ETV Bharat / city

Dr. Uma: డాక్టర్ దాతృత్వం.. ఆస్తి అంతా జీజీహెచ్​కు..

author img

By

Published : Oct 6, 2022, 10:59 AM IST

Updated : Oct 7, 2022, 10:51 AM IST

20 crore donations" ఆమె ఒక వైద్యురాలు.. తను జీవితాంతం కష్టపడి కూడబెట్టిన ఆస్తిని ఒక్క సంతకంతో ఆసుపత్రికి ధారాదత్తం చేశారు. ఆమె భర్త మూడు సంవత్సరాల క్రితం చనిపోగా.. తనకు, తన భర్తకు చెందిన పూర్తి ఆస్తులను ఆసుపత్రికి డొనేట్​ చేశారు. ఆమెను స్ఫూర్తిగా తీసుకోని మరి కొంత మంది దాతలు ముందుకు వచ్చారు. వారు సైతం గుంటూరు జీజీహెచ్​కు భారీగా విరాళాలు ఇచ్చారు.

Special Article on Dr. uma
డాక్టర్‌ ఆస్తినంతా గుంటూరు జీజీహెచ్‌కు ఇచ్చేశారు

Special Article on Dr. Uma: చదువులమ్మ చెట్టు నీడలో కష్టపడిన వారంతా నేడు ఉన్నత స్థానాల్లో పనిచేస్తున్నారు. ఇన్నేళ్ల ప్రస్థానంలో వివిధ హోదాలకు చేరుకున్నా..ఎంత ఎత్తుకు ఎదిగినా.. తాము చదువుకున్న విద్యాలయాన్ని వారు మర్చిపోలేదు. తమ విజయానికి బాటలు వేసిన కళాశాల రుణం తీర్చుకునేందుకు ముందుకొచ్చారు గుంటూరు ప్రభుత్వ వైద్యశాల పూర్వవిద్యార్థులు. మాతా, శిశు సంరక్షణ విభాగానికి 86 కోట్ల రూపాయల విరాళాన్నిఅందజేయనున్నారు.

జీజీహెచ్‌ అభివృద్ధికి ముందుకొచ్చిన పూర్వ విద్యార్థులు

రాష్ట్రంలోనే ఎంతో పేరు ప్రఖ్యాతలు కలిగిన గుంటూరు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి.. వివిధ జిల్లాల నుంచి పెద్దసంఖ్యలో రోగులు వస్తుంటారు. రోగుల సంఖ్యకు అనుగుణంగా సౌకర్యాలు మెరుగురపచకపోవడంతో ఆస్పత్రిలో ఇన్‌ పేషెంట్లకు మంచాలు దొరక్క తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా లేబర్, గైనిక్ వార్డుల్లో బాలింతలు, పసికందులు ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై చలించిన అమెరికాలో ఉన్న పూర్వ విద్యార్థులు M.C.H విభాగం నిర్మాణానికి ముందుకు వచ్చారు.

జింకానాకి సహాయంగా కేెంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు : పూర్వ విద్యార్థులంతా కలిసి జింకానా పేరిట 30 కోట్లు ఇవ్వనుండగా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరో 35 కోట్లు ఇచ్చేందుకు అంగీకరించాయి. 650 పడకలతో M.C.H విభాగ భవన నిర్మాణాన్ని 2019లోనే చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం సెల్లార్‌, గ్రౌండ్‌ఫ్లోర్‌, సెకండ్‌ ఫ్లోర్‌ నిర్మించనుండగా.. ఆ తర్వాత 2 నుంచి 5 అంతస్తుల పనులు జింకానా చేపట్టనుంది. ఇప్పటికీ ఈ భవన నిర్మాణం పునాదుల దశ దాటకపోవడంతో జింకానా వైద్యులు మరోసారి దృష్టిసారించారు. ఎంసీహెచ్​ విభాగం నిర్మాణానికి అయ్యే ఖర్చు 85 కోట్లు విరాళంగా అందజేయాలని నిర్ణయించారు. దీంతో నిర్మాణ పనులు పరుగులు పెట్టనున్నాయి.

