ETV Bharat / city

ఉత్తరాంధ్ర అభివృద్ధిపై వైకాపా ప్రభుత్వ ప్రకటనలు.. ఉత్తరకుమార ప్రగల్భాలే

author img

By

Published : Oct 11, 2022, 10:04 AM IST

ఉత్తరాంధ్ర అభివృద్ధిపై వైకాపా ప్రభుత్వ ప్రకటనలు.. ఉత్తరకుమార ప్రగల్భాలే అవుతున్నాయి. మూడున్నరేళ్లుగా ఉత్తరాంధ్ర జిల్లాల ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో పురోగతి లేకపోవడమే ప్రభుత్వ వైఖరికి అద్దం పడుతోంది. గత ప్రభుత్వ హయాంలో ఓ కొలిక్కి వచ్చిన ప్రాజెక్టులనూ వైకాపా సర్కారు పూర్తిచేయలేకపోతోంది. నిధులు కేటాయించకపోడం, ప్రాజెక్టుల నిర్మాణ పురోగతిపై దృష్టి సారించకపోవడం.. ఈ దుస్థితికి కారణమవుతోంది.

ఉత్తరాంధ్రలో ప్రాజెక్టులు
ఉత్తరాంధ్రలో ప్రాజెక్టులు

ఉత్తరాంధ్రలో ప్రాజెక్టులు

ఉత్తరాంధ్రపై రాష్ట్ర ప్రభుత్వం, వైకాపా నేతల మాటల్లోని ప్రేమ.. చేతల్లో ఏమాత్రం కనిపించడం లేదు. ఆ ప్రాంతంలోని సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం పడకేయడమే ఇందుకు నిదర్శనం. అభివృద్ధికి నిధులు వెచ్చించడంలో, ప్రాజెక్టులు పూర్తి చేయడంలో వాస్తవ పరిస్థితిని చూస్తే.. ఆ ప్రాంతంపై వారి ప్రేమ ఏపాటిదో అర్థమైపోతుంది. జగన్ ప్రభుత్వం ఏర్పడిన మూడున్నరేళ్లు గడిచినా.. ఉత్తరాంధ్రలో ఒక్క సాగునీటి ప్రాజెక్టు నిర్మాణమూ పూర్తిచేయలేదు. రాష్ట్రంలో అప్పటికే కొలిక్కి వచ్చిన 5 ప్రాజెక్టుల నిర్మాణం పూర్తిచేస్తామని ప్రభుత్వం ప్రకటించుకున్నా.. ఆ లక్ష్యాలనూ చేరుకోలేకపోతోంది. వంశధార-నాగావళి అనుసంధానం, వంశధార రెండో భాగం రెండో దశ పనులనూ పూర్తిచేయలేకపోయారు. చాలినన్ని నిధులు ఇవ్వకపోవడం, ప్రాజెక్టుల పురోగతిపై శ్రద్ధ పెట్టకపోవడంతో.. సాగునీటి రంగంలో ఉత్తరాంధ్ర వట్టిపోతోంది. గత ప్రభుత్వ హయాంలో ఉత్తరాంధ్ర ప్రాజెక్టులపై అధికార గణాంకాల ప్రకారమే 15 వందల 90.98 కోట్ల రూపాయలు ఖర్చు చేయగా.. ఈ మూడున్నరేళ్లలో జగన్ సర్కార్‌ 498.62 కోట్లు మాత్రమే వెచ్చించింది. ఇందులో ఇంకా 100 కోట్లకు పైగా బిల్లుల చెల్లింపులు చేయాల్సి ఉంది. అనేక పనుల్లో గుత్తేదారులు ముందస్తుగా ఒప్పందాలు రద్దు చేసుకునేందుకు అవకాశం కల్పించి.. ఆ పనులను రద్దు చేశారు. మళ్లీ ఆయా పనుల్లో అంచనాలు పెంచేసి, కొత్తగా టెండర్లు పిలిచేందుకు ప్రయత్నిస్తున్నారు. పనులు చేసినా బిల్లులు రావన్న భయంతో కొన్నిచోట్ల గుత్తేదారులు టెండర్లకు ముందుకు రాకపోవడంతో పనులు సాగడం లేదు.

