ప్రకృతి సిద్ధమైన వన సంపద.. ఎత్తైన కొండలు.. అందులోంచి ఉబికివచ్చే జలపాతాలు.. అక్కడక్కడ కనిపించే చిన్న చిన్న ఆదివాసీ పల్లెలు.. కల్మషమెరగని ప్రజలు.. నేలను తాకుతున్నాయా అన్నట్లుండే మేఘాలు.. పిల్లగాలికి ఊగే ఆకులు.. భానుడి కిరణాలతో పసిడివర్ణాన్ని సంతరించుకునే పచ్చని పంట చేలు.. వెరసి తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా అటవీ ప్రాంతంలోని అద్భుత దృశ్యమాలికకు నిలువుటద్దం.
అడవి కొత్త అందాలు..
ఇటీవల ఏకధాటిగా కురిసిన వర్షాలతో ఆదిలాబాద్ జిల్లా అడవి కొత్త అందాలను సంతరించుకుది. ప్రధానంగా లోహర, పిప్పల్‌ధరి, తలమడుగు, కోసాయి, ఇంద్రవెల్లి, సిరికొండ అటవీప్రాంతంలోని ప్రకృతి సోయగం పర్యావరణ ప్రేమికులను మంత్రముగ్ధులను చేస్తోంది. లోహర, ఖండాల కొండప్రాంతంలో మలుపులు తిరుగుతూ సాగే సన్నటి బీటీ రహదారిపై పయనిస్తుంటే ఇరుపక్కల నుంచి సహజసిద్ధమైన ప్రకృతి స్వాగతం పలికినట్లే ఉంటుంది.
ప్రకృతి శోభ..
భారీ వాహానాలు, బస్సులు, లారీల జాడ అసలే ఉండదు. ఎక్కడో ఓ చోట అన్నట్లు కనిపించే చిన్నచిన్న కార్లు, ద్విచక్ర వాహనాలు అవీ లేవంటే ఎడ్లబళ్లు, కాలినడకనే రాకపోకలు సాగించడమే ఇక్కడి ప్రాంత ప్రజలకు ఇష్టం. క్షణం తీరికలేకుండా గడిపే పట్టణవాసులకు భిన్నంగా ఇక్కడి ప్రజలు... ప్రకృతితో మమేకమైపోతే బయట వ్యక్తులు మాత్రం ప్రకృతికి శోభకు తన్మయులై మంత్రముగ్ధులవుతారంటే అతిశయోక్తికాదు.
రెప్పవాల్చనీయని అందాలు..
ప్రధానంగా ఆదిలాబాద్‌కు 25 కిలోమీటర్ల దూరంలో ఉండే లోహర అటవీ ప్రాంతం పచ్చని చీరకట్టుకుందా.. అన్నట్లుగా ఆకుపచ్చగా మారింది. ఆదిలాబాద్ నుంచి మామిడిగూడ వరకు కొండ ప్రాంతమంతా మూలమలుపులతో సాగుతోంది. ప్రతిమూల మలుపు దగ్గర నిలబడి చూస్తే కింది ప్రాంతమంతా.. రెప్పవాల్చనీయకుండా కనువిందు చేస్తుంది. కొండలపై నుంచి జాలువారే జలదారల సవ్వడి... మనసుకు హాయిని ఆనందాన్ని రెట్టింపు చేస్తోంది. ప్రకృతి అందాలను సెల్ఫీల్లో బందించుకునేలా చేస్తోంది. ప్రభుత్వాలు కోట్లు వెచ్చించిన సహజసిద్ధమైన అందాలను తయారుచేయడం కష్టమనే అభిప్రాయం వినిపిస్తోంది.
ఆకురాల్చే అడవులుగా ప్రసిద్ధి పొందిన ఆదిలాబాద్ అడవులు.. వేసవి ఆరంభం కంటే ముందే ఆకురాల్చడం ప్రారంభమవుతోంది. మళ్లీ చినుకు పలకరించగానే.. చిగురించడం ప్రారంభమవుతోంది. కాలానికి అనుగూణంగా అడవి అందాలను మార్చుకుంటుంది. ప్రకృతి తత్వాన్ని బోధిస్తోంది.
ఇదీ చదవండి:
Couple Suicide Attempt: ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం.. సెల్ఫీ వీడియో వైరల్..!