ETV Bharat / city

పన్ను చెల్లింపునకు అడ్డంకులు... నెరవేరని రెవిన్యూ లక్ష్యాలు

author img

By

Published : Jul 2, 2020, 3:57 PM IST

రాష్ట్రంలో పురపాలక సంఘాలలో ఆస్తి పన్ను చెల్లింపులు భారంగా మారాయి. ఆన్​లైన్ విధానంలో సర్వర్లు మొరాయించడంతో పన్నులు చెల్లించేందుకు ప్రజలు అవస్థలు పడుతున్నారు. మీసేవ కేంద్రాలు, నగర సేవ యాప్ ద్వారా చెల్లించేందుకు అంతగా అవకాశం లేకపోవడం కూడా పన్ను చెల్లింపులు తక్కువగా నమోదవుతున్నాయి. దీంతో రెవిన్యూ లక్ష్యాలు అందనంత దూరంలో ఉన్నాయి.

పన్ను చెల్లింపునకు అడ్డంకులు...నెరవేరని రెవెన్యూ లక్ష్యాలు
పన్ను చెల్లింపునకు అడ్డంకులు...నెరవేరని రెవెన్యూ లక్ష్యాలు

పురపాలక సంఘాల్లో ఇంటి పన్నులు, ఖాళీ స్థలాల పన్నులు నిర్ణీత గడువులోగా చెల్లించే వారికి ప్రభుత్వం ఐదు శాతం రాయితీ ఇస్తోంది. గడువు దాటిన తర్వాత రెండు శాతం అపరాధ రుసుంతో వసూలు చేస్తారు. సాధారణ పరిస్థితుల్లో పురపాలక సంఘాలలో ఏప్రిల్ నెలాఖరులోగా పన్ను చెల్లించిన వారికి రాయితీ కల్పించేవారు. కరోనా వైరస్ కారణంగా లాక్‌డౌన్‌ అమలులో ఉండడంతో రాయితీ ఇచ్చే గడువును జూన్ నెలాఖరు వరకు పొడిగించారు. మారిన పరిస్థితులలో పన్ను వసూళ్ల బాధ్యతలను సచివాలయ ఉద్యోగులకు అప్పగించారు. అయినప్పటికీ గడిచిన 20 రోజులుగా సర్వర్లు పనిచేయకపోవడంతో వినియోగదారులు పన్ను చెల్లించ లేకపోయారు.

పురపాలక సంఘాల రెవిన్యూ అధికారులు తరచూ పర్యవేక్షించిన ప్రయోజనం లేకపోయింది. లాక్​డౌన్ కారణంగా మీ సేవ కేంద్రాలు అంతంతమాత్రంగా పనిచేయడంతో ప్రజలు పురపాలక సంఘం సచివాలయం మీద ఆధారపడాల్సి వచ్చింది.

లక్ష్యం రూ.64.05 కోట్లు.. వసూళ్లు రూ.26.70 కోట్లు

పశ్చిమగోదావరి జిల్లాలో ఏలూరు నగరపాలక సంస్థతో సహా 9 పురపాలికల్లో 64 కోట్ల 5 లక్షల రూపాయలు రెవెన్యూ వసూళ్ల లక్ష్యం కాగా జూన్ నెలాఖరు నాటికి 26 కోట్ల 70 లక్షల రూపాయలు మాత్రమే వసూళ్లైంది. వాస్తవానికి నిర్ణీత గడువులోగా ఈ మొత్తం కూడా వసూలు అయితే కోటి 86 లక్షల 75 వేల రూపాయల వరకు ప్రజలకు రాయితీ లభించేది. గడువు ముగిసి పోవడంతో ఈ నెల ఒకటో తేదీ నుంచి చెల్లించవలసిన మొత్తంపై వినియోగదారులకు 74 లక్షల 70 వేల రూపాయలు మేర వడ్డీ భారం పడుతుంది.

జిల్లాలోని పురపాలక సంఘాల వారీగా రెవెన్యూ వసూళ్లు

పురపాలక/నగర పాలక సంఘం లక్ష్యం(రూ. కోట్లలో) జూన్​ నెలాఖరుకు వసూళ్లు(రూ.కోట్లలో)
ఏలూరు 21.58 6.48
భీమవరం 11.33 6.01
పాలకొల్లు 4.271.90
తాడేపల్లిగూడెం 8.52 2.68
తణుకు 6.97 3.80
నర్సాపురం 3.20 1.48
నిడదవోలు 2.65 1.49
కొవ్వూరు 1.50 1.12
జంగారెడ్డిగూడెం 4.03 1.74

ఇదీ చదవండి : సచివాలయం, అసెంబ్లీలో కరోనా కలకలం... 10 మందికి పాజిటివ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.