ETV Bharat / city

నరమేధం ఎన్నాళ్లు ...? తూటా చప్పుడు లేని దండకారణ్యం చూస్తామా ..?

author img

By

Published : Apr 7, 2021, 6:10 AM IST

Updated : Apr 7, 2021, 6:32 AM IST

encounter in chhattisgarh
ఛత్తీస్‌గఢ్‌ నరమేధం

దశా‌బ్దాలుగా విప్లవవర్గాల పోరు కొనసాగుతూనే ఉంది. ఆర్థిక, సామాజిక సమీకరణాలు ఉద్యమ తీవ్రతను కొంతమేరకు చల్లార్చుతున్నప్పటికీ...స్వభావాన్ని మాత్రం మార్చలేకపోతున్నాయి. అదే సమయంలో... తూటా పేలిన ప్రతిసారి శాంతి చర్చలు అంటున్న ప్రభుత్వాలు... శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేయట్లేదు. తప్పెవరిదైనా... లోపాలు ఎక్కడ ఉన్నా... బలవుతోంది సామాన్యులే. భద్రతా దళాలు వెనక్కి వెళ్లిపోవాలని మావోయిస్టులు..! మావోయిస్టులు తూపాకీలు వీడి లొంగిపోవాలని ప్రభుత్వాలు...! ఈ వైఖరి ఎన్నాళ్లు...? తూటా చప్పుడు లేని దండకారణ్యం చూస్తామా..?

'ఛత్తీస్‌గఢ్‌ నరమేధానికి తగిన రీతిలో ప్రతీకారం తప్పదు'... కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా చేసిన కీలక ప్రకటన ఇది. కానీ, ప్రభుత్వాలు ఒక్క విషయాన్ని గమనించాలి. ఇది ఏ ఒక్క ప్రాంతానికో... ఏ ఒక్క మరణానికో సంబంధించింది కాదు. 50 ఏళ్ల క్రితం ఉత్తర బెంగాల్‌లోని నక్సల్బరీ సాయుధ పోరాటంతో మెుదలు... ఇటీవలి ఉదంతం వరకు పరిస్థితులను బట్టి వామపక్ష తీవ్రవాదం ఉరుముతునే ఉంది. సమయం, ప్రాంతం బట్టి తీవ్రత మారినా... చల్లబడ్డారు అనుకున్న ప్రతిసారి రెట్టించిన రీతిలో విరుచుకుపడుతునే ఉన్నారు మావోయిస్టులు.

రెండో దశలో ప్రజా సంఘాలు, ప్రజా సంఘాలు..

1977 నుంచి 2003 దాకా సాగిన నక్సలైట్ ఉద్యమ రెండో దశలో ప్రజా సంఘాలు, ప్రజోద్యమాలు కీలక పాత్ర పోషించాయి. మేధావులూ ఉద్యమంలో భాగస్వాములయ్యారు. ఈ ప్రభావం ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో.. తర్వాత మధ్య బిహార్ అంటే ఇప్పటి ఝార్ఖండ్​లో కనిపించింది. దండకారణ్యమైతే మావోయిస్టులకు అడ్డాగా మారిపోయింది. దండకారణ్యం అంటే ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా సరిహద్దుల్ని ఆనుకుని ఉన్న గిరిజన ప్రాంతం.

ఛత్తీస్‌గఢ్‌ నరమేధం

బస్తర్ సైతం..

అలాగే ఛత్తీస్‌గఢ్ లోని బస్తర్ కూడా ఉద్యమానికి కేంద్రం అయింది. తరువాత నక్సలైట్లు ప్రజాగెరిల్లా దళాలు ఏర్పాటు చేశారు. 3వ దశలో బస్తర్ ప్రాంతం మావోయిస్టు ప్రతిఘటనోద్యమాలకు కంచుకోటగా మారింది.

కొందరు జనస్రవంతిలో..