శ్రీకాకుళం జిల్లాలో కీలకమైన ప్రాజెక్టు వంశధార రెండో భాగం. వంశధార నదిపై కాట్రగడ్డ వద్ద సైడ్ వియర్‌ నిర్మించి వరద నీటిని హిరమండలం జలాశయానికి మళ్లించి ఆయకట్టుకు ఇచ్చేలా ప్రణాళిక చేశారు. ఈ ప్రాజెక్టు సింహభాగం పనులు 2019 నాటికే పూర్తయినా... మిగిలినవి ఇప్పటికీ పూర్తికాలేదు. ఈ పథకంలో కుడి కాలువ కింద 20 వేల ఎకరాలు, వరద కాలువ కింద 20 వేల ఎకరాలు, హిరమండలం జలాశయం హైలెవల్‌ కాలువ కింద 5 వేల ఎకరాల ఆయకట్టుకు నీరివ్వాలన్నది లక్ష్యం. 2021 మార్చికే ఈ ప్రాజెక్టు పూర్తిచేస్తామని సీఎం జగన్‌ సమీక్షల్లో చెప్పారు.

2023 జూన్‌ నాటికి పూర్తిచేస్తామని తాజాగా చెబుతున్నారు. ఈ ప్రాజెక్టు పనులను మూడు ప్యాకేజీలుగా విభజించారు. సున్నా కిలోమీటర్ నుంచి 13.447 కిలోమీటర్ల వరకు వరద కాలువ నిర్మాణం, కాట్రగడ్డ వద్ద సైడ్‌ ఛానల్ వియర్ నిర్మాణం, సింగిడి బ్యాలెన్సింగ్ జలాశయం, డిస్ట్రిబ్యూటరీల నిర్మాణం... మొదటి ప్యాకేజీలో భాగం. ఇంకా వరద కాలువ 3.117 కిలోమీటర్ల మేర లైనింగ్ పనులు పూర్తికావాలి. రెండు డిస్ట్రిబ్యూటరీల తవ్వకం పూర్తిచేయాలి. మట్టి తవ్వకం పనులు 4 లక్షల 51 వేల 173 క్యూబిక్ మీటర్ల మేర చేయాలి. ఇక వరద కాలువ 13.447 కిలోమీటర్‌ నుంచి 33.71 కిలోమీటర్‌ వరకు తవ్వి... కాంక్రీట్‌ లైనింగ్ చేయడం, పారాపురం బ్యాలెన్సింగ్ జలాశయం నిర్మాణం, డిస్ట్రిబ్యూటరీ కాలువల తవ్వకం వంటి పనులు రెండో ప్యాకేజీలోఉన్నాయి.

వరద కాలువ ఇంకా 0.426 కిలోమీటర్ల మేర తవ్వాలి. 1.12 లక్షల క్యూబిక్‌ మీటర్ల మేర మట్టి తవ్వకం, 4 వేల 268 క్యూబిక్ మీటర్ల కాంక్రీటు పనులు చేయాలి. 11 డిస్ట్రిబ్యూటరీలకు గానూ 5 పూర్తయ్యాయి. మరో ఆరు డిస్ట్రిబ్యూటరీల తవ్వకాలు, ఇతర తవ్వకాల పనులు చేయాలి. ఇక్కడ ఇంకా 4.17 ఎకరాల భూమి సేకరించాల్సిఉంది. హిరమండలం జలాశయం నిర్మాణం మొత్తం ఒక ప్యాకేజీగా నిర్మిస్తున్నారు. 19.05 టీఎంసీల నీటిని నిల్వ చేసేలా ఈ నిర్మాణం చేపట్టారు. లింకు కాలువకు ఎడమవైపు హెడ్ స్లూయిస్‌ నిర్మాణం, కుడి కాలువను అనుసంధానించేలా లింకు కాలువ తవ్వకం, హైలెవల్ కాలువ కోసం కుడివైపు హైడ్ స్లూయిస్ నిర్మాణం వంటి పనులు ఈ ప్యాకేజీలోఉన్నాయి. ఇంకా 8.81 లక్షల క్యూబిక్ మీటర్ల మేర మట్టి తవ్వకం చేయాలి. మరో రెండు కట్టడాలు నిర్మించాలి. 29 వేల 900 క్యూబిక్ మీటర్ల మేర కాంక్రీటు పని మిగిలి ఉంది. Spot

