ETV Bharat / city

వైఎస్ఆర్ జిల్లా కమలాపురంలో యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా.. అడ్డుకున్న రైతులపైనే

author img

By

Published : Oct 8, 2022, 5:58 PM IST

Updated : Oct 8, 2022, 7:02 PM IST

Illegal Sand mining: ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ఇసుక అక్రమ రవాణా ప్రకంపనలు సృష్టిస్తోంది. గతంలో ఉన్న జేపీ వెంచర్స్ తప్పుకోవడంతో స్థానిక వైకాపా నేతలే గుత్తేదార్ల అవతారం ఎత్తి ఇష్టానుసారం తవ్వకాలు సాగిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. రైతుల పొలాల మీదుగా వందల లారీలతో ఇసుక తరలించడాన్ని స్థానికులు అడ్డుకున్నారు. పోలీసులు సైతం అధికారపార్టీ నేతలకు వత్తాసు పలుకుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

Illegal Sanad
అధికార పార్టీ నేతల ఇసుక అక్రమ రవాణా

Illegal Sand mining in AP: వైఎస్ఆర్ జిల్లా కమలాపురంలో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. సీఎం జగన్ సమీప బంధువు ఒకరు ఇసుక క్వారీల లీజు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఒక్కో రీచ్‌ నుంచి ఆయనకు నెలకు కోటి నుంచి 2 కోట్లు చెల్లించేలా.. స్థానిక నేతలు ఒప్పందం చేసుకున్నట్లు తెలిసింది. దీంతో రేయింబవళ్లు నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తరలిస్తున్నారు. వెదరూర్ వద్ద ఇసుక క్వారీకి అనుమతి ఉంది. కానీ స్థానిక వైకాపా నాయకులు ఇరుపాపురం వద్ద కూడా ఇసుక తవ్వకాలు చేస్తున్నారు.

అక్కడికి వెళ్లేందుకు సరైన మార్గం లేకపోవడంతో.. రైతుల పొలాల్లో నుంచి అడ్డంగా రహదారి వేసుకుని టిప్పర్లు, లారీల ద్వారా ఇసుక తరలించేందుకు సిద్ధం అవుతున్నారు. దీంతో రైతులు, స్థానిక తెదేపా కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. అక్రమంగా ఇసుక తీస్తున్న క్వారీ వద్దకు వెళ్లి పనులు అడ్డుకున్నారు. పంట పొలాలు పాడయ్యేలా వ్యవహరిస్త్తే మూకుమ్మడిగా ఆత్మహత్యలు చేసుకుంటామని రైతులు హెచ్చరించారు.
పెండ్లిమర్రి మండలంలో కూడా ఇసుక దందా సాగుతోంది. రైతులతో కలిసి తెదేపా నాయకులు ఇసుక అక్రమ రవాణాకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. కొత్తగంగిరెడ్డిపల్లెలో నిబంధనలకు విరుద్ధంగా 5 మీటర్ల లోతు వరకు ఇసుక తవ్వకాలు సాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధిక లోడుతో వెళ్తున్న లారీలతో రెండు నెలల కిందట వేసిన తువ్వపల్లె రహదారి దెబ్బతింది.

''కమలాపురం ప్రాంతంలో గత రెండు, మూడు సంవత్సరాలుగా ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు.. అడిగే వారు లేకపోవడంతో ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారు. ఇలాగే కొనసాగితే మేమంతా ముకుమ్మడిగా ప్రాణాలు తీసుకుంటాం '' - రైతులు

ఇసుక లారీలను తెలుగుదేశం నేతలు నిలుపుదల చేసేందుకు యత్నించగా పోలీసులు అక్కడికి చేరుకున్న ఆందోళనకారులనే మందలించారు. లారీలను అడ్డుకునే హక్కు లేదని వెల్లడించారు. కావాలంటే కలెక్టర్‌కు ఫిర్యాదు చేసుకోడంటూ అక్రమార్కులకు వత్తాసు పలికారని తెలుగుదేశం నేతలు ఆరోపించారు. కమలాపురం నియోజకవర్గంలో ఇసుక అక్రమ రవాణాపై 10రోజులుగా ఆందోళనలు కొనసాగుతున్నా. జిల్లా అధికార యంత్రాంగం కనీసం పరిశీలన చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది.

అధికార పార్టీ నేతల ఇసుక అక్రమ రవాణా

ఇవీ చదవండి:

Last Updated : Oct 8, 2022, 7:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.