ఒక్క సంతకంతో ఆస్తి మొత్తం ఆసుపత్రికి ధారాదత్తం : తను జీవితాంతం కష్టపడి కూడబెట్టిన ఆస్తిని ఒక్క సంతకంతో ఆసుపత్రికి ధారాదత్తం చేశారు ఆ వైద్యురాలు. భర్త మూడేళ్ల కిందట మృతి చెందటం, వారసులు లేకపోవడంతో డాక్టర్‌ ఉమ గవిని తన ఆస్తినంతా గుంటూరు జీజీహెచ్‌కు ఇచ్చేశారు. చివరికి తన దగ్గర ఒక్క రూపాయి సైతం మిగుల్చుకోలేదు. మొత్తంగా రూ.20 కోట్ల (2.50 మిలియన్​ డాలర్లు)చేసే తన ఆస్తిని జీజీహెచ్‌లో కొత్తగా నిర్మించబోయే మాతా శిశు సంక్షేమ భవనం కోసం ఇస్తున్నట్లు ప్రకటించారు డాక్టర్ ఉమ. గుంటూరు జిల్లాకు చెందిన ఆమె అమెరికాలో ఇమ్యునాలజిస్ట్‌, ఎలర్జీ స్పెషలిస్ట్​గా విధులు నిర్వర్తిస్తున్నారు.

జింకానా అధ్యక్షురాలిగా సేవలు : ఆమె 1965లో గుంటూరు వైద్య కళాశాలలో మెడిసిన్‌ చేశారు. అనంతరం ఉన్నతవిద్య పూర్తి చేసి నాలుగు దశాబ్దాల క్రితం అమెరికా వెళ్లారు. ఇమ్యునాలజిస్ట్‌ స్పెషలిస్ట్‌ డాక్టర్‌గా అక్కడే స్ధిరపడ్డారు. గత నెలలో డల్లాస్‌లో గుంటూరు వైద్య కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఉమ పాల్గొన్నారు. తాను మెడిసిన్‌ చేసిన జీజీహెచ్‌కు భారీ విరాళం ఇవ్వాలన్న నిర్ణయాన్ని ఆమె అక్కడి వేదిక మీదే ప్రకటించారు. తన చేతిలో డాలర్‌ కూడా దాచుకోకుండా తన తరపున, తన భర్త తరపున వచ్చిన ఆస్థి మొత్తాన్ని విరాళంగా ఇచ్చారు. గతంలో ఉమా 2008లో ‘జింకానా’ అధ్యక్షురాలిగా సేవలందించారు.

ఎంసీహెచ్‌ బ్లాక్‌ ఆమె భర్త పేరు : ఆమె అందించిన విరాళంతో నిర్మాణం అవుతున్న జీజీహెచ్‌లోని ఎంసీహెచ్‌ బ్లాక్‌కు ఆమె పేరును పెడతామని జింకానా సభ్యులు తెలిపారు. ఈ ప్రతిపాదనను ఆమె సున్నితంగా తోసిపుచ్చారు. చివరికి జింకానా సభ్యులు డాక్టర్‌ ఉమా భర్త.. డాక్టర్‌ కానూరి రామచంద్రరావు పేరును ఈ బ్లాక్‌ను పెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఉమ భర్త డాక్టర్‌ కానూరి రామచంద్రరావు కర్ణాటకలోని గుల్బర్గాలో మెడిసిన్‌ చేసి, ఎనస్థీషియన్​గా విధులు నిర్వహించే వారు. అయితే మూడేళ్ల కిందట ఆయన మృతి చెందారు.

ఆమె స్ఫూర్తితో మరికొంత మంది: ఉమ స్ఫూర్తితో మరికొందరు వైద్యులు ముందుకొచ్చారు. మొవ్వా వెంకటేశ్వర్లు 20 కోట్లు, సూరపనేని కృష్ణప్రసాద్‌, షీలా దంపతులు 8 కోట్లు, తేళ్ల నళిని, వెంకట్‌ దంపతులు 8 కోట్లు ఇచ్చేందుకు అంగీకరించారు. మరికొంతమంది పూర్వ విద్యార్థులు కూడా విరాళాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చదువుకున్న కళాశాలపై మమకారాన్ని మర్చిపోని జింకానా వైద్యుల స్ఫూర్తి మరెందరికో ఆదర్శంగా నిలుస్తోంది.

ఇవీ చదవండి:

Last Updated : Oct 7, 2022, 10:51 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.