వంశధార-నాగావళి నదుల అనుసంధానంతో... వంశధార వరద జలాలను మళ్లించే పనులు ఇంకా పూర్తికాలేదు. నారాయణపురం ఆనకట్ట కింద సాగయ్యే 18 వేల 527 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించడంతోపాటు... కొత్తగా నాలుగు మండలాల్లోని 5 వేల ఎకరాల ఆయకట్టుకు నీళ్లు ఇవ్వాలనే లక్ష్యంతో ఈ పనులు చేపట్టారు. తొలుత 130 క్యూసెక్కులు మళ్లించేలా కాలువను ప్రతిపాదించినా... ఆ తర్వాత 600 క్యూసెక్కులకు సవరించారు. 2020లో ప్రాజెక్టు అంచనా వ్యయం 145.34 కోట్లకు పెంచారు. దీన్ని 2020 డిసెంబర్‌కే పూర్తిచేస్తామని సీఎం సమీక్షలో జలవనరులశాఖ పేర్కొంది. తాజాగా 2023 జూన్‌కు పూర్తిచేస్తామంటున్నారు. కాలువ తవ్వకంలో ఇంకా 3 లక్షలకు పైగా క్యూబిక్ మీటర్ల పని చేయాలి. 36 వేల క్యూబిక్ మీటర్ల మేర కాంక్రీట్‌ పని, 34 కట్టడాలు పూర్తిచేయాలి.

మహేంద్రతనయ నదిపై ఆఫ్‌షోర్‌ జలాశయం నిర్మాణ పనుల్లోనూ పురోగతి లేదు. నదిపై మెళియాపుట్టి మండలంలో 1.76 టీఎంసీల నీటిని నిల్వ చేసే ఆఫ్‌షోర్‌ జలాశయం పనులు పెండింగ్‌లోనే ఉన్నాయి. ఈ జలాశయం నుంచి కాలువల ద్వారా 24 వేల 600 ఎకరాల ఆయకట్టుకు నీరివ్వాలన్నది లక్ష్యం. 2007లో 127 కోట్ల అంచనా వ్యయంతో పాలనామోదం ఇచ్చారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే 26 గ్రామాలకు, కాశీబుగ్గ మున్సిపాలిటీకి... తాగునీరు, నాలుగు మండలాల్లోని 108 గ్రామాలకు సాగునీరు అందుతాయి. ఈ ప్రాజెక్టు కోసం తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 229 కోట్ల వరకు కోసం వెచ్చించగా... వైకాపా సర్కారు ఇప్పటివరకూ 48 కోట్లే ఖర్చు పెట్టింది. ఈ రిజర్వాయర్ వల్ల 5 గ్రామాలు పూర్తిగా, మరో 7 ఊళ్లు పాక్షికంగా మునుగుతాయి. డిస్ట్రిబ్యూటరీ పనుల కోసం 373 ఎకరాల భూమిని సేకరించాలి.
వైకాపా ప్రభుత్వం ఈ ప్రాజెక్టు అంచనా వ్యయాలను 852.45 కోట్లకు పెంచింది. వరద కాలువ ఇంకా 5 కిలోమీటర్లకు పైగా తవ్వాలి. 40 లక్షల క్యూబిక్ మీటర్ల మేర మట్టి తవ్వకం పనులు చేయాలి. 26 కట్టడాల నిర్మాణం పూర్తికావాలి. దాదాపు 1.4 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీటు పనులు జరగాలి.

