ETV Bharat / city

తెలంగాణలోని రాజన్న ఆలయం ఈ విషయాలు తెలుసా?

author img

By

Published : Mar 11, 2021, 2:59 AM IST

Raja Rajeswara Kshetram news
రాజన్న ఆలయం ఈ విషయాలు తెలుసా?

తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి క్షేత్రం దక్షిణకాశీగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయాన్ని మొదట్లో లేములవాడ, లేంబాల వాటిక అనే పేర్లతోనూ పిలిచేవారని ఇక్కడున్న శాసనాల ద్వారా తెలుస్తోంది. రాజన్న అని నోరారా పిలుచుకునే ఈ రాజరాజేశ్వరస్వామి.. ఎంతో మహిమగల దేవుడని భక్తుల విశ్వాసం. దేవాలయానికి సంబంధించి పలు ప్రత్యేక విశేషాలు కలవు.

క్షేత్రచరిత్ర/స్థలపురాణం :

మాళవ ప్రభువైన రాజరాజ నరేంద్రుడు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు పౌరాణిక ఆధారాలు చెబుతున్నాయి. వేములవాడను చాళుక్యులు రాజధానిగా చేసుకొని పాలించినట్లు చరిత్రలో ఉంది. చాళుక్య రాజులలో మొదటి రాజు వినయాదిత్య యుద్ధమల్లుడు, అతని కుమారుడు అరికేసరి, ఆ తర్వాత రెండో యుద్ధమల్లుడు వేములవాడ కేంద్రంగా రాజ్యాన్ని పాలించారు. చాళుక్య రాజుల్లో చివరివాడు.. భద్రదేవుడి కుమారుడైన మూడో అరికేసరి అని దేవస్థానంలో ఉన్న శిలాశాసనాల ద్వారా తెలుస్తోంది.

ఆలయ ప్రత్యేకత:

తెలంగాణలోని వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ధర్మగుండంలో పుణ్యస్నానం చేసి కోడెమొక్కు చెల్లించడం ఈ ఆలయ ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. ఆ తర్వాతే భక్తులు స్వామిని దర్శించుకొని ప్రధాన పూజలైన కల్యాణం, అభిషేకం, అన్నపూజ, కుంకుమ పూజ, ఆకుల పూజ, పల్లకిసేవల వంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. భక్తుల్లో చాలామంది స్వామివారికి తమ తలనీలాలు సమర్పించి తమ ఎత్తు బంగారాన్ని(బెల్లం) స్వామికి మొక్కుగా చెల్లించి.. ఆపై దాన్ని స్వామి ప్రసాదంగా పంపిణీ చేస్తారు. ప్రతినెలా దాదాపు 10 లక్షల మంది భక్తులు స్వామిని దర్శించుకొంటారని అంచనా.

ప్రధాన వేడుకలు :

ఆలయంలో ఏటా మహాశివరాత్రి సందర్భంగా మూడురోజులపాటు వైభవంగా జాతర నిర్వహిస్తారు. సుమారు 5-6 లక్షల మంది భక్తులు స్వామిని దర్శించుకుంటారు. ఆపై శ్రీరామనవమి సందర్భంగా జరిగే శివ కల్యాణోత్సవాలు ఈ క్షేత్రం ప్రత్యేకతల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు. పదివేలమంది హిజ్రాలు, 25 వేల మంది శివపార్వతులు శ్రీరామనవమి రోజున శివుడిని పెళ్లాడతారు. అలాగే.. త్యాగరాజ స్వామి ఆరాధనోత్సవాలు, ముక్కోటి ఏకాదశి, దసరా నవరాత్రోత్సవాలూ ఇక్కడ విశేషంగా నిర్వహిస్తారు. మాస శివరాత్రి, ఏకాదశి రోజున స్వామికి ప్రత్యేకపూజలు నిర్వహిస్తారు. మహాశివరాత్రి రోజున స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశిపూజ, మహాలింగార్చన చేస్తారు. ఇందులో పాల్గొనే దంపతులతో పాటు కుటుంబసభ్యులను అనుమతిస్తారు. కల్యాణపూజలో పాల్గొన్న భక్తులకు 20 లడ్డూలు, భోజన వసతి కల్పిస్తారు.

ఆలయప్రాంగణంలోని ఉప ఆలయాలు

రామాలయం, అనంతపద్మనాభస్వామి ఆలయం, బాలా త్రిపురసుందరీదేవి ఆలయం, మహిషాసురమర్ధిని ఆలయం, ఆంజనేయస్వామి ఆలయం.

*ఉపాలయాల్లో ప్రత్యేక పూజలు లేవు. అన్ని చోట్లా ఉచిత దర్శనమే.

నిర్వహించే పూజలు

* ప్రాతఃకాల పూజ

* మధ్యాహ్న పూజ

* ప్రదోషకాల పూజ

* నిశికాల పూజ

ఆలయంలో ఇతర పూజలు

* మాస శివరాత్రికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, మహాలింగార్చన

* ఆరుద్ర నక్షత్రం సందర్భంగా మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, ప్రదోశపూజ

* పునర్వసు నక్షత్రం రోజున మహాన్యాసపూర్వ ఏకాదశ రుద్రాభిషేకం, ఉప ఆలయాల్లో సదస్యం

* రేవతి నక్షత్రం సందర్భంగా మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, ఉపాలయంలో సదస్యం

ప్రత్యేక రోజులు.. విశిష్ట పూజలు

* ఉగాది సందర్భంగా నవరాత్రులు

* శ్రీరామనవమికి కల్యాణోత్సవం

* ఆషాఢమాసంలో తొలి ఏకాదశి పూజలు

* శ్రావణమాసంలో గోకులాష్టమి ఉత్సవాలు

* వినాయకచవితికి నవరాత్రి ఉత్సవాలు

* దసరాకు దేవీనవరాత్రి ఉత్సవాలు

* దీపావళికి లక్ష్మీపూజ

* కార్తీక పౌర్ణమికి ద్వాదశి తులసీ కల్యాణం

* వైకుంఠ చతుర్దశికి మహాపూజ, పొన్నసేవ

* మాఘమాసంలో మహాశివరాత్రి సందర్భంగా మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, మహాలింగార్చన

* ఫాల్గుణ మాసంలో రాజరాజేశ్వరస్వామివారికి శివకల్యాణం, ఐదురోజులపాటు ప్రత్యేక పూజలు

* ఆర్జితసేవల టికెట్లకు ఆన్‌లైన్‌ సౌకర్యం లేదు.

ఎలా వెళ్లొచ్చంటే

హైదరాబాద్‌ నుంచి సుమారు 150 కి.మీ.ల దూరంలో ఉన్న వేములవాడ వెళ్లేందుకు ఎంజీబీఎస్‌.. జేబీఎస్‌ నుంచి సిద్దిపేట.. సిరిసిల్ల మీదుగా టీఎస్‌ఆర్టీసీ బస్సు సర్వీసులున్నాయి. సుమారు ప్రతి 30 నిమిషాలకొకటి చొప్పున బస్సు సర్వీసులున్నాయి. అలాగే శంషాబాద్‌ విమానాశ్రయం ద్వారా కూడా హైదరాబాద్‌కు.. అక్కడి నుంచి వేములవాడకు చేరుకోవచ్చు. ప్రైవేటు క్యాబ్‌లు.. బస్సులు విస్తృతంగా ఉన్నాయి.

ఇదీ చూడండి:

శ్రీ‌వారి సాలకట్ల తెప్పోత్సవాల తేదీ ఖరారు..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.