కాలానికి అనుగుణంగా సామాజిక, ఆర్థిక, విద్య వంటి అంశాలు విప్లవంలో చీలికలు తీసుకు వచ్చాయి. ఆ మార్పుల్లో ఇమడలేని వారు జనజీవన స్రవంతిలో కలిశారు. మరికొందరు ప్రాణాలు కోల్పోయారు. కారణాలేవైనా ఉద్యమం అప్పుడు-ఇప్పుడూ ఒకరకంగా ప్రస్థానం సాగించడం లేదనేది వాస్తవం. అయితే, విప్లవ సమీకరణ ఎలా కొనసాగింది అన్నది ప్రధానమైన ప్రశ్న. అందుకు ప్రధాన కారణం.. ఝార్ఖండ్ గెరిల్లా ప్రాంతంలోని అల్పా షా గిరిజనులకు, మావోయిస్టు సంస్థకు మధ్య సన్నిహిత సంబంధాలే. పోరాటం కొనసాగుతున్న ప్రాంతాలలో గిరిజనులతో మంచి సంబంధాలు ఏర్పరచుకోవడం, విప్లవ అభివృద్ధి క్రమాన్ని అర్థం చేసుకోవడం, నిరంతరం జనసమీకరణ కొనసాగడం ఇంతకాలంగా ఉద్యమానికి ఊపిరి పోశాయి.

అక్కడ వారి మధ్య నిత్యం యుద్ధమే..

దేశంలో మిగతా ప్రాంతాల కంటే.. బస్తర్ ప్రాంతంలో భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య యుద్ధం నిత్యం నడుస్తోంది. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇక్కడ 3200కు పైగా ఎన్‌కౌంటర్‌లు జరిగాయి. హోంశాఖ నివేదిక ప్రకారం జనవరి 2001 నుంచి 2019 మే వరకు వామ పక్ష తీవ్రవాద హింసలో 1002 మావోయిస్టులు, 1234 మంది భద్రతా సిబ్బంది మరణించారు. 1782 మంది సాధారణ పౌరులు కూడా బలయ్యారు. 3896 మంది మావోయిస్టులు లొంగిపోయారు.

శాంతి చర్చల మాట..

ఎన్‌కౌంటర్లు, లొంగుబాట్ల మధ్య అప్పుడప్పుడు శాంతి చర్చల మాట వినిపిస్తుంది. తర్వాత దాని గురించి ఎవరూ పట్టించుకోరు. బస్తర్‌ నుంచి భద్రతా దళాలను వెనక్కి పిలవాలని, మావోయిస్టు నాయకులను విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ గత నెలలో కూడా మావోయిస్టులు శాంతి చర్చలకు పిలుపునిచ్చారు. కానీ వారి డిమాండ్లు నెరవేర్చలేమని, ముందు తుపాకులను వదలాలని, తర్వాతే చర్చల గురించి మాట్లాడాలంటూ ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం తెలిపింది. ప్రభుత్వంపై నమ్మకం లేని మావోలు... ఆయుధాలు వదులు కోవడానికి ఇష్టపడట్లేదు.

ఇది అతిపెద్ద అంతర్గత సవాల్..

అంతర్గత భద్రతకు మావోయిజం అతి పెద్ద సవాల్‌. ఈ సమస్య ఇంకా సమస్యగా మిగిలి పోయింది. మన్మోహన్‌ సింగ్‌ ప్రధానిగా ఉన్నప్పుడు ఒకనొక సందర్భంలో చేసిన వ్యాఖ్యలివి. ఆయన చెప్పినట్లుగా ప్రస్తుత పరిస్థితులు ఉన్నాయి. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం ఏర్పడిన తరువాత... 2 కాంగ్రెస్‌, 3 బీజేపీ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. ఎన్నికల్లో ప్రధాన వినిపించే నక్సలిజం అంతం... హామిలుగానే మిగిలిపోతున్నాయి. 2010లో దంతెవాడ దాడిలో 76 మంది సీఆర్‌ఫీఎఫ్‌ జవాన్లు మృతిచెందారు. ఆ ఘటనతో ఉలిక్కిపడిన యూపీఏ ప్రభుత్వం... కూంబింగ్‌ వంటి చర్యలు చేపట్టింది. కానీ అది సఫలమవలేదు.

నక్సల్స్ ఉనికిని పూర్తిగా తుడివేస్తామని..

ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం కూడా మావోయిస్టు కార్యకలాపాల్ని చాలా మేరకు తగ్గించామని చెబుతోంది. దేశంలో వామపక్ష తీవ్రవాదం 11 రాష్ట్రాల్లో 90 జిల్లాలకు పరిమితం అయిందని తెలిపింది. మావోయిస్టుల హింసాకాండ 46 జిల్లాల్లోనే నమోదైనట్లు సుమారు ఆరు నెలల క్రితం ప్రకటించింది. నక్సల్‌ కార్యకలాపాలు రాబోయే సంవత్సరాల్లో...పూర్తిగా తుడిచి వేస్తామని ఇటీవలే పార్లమెంట్‌ సమావేశాల్లోనూ తెలిపింది. గతంలో కేంద్ర హోం మంత్రిగా ఉన్న రాజ్‌నాథ్‌ సింగ్‌- ఏకీకృత కమాండ్‌ అవసరాన్ని ప్రస్తావించారు. 8 మౌలిక సూత్రాల ‘సమాధాన్‌’తో రాష్ట్రాలు ముందడుగేయాలని పిలుపిచ్చారు. తద్వారా, పొంచి ఉన్న శత్రువుల కదలికల్ని ముందుగానే ఊహించగల సామర్థ్యం పెరుగుతుందని ఆకాంక్షించారు. కానీ, నేటికీ ఆ దిశగా సరైన అడుగులు పడలేదు అన్న విమర్శలు ఉన్నాయి.

ఉత్తర్‌ప్రదేశ్‌, మహారాష్ట్రలతో పోల్చితే... ఛత్తీస్‌గఢ్‌లో మావోయిజం ఎక్కువగా ఉండటానికి ప్రధానకారణం.. పోలీసు వ్యవస్థను ఆధునికంగా తీర్చిదిద్దకపోవడమే. దీనిని గుర్తించిన ప్రధాని మోదీ... 2014 ఎన్నికల సందర్భంగా అధికారంలోకి రాగానే నిధులు పెంచుతామని చెప్పారు. కానీ, అది జరగలేదు. 2013-14లో పోలీసుల ఆధునికరణకు రాష్ట్ర బడ్జెట్‌లో 65 కోట్లు కేటాయిస్తే... 2020-21లో 20 కోట్లు మాత్రమే ఇచ్చినట్లు ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రహోం మంత్రి తమరాధ్వాజ్‌ సాహు తెలిపారు.

ఇంకా మంజూరు కాలేదు..

అందులో కేంద్రం వాటా..9.7 కోట్లు మాత్రమే. పక్కన ఒడిశాకు 15 కోట్లు, ఉత్తర్‌ప్రదేశ్‌కు 63 కోట్లు కేటాయించారు. నిధుల కొరతతో...కొత్తగా పోలీసు నియామకాలు, నూతన వాహనాలు, ఆధునిక సాంకేతికత అందిపుచ్చుకోలేక పోతున్నామన్నారు. మావోయిస్టుల కార్యకలాపాల్ని తగ్గించేందుకు 200 టీఆర్​ఓ, ఇన్‌సాస్‌ రైఫీల్స్‌ కావాలని 2017లో ప్రతిపాదన చేయగా... ఇంకా మంజూరు కాక పోవడం పరిస్థితి అద్దం పడుతోందని ఆయన వాపోయారు.

విప్లవ బాట రోజులు పోతున్నాయి..

ప్రభుత్వాలతో పాటు మావోయిస్టులు గమనించాల్సిన మరో ముఖ్య విషయం ఏమిటంటే... ఇంత పెద్ద దేశాన్ని విప్లవ చర్యలతో గెలవలేరు. ప్రపంచవ్యాప్తంగా సిద్ధాంత ధోరణులు మారుతున్నాయి. సమ సమాజం ఏర్పడడానికి విప్లవ బాట ఒక్కటే ఏకైక మార్గమనే రోజులు పోతున్నాయి. ప్రజాస్వామ్య దేశంలో భిన్నాభిప్రాయాన్ని ప్రకటించడానికి, శాంతియుతంగా వ్యతిరేకించడానికి ఎప్పుడూ అవకాశం ఉంటుంది. అలాంటి ఉద్యమాలకు ప్రజానీకం మద్దతు కూడా లభిస్తుంది.

హింసాత్మక విధానాలకు స్వస్తి చెప్పి..

సాగుచట్టాలకు వ్యతిరేకంగా కొన్ని నెలలుగా సాగుతున్న రైతు ఉద్యమం అందుకు ఉదాహరణ. విప్లవమార్గం మినహా మరో దారిలో సమానత్వం సాధించలేమనుకోవడం సరైనది అనిపించుకోదు. మావోలు ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది. ఇప్పటికైనా హింసాత్మక విధానాలకు స్వస్తి చెప్పి... శాంతియుత వాతావరణంలో హక్కుల్ని సాధించుకోవాలి.

ఇవీ చూడండి:

2వేల మంది పోలీసులు మాపై దాడి: మావోయిస్టులు

Last Updated :Apr 7, 2021, 6:32 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.