మడ్డువలస రిజర్వాయర్ ప్రాజెక్టు నుంచి కుడి ప్రధాన కాలువను విస్తరించి... 12 వేల 500 ఎకరాల అదనపు ఆయకట్టుకు 1.12 టీఎంసీల నీళ్లు అందించాలనేది ప్రణాళిక. జి.సిగడాం, పొందూరు, లావేరు, ఎచ్చెర్ల మండలాల్లోని 21 గ్రామాలకు దీనివల్ల ప్రయోజనం కలుగుతుంది. ఈ ప్రభుత్వం వచ్చాక ప్రాజెక్టు పనులు ముందుకు కదల్లేదు. ఒప్పందాన్ని ముందుగా రద్దు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఇలా రద్దు చేసిన ఏ పనులూ తక్షణమే చేపట్టేందుకు వీల్లేదన్న ప్రభుత్వమే... మిగిలిన వాటిని 26.90 కోట్లతో చేపట్టేందుకు పాలనామోదం ఇచ్చింది. అయితే రెండుసార్లు టెండర్లు పిలిచినా గుత్తేదారులు స్పందించలేదు.

విజయనగరం జిల్లాలో నాగావళి నదిపై బ్యారేజీ నిర్మాణం, 64 వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణతోపాటు... కొత్తగా లక్షా 31 వేల ఎకరాల ఆయకట్టుకు 15.89 టీఎంసీల నీరిచ్చేందుకు తోటపల్లి ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. శ్రీకాకుళం జిల్లాలోని 7 మండలాల్లో 132 గ్రామాలకు, విజయనగరం జిల్లాలోని 10 మండలాల్లో 155 గ్రామాలకు లబ్ధి చేకూరుతుంది. 24 గ్రామాల్లో తాగనీటి సరఫరా కోసం కుడి ప్రధాన కాలువ ద్వారా 42 చెరువులను నింపడం కూడా ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దశం. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 2019 నాటికి 91 శాతం పనులు పూర్తయ్యాయి.

2020 జూన్ నాటికి ఈ ప్రాజెక్టును పూర్తిచేస్తామని వైకాపా ప్రభుత్వం చెప్పినా.... ఎలాంటి పురోగతీ లేదు. ఈ ప్రాజెక్టు మొదటి ప్యాకేజీలో హెడ్‌ వర్క్స్‌తో పాటు కుడి ప్రధాన కాలువ సున్నా కిలోమీటర్ నుంచి 52.450 కిలోమీటర్ల వరకు తవ్వాలి. 2019 మే నాటికే మొదటి ప్యాకేజీలో 76.28 శాతం పనులు పూర్తయ్యాయి. ఈ గుత్తేదారుతో వైకాపా ప్రభుత్వం 2020 జులైలో ముందస్తుగా ఒప్పందం రద్దు చేసుకుంది. మిగిలిన పనులను 59.58 కోట్లతో చేపట్టేందుకు తిరిగి పాలనామోదం ఇచ్చింది. ఈ ప్యాకేజీలో ప్రభుత్వ గణాంకాల ప్రకారమే 13 శాతం పనులు పూర్తయ్యాయి. 6 లక్షల 22 వేల క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వకం పనులు పూర్తిచేయాలి.

13 కట్టడాలు నిర్మించడంతోపాటు.. 47 వేల క్యూబిక్ మీటర్ల మేర కాంక్రీట్ పని పూర్తిచేయాలి. ఇక రెండో ప్యాకేజీలో కుడి ప్రధాన కాలువ 52.450 కిలోమీటర్‌ నుంచి 117.89 కిలోమీటర్‌ వరకు తవ్వడంతోపాటు... డిస్ట్రిబ్యూటరీలు, ఫీల్డ్ ఛానల్‌ తవ్వకం పనులు చేయాలి. 2019 నాటికి ఈ ప్యాకేజీలో 90.12 శాతం పనులు పూర్తయ్యాయి. వైకాపా ప్రభుత్వం 2020 జులైలో పనులను ముందస్తుగా రద్దు చేసుకునే అవకాశం కల్పించింది. మిగిలిన పనిని 63.63 కోట్లకు అంచనా పెంచి కొత్త గుత్తేదారుకు అప్పజెప్పింది. ఈ ప్యాకేజీలో 12 శాతం పనులే జరిగినా.. బిల్లులు పెండింగ్‌లోనే ఉన్నాయి.

