ETV Bharat / city

వర్ల రామయ్య ఆరోపణలు నిరాధారం: ఎస్పీ విశాల్

author img

By

Published : Nov 16, 2020, 4:13 PM IST

Updated : Nov 16, 2020, 5:04 PM IST

vishal gunni
vishal gunni

యలమంద నాయక్ కుటుంబంపై దాడి ఘటనకు సంబంధించి తెదేపా నేత వర్ల రామయ్య నిరాధార ఆరోపణలు చేశారని గుంటూరు గ్రామీణ ఎస్పీ విశాల్ గున్నీ అన్నారు. మద్యం కేసులో యలమంద నాయక్​ను రెవెన్యూ అధికారుల సమక్షంలో అరెస్టు చేశామన్నారు. నోటీసులిచ్చాకే, అరెస్టు చేశామన్నారు. ఇందులోకి రాజకీయాలు తేవద్దని కోరారు.

నాగార్జున సాగర్ పోలీసు స్టేషన్ పరిధిలో మద్యం అమ్మకం కేసులో అరెస్టైన యలమంద నాయక్​పై పోలీసులు ఎలాంటి వేధింపులు చేయలేదని.. గుంటూరు గ్రామీణ ఎస్పీ విశాల్ గున్నీ వివరణ ఇచ్చారు. ఈ విషయమై తెలుగుదేశం పార్టీ నేత వర్ల రామయ్య నిరాధార ఆరోపణలు చేస్తున్నారని.. ఇలాంటి వ్యాఖ్యల వల్ల పోలీసుల నైతిక స్థైర్యం, పోలీసులపై ప్రజలకు ఉన్న నమ్మకం సన్నగిల్లే అవకాశం ఉందన్నారు. గుంటూరు జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయన మాట్లాడారు.

రెవెన్యూ అధికారుల సమక్షంలోనే యలమంద నాయక్​ను అరెస్టు చేశామన్నారు. అరెస్టుకు ముందు కుటుంబ సభ్యులకు 50 సీఆర్‌పీసీ కింద నోటీసులు ఇచ్చామన్నారు. యలమంద నాయక్​ను పోలీసులు వేధిస్తే.. న్యాయమూర్తి ముందు ఎందుకు చెప్పలేదని ఎస్పీ విశాల్ గున్నీ ప్రశ్నించారు. సీఆర్‌పీసీ చట్టం ప్రకారమే పని చేస్తున్నామని తమపై ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేవని విశాల్ స్పష్టం చేశారు. అరెస్టై విడుదలైన 15 రోజుల తర్వాత తమపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. గురజాల డీఎస్పీ, సీఐ సస్పెన్షన్ వెనుక వారి పనితీరులో పురోగతి లేకపోవడమే కారణమన్నారు. వీరిద్దరి సస్పెన్షన్ వెనుక ఎలాంటి కోణాలు లేవని ఎస్పీ విశాల్ గున్నీ స్పష్టం చేశారు.

సంబంధిత కథనం:

కిడ్నాప్ చేశారు.. మాచర్ల వెళ్లేదాకా కొడుతూనే ఉన్నారు

Last Updated :Nov 16, 2020, 5:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.