ETV Bharat / city

నాటిన మొక్కలకు నీరు పెట్టరు.. వాటి సంరక్షణ పట్టదు !

author img

By

Published : Sep 14, 2021, 4:01 AM IST

Updated : Sep 14, 2021, 7:14 AM IST

పచ్చని చెట్లు.. ప్రగతికి మెట్లు.. ప్రభుత్వం పదేపదే వినిపించే నినాదమిది.. పచ్చగా ఎదగాలంటే మొక్క దశ నుంచే వాటిని కాపాడాలన్న స్పృహ మాత్రం అధికార యంత్రాంగంలో కొరవడింది. రాష్ట్రంలో నిరుడు జాతీయ ఉపాధి హామీ పథకం కింద అరకోటికిపైగా మొక్కలు నాటితే అందులో కనీసం 40 శాతం నిలువునా ఎండిపోయాయి. నీళ్లు పెట్టే నాథుడు లేక కొన్నిచోట్ల, పశువులకు మేతగా మారి మరికొన్నిచోట్ల అవి ఆనవాళ్లు లేకుండా పోయాయి. నీళ్లు పెట్టేందుకు పంచాయతీలకు నిధులిచ్చినా చాలా జిల్లాల్లో నీళ్లందకే మొక్కలు ఎండిపోవడం గమనార్హం. రాష్ట్రవ్యాప్తంగా ఉపాధి పథకం కింద నాటిన మొక్కల స్థితిగతులను ‘ఈనాడు, ఈటీవీ భారత్'​- క్షేత్రస్థాయిలో పరిశీలించగా తేలిన వాస్తవాలివీ. దాదాపు 80 కోట్ల నిధులతోపాటు పర్యావరణం కోసం పచ్చదనం పెంచాలన్న స్ఫూర్తి హరించుకుపోయింది.

నాటిన మొక్కలు బతికేదెలా
నాటిన మొక్కలు బతికేదెలా

గత ఏడాది 13 జిల్లాల్లో నాటిన మొక్కలను ‘ఈనాడు’ ప్రతినిధులు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే కార్యక్రమం అమలులో అనేక లోపాలు కనిపించాయి. అత్యధిక జిల్లాల్లో 40 నుంచి 50 శాతం మొక్కలూ బతకలేదు. నీళ్లు సరిగా పెట్టక కొన్ని ఎండిపోతే... ట్రీగార్డుల్లేక మరికొన్ని పశువుల పరమయ్యాయి. 2.04 లక్షల మొక్కలకు ట్రీగార్డులు పెట్టి, వందశాతం జియో ట్యాగింగ్‌ చేశామని అధికారుల నివేదికలు చెబుతున్నాయి. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పుడు క్షేత్రస్థాయిలో మొక్కలు ఎందుకు కనిపించడం లేదన్నదే ప్రశ్న. కిలోమీటరుకు 400 చొప్పున నాటిన మొక్కలకు నెలలో నాలుగు సార్లు నీటి తడులు పెట్టేందుకు నెలకు రూ.2 వేల చొప్పున గ్రామ పంచాయతీలకు చెల్లించారు. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో నీటి తడుల్లేక చాలా మొక్కలు ఎండిపోయాయి. విశాఖపట్నం, ఉభయ గోదావరి, గుంటూరు, అనంతపురం జిల్లాల్లో సంరక్షణ లేక ఎక్కువ భాగం చనిపోయాయి.

  • జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(నరేగా)లో భాగంగా గ్రామాల్లో రహదారులకు ఇరువైపులా, లేఅవుట్లలో మొక్కల పెంపకం ఇలా ఉంది.

జగనన్న పచ్చతోరణం పేరుతో ఈ ఏడాది జులై 20న విజయవాడలో రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహించారు. అందులో పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముందు అధికారులు ప్రదర్శించిన నివేదికలోని వివరాలివి. 2020-21లో వేసిన మొక్కల్లో 60% మాత్రమే బతికాయని, మిగతా 40% చనిపోయినట్లు అధికారులే అంగీకరించారు. 2021-22లో మొక్కలు నాటడానికి అధికారులను సన్నద్ధులను చేసే ఉద్దేశంతో ఈ సదస్సు నిర్వహించారు.