తోటపల్లి కుడి ప్రధాన కాలువ 97.70 కిలోమీటర్ల నుంచి కాలువ పొడిగింపు పథకమే గజపతినగరం బ్రాంచి కాలువ ప్రాజెక్టు. 25 కిలోమీటర్ల మేర కాలువను పొడిగించి... విజయనగరం జిల్లాలోని ఆరు మండలాల్లో 15 వేల ఎకరాలకు నీరిచ్చేలా ఈ పథకాన్ని రూపొందించారు. 2008లో 76.99 కోట్లకు పాలనామోదం ఇచ్చి పనులు ప్రారంభించారు. కుడి ప్రధాన కాలువ పనులు 2019నాటికే 43.34 శాతం పూర్తయ్యాయి. G.B.C. మైనర్‌, సబ్ మైనర్లలో గుత్తేదారు 2019 నాటికి 51 శాతం పనులు పూర్తిచేశారు. వైకాపా ప్రభుత్వ హయాంలో ఆ రెండు గుత్తేదారు సంస్థలు ఒప్పందాన్ని రద్దు చేసుకునేలా ఉత్తర్వులివ్వడంతో... 2020 జులైలో వైదొలిగారు.

మైనర్లు, ఫీల్డ్ ఛానళ్లు, సబ్‌ ఛానళ్లు తవ్వి 13 వేల 172 ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించేలా 11.968 కోట్లతో సిరి కన్‌స్ట్రక్షన్‌ పనులు ప్రారంభించినా... 7 శాతం పూర్తిచేశాక నిలిపేశారు. ఆ సంస్థ ఆసక్తి చూపకపోవడంతో ఒప్పందం రద్దుకు జలవనరులశాఖ ఏర్పాట్లు చేసింది. దీనివల్ల 2019 తర్వాత గజపతినగరం బ్రాంచి కెనాల్ పనుల్లో పురోగతి అంతంతమాత్రమే. మిగిలిన పనుల పూర్తికి 137.80 కోట్ల ఖర్చవుతుందని అంచనాలు తయారుచేసి ప్రభుత్వానికి పంపారు. Spot

విజయనగరం జిల్లా గుర్ల మండలం కోటగండ్రేడు సమీపంలో చంపావతి నదికి అడ్డంగా బ్యారేజీ నిర్మించి... 16 వేల 538 ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరు ఇచ్చేలా తారకరామతీర్థ ప్రాజెక్టు రూపొందించారు. డెంకాడ ఆనకట్ట కింద 8 వేల 172 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ కూడా ప్రాజెక్టు లక్ష్యాల్లో ఒకటి. 2019 మే నాటికే 47.51 శాతం పనులు పూర్తవగా... వైకాపా సర్కార్‌ వచ్చాక 10 శాతం పనులే జరిగినట్లు అధికారిక గణాంకాలే చెబుతున్నాయి. 2005లో 220.40 కోట్లతో పాలనామోదం ఇస్తే... వైకాపా ప్రభుత్వం ప్రాజెక్టు అంచనాను 739.90 కోట్లకు పెంచింది.

చంపావతి నదిపై బ్యారేజీని నిర్మాణానికి 181.50 కోట్ల ఒప్పంద విలువతో పనులు అప్పజెప్పారు. అప్పట్లో 130.20 కోట్ల విలువైన పనిచేశాక గుత్తేదారు నిలిపివేశారు. వైకాపా ప్రభుత్వం హయాంలో మిగిలిన పనులను 198.80 కోట్లకు లెక్కించి... పాలనామోదం కోసం ప్రతిపాదనలు పంపారు. ఎడమ కాలువ, కుడి కాలువ తవ్వకం, డిస్ట్రిబ్యూటరీ, కాంక్రీటు పనులను ఒక భాగంగా విడగొట్టి... 76.60 కోట్ల ఒప్పందంతో గుత్తేదారులకు అప్పజెప్పారు. వీటిలో 9 శాతం పనులే జరిగాయి. టన్నెల్ నిర్మాణం సహా ఇతర పనులను రెండో భాగంగా విభజించి, 51.44 కోట్ల ఒప్పందం విలువతో మరో గుత్తేదారుకు అప్పజెప్పగా... 12 శాతం పనులే పూర్తయ్యాయి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.