ్లారు. కస్టడీకి తీసుకోకుండా తాత్సారం చేసేందుకే వ్యూహాత్మకంగానే పోలీసులు ఇలా చేశారన్న ఆరోపణలున్నాయి.

దర్యాప్తు తీరుపై ప్రశ్నలెన్నో?
* హత్య జరిగి దాదాపు మూడు నెలలవుతున్నా ఇప్పటివరకూ నేరఘటనా స్థలాన్ని తేల్చలేదు. నేరానికి ఉపయోగించిన ఆయుధాన్ని గుర్తించలేదు.

* ఈ నేరంలో అనంతబాబు ఒక్కరే కాకుండా ఆయనకు మరికొంత మంది సహకరించారన్న ఆరోపణలున్నాయి. ఇప్పటివరకూ వారెవరో తేల్చలేదు.

* ఈ కేసు దర్యాప్తు పురోగతిని పూర్తి గోప్యంగా ఉంచుతున్నారు. సీసీ ఫుటేజీ పరిశీలన, కాల్‌ డేటా విశ్లేషణ, సెల్‌ టవర్‌ డంప్‌ ఆధారంగా దర్యాప్తు వంటి అంశాలపై పోలీసుల నుంచి స్పష్టత లేదు

* హత్య జరిగిన రోజు రాత్రి అనంతబాబుతో కలిసి ఆయన భార్య అపార్ట్‌మెంట్‌లోకి వెళ్తున్నట్లు సీసీ ఫుటేజీలో కనిపించింది. ఆమెనూ ఇప్పటివరకూ విచారించలేదు

* అనంతబాబు వాంగ్మూలం ఆధారంగానే కేసు దర్యాప్తు చేశారు తప్ప.. ఆయన చెప్పిన విషయాల్లో ఎంత నిజముందో తేల్చలేదు.

పోలీసుల జాప్యమే..

ఎమ్మెల్సీ అనంతబాబు వ్యవహారంలో పోలీసులు ఉద్దేశపూర్వకంగానే 90 రోజుల్లోగా అభియోగపత్రం దాఖలు చేయకుండా తాత్సారం చేస్తున్నారు. దీని వల్ల ఆయనకు బెయిల్‌ వచ్చే వీలుంది. ఈ కేసులో పోలీసులు తొలి నుంచి నిందితుడికి సహకరించేలాగానే వ్యవహరిస్తున్నారు. సాక్షుల వాంగ్మూలాన్ని నమోదు చేయటానికి 55 రోజుల సమయం తీసుకున్నారు. - ముప్పాళ్ల సుబ్బారావు, పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు

ఎమ్మెల్సీ రిమాండ్‌ పొడిగింపు

దళిత యువకుడు సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడు ఎమ్మెల్సీ అనంతబాబు రిమాండ్‌ను తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఎస్సీ, ఎస్టీ కోర్టు మరో 14 రోజులు పొడిగించింది. గతంలో విధించిన రిమాండ్‌ గడువు ముగియడంతో రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఉన్న అనంతబాబును పోలీసులు శుక్రవారం న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. తాజాగా అయిదోసారి కోర్టు ఆయన రిమాండ్‌ను పొడిగించింది. బెయిల్‌ కోసం ఎమ్మెల్సీ తరఫు న్యాయవాది మూడోసారి అదే కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం ఇరువర్గాలు వాదనలు వినిపించాయి. బాధితుల తరఫు న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావు నిందితుడికి బెయిల్‌ ఇవ్వవద్దంటూ కోర్టులో కౌంటర్‌ దాఖలు చేశారు. ఈ నెల 16న తదుపరి వాదనలు జరగనున్నాయి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.