  • నెల్లూరు జిల్లా కావలి మండలం ఆముదాలదిన్నె- తాళ్లపాళెం మధ్య రహదారిలో గత ఏడాది వేసిన 8 వేల మొక్కల్లో ప్రస్తుతం ఒక్కటీ కనిపించడం లేదు. ఇదే మార్గంలో 2019-20లోనూ వెలుగు ఆధ్వర్యంలో పొదుపు మహిళలు మొక్కలు నాటారు.
  • అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలంలోని బోరంపల్లిలో వెయ్యి మొక్కలు నాటగా 650 బతికాయి. మల్లికార్జునపల్లిలో 900కు 300, గోళ్లలో వెయ్యికి 690, కనిపించాయి. అత్యధికచోట్ల సంరక్షణ లోపంతోనే మొక్కలు చనిపోయాయి. ట్రీగార్డులు ఏర్పాటు చేయకపోవడం, నీళ్లు పెట్టకపోవడం వంటి లోపాలతో ఎండిపోయాయి.
  • ప్రకాశం జిల్లా వేటపాలెం-కుందేరు రహదారి ఇది. పక్కన మొక్కలు నాటినా.. ఇప్పుడా జాడ లేదు. వేటపాలెం మండలంలో 5,603 మొక్కల్లో మూడొంతులు ఎండిపోయాయి. సంరక్షణకు చుట్టూ రూ.11.96 లక్షలతో ముళ్లకంచెలు వేశారు. ఉపాధి కూలీలను ఏర్పాటు చేసి నీరు పెట్టే బాధ్యత పంచాయతీలకు అప్పగించారు. ఈ ప్రక్రియ సరిగా నిర్వహించకపోయినా నిధులు డ్రా చేశారు. వేటపాలెం పంచాయతీలో 1,211 మొక్కలు నాటినట్లు రికార్డుల్లో ఉన్నా 200 కూడా కనిపించలేదు.
  • పశ్చిమగోదావరి జిల్లా పోలవరం మండలంలోని పైడిపాక పునరావాస కాలనీకి వెళ్లే మార్గం పక్కన మొక్కల్ని నిర్లక్ష్యంగా పడేశారు. ఈ దారిలో చాలాచోట్ల మొక్కలు ఇలా ఎండిపోయాయి. పోలవరం నుంచి ఇటుకలకోట వెళ్లే రహదారిలో వేసిన మొక్కలకు ట్రీ గార్డులకు బదులు ముళ్ల కంచెలను రక్షణగా పెట్టారు.
  • గుంటూరు జిల్లాలో పెదకూరపాడు నుంచి లింగంగుంట్ల వెళ్లే రహదారికి ఇరువైపులా నాటిన 400 మొక్కల్లో 60 మిగిలాయి. చాలా వాటిని గేదెలు, గొర్రెలు, మేకలు తినేశాయి. ట్రీగార్డులు లేకపోవడంతో పశువుల పరమయ్యాయి. అమరావతి నుంచి పెదమద్దూరు వెళ్లే మార్గంలో నాటిన 260 మొక్కల్లో 60 బతికాయి.

యంత్రాలతో గుంతలు

రాష్ట్రంలో 2021-22లో కోటి మొక్కలు నాటాలన్న లక్ష్యంలో ఇప్పటికే పలు జిల్లాల్లో కార్యక్రమం మొదలైంది. అనంతపురం జిల్లా అగళి మండలంలో మధూడి గొల్లహట్టి నుంచి హుళ్లేకెర రహదారికి ఇరువైపులా యంత్రాలతో గుంతలు తీయడం చర్చనీయాంశమవుతోంది. ఉపాధి కూలీలతో చేయించాల్సిన పనులకు యంత్రాల్ని వాడటం నిబంధనలకు విరుద్ధం. కర్నూలు జిల్లా ఆస్పరి పరిధిలోని బిల్లేకల్లు వెళ్లే కర్నూలు ప్రధాన రహదారి పక్కన ఇటీవల వేసిన మొక్కలు నీళ్లు పోయని కారణంగా ఎండిపోయాయి. రక్షణ కంచె లేకపోవడంతో పశువులు తినేస్తున్నాయి.

ఇదీ చదవండి..

జల్‌శక్తి శాఖ అదనపు కార్యదర్శితో కృష్ణా, గోదావరి బోర్డుల ఛైర్మన్ల భేటీ

Last Updated : Sep 14, 2021, 7:14 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.