ETV Bharat / city

అభివృద్ధి పేరుతో ప్రైవేటు పరం..

author img

By

Published : Oct 4, 2022, 7:23 AM IST

Updated : Oct 4, 2022, 11:46 AM IST

Tourism:రాష్ట్రంలో పర్యాటక ప్రాజెక్ట్‌లు ప్రైవేట్‌పరం కానున్నాయి. ఒకప్పుడు ఎంతో ఆదాయాన్ని ఆర్జించిన హోటళ్లు, రెస్టారెంట్‌లు, కాటేజీలను ప్రైవేట్‌ వ్యక్తులకు అప్పగించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. బ్యాంకు రుణంతో వీటిని మరింత అభివృద్ధి చేస్తామని గొప్పలు చెబుతూనే.. మరోవైపు వీటిని అప్పనంగా అప్పగించేందుకు టెండర్లు సైతం పిలిచింది.

Etv Bharat
Etv Bharat

AP Tourism: రాష్ట్రానికి ఆదాయ వనరుగా ఉన్న పలు పర్యాటక ఆస్తులు ప్రైవేట్‌పరం కానున్నాయి. పర్యాటకాభివృద్ధి సంస్థకు చెందిన కోట్లాది రూపాయల ఆస్తులను అప్పనంగా కట్టబెట్టనున్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న 22 రెస్టారెంట్లు, కాటేజీలు, ఫుడ్‌ కోర్టులను ప్రైవేట్‌ సంస్థలకు కనిష్ఠంగా 5 ఏళ్లు, గరిష్ఠంగా 20 ఏళ్లపాటు లీజుకి ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. ఇందుకోసం ఏపీటీడీసీ అధికారులు టెండర్లు ఆహ్వానించారు. ఒక జాతీయ బ్యాంకు ఆర్థిక సాయంతో హోటళ్లు, రెస్టారెంట్లు, కాటేజీలను ఆధునీకరిస్తామని గొప్పలు చెబుతున్న ప్రభుత్వం మరోవైపు వీటన్నింటినీ ప్రైవేట్‌ వ్యక్తుల చేతికి అందించేందుకు పావులు కదుపుతోంది.

అభివృద్ధి పేరుతో ప్రైవేటు పరం..

కడపలోని హరిత హోటల్‌లో వాణిజ్య అవసరాలకు ఉపయోగపడే 2,767 చదరపు అడుగుల స్థలాన్ని లీజుకు ఇవ్వనున్నారు. సిద్దవటంలో రెస్టారెంట్‌, గండికోటలో 15 టెంట్లు, కిచెన్‌, రెస్టారెంట్‌కి టెండర్‌ పిలిచారు. శ్రీసత్యసాయి జిల్లా వెంకటాపురంలోని హోటల్‌, కర్నూలులో బ్యాంకెట్‌ హాలు, తిరుపతి జిల్లా తడలోని రెస్టారెంట్, కాన్ఫరెన్స్‌ హాలు, బీవీ పాలెంలో బార్‌, 15 ఉడెన్‌ కాటేజీలు, రెస్టారెంట్‌, ఇసకపల్లిలో రెస్టారెంట్‌, బార్‌ లీజుకి ఇవ్వాలని నిర్ణయించారు. ఇదే జిల్లాలోని కొత్త కోడూరు, ఉదయగిరి, రామతీర్థంలోని రెస్టారెంట్లు కూడా లీజుకి ఇచ్చేందుకు టెండర్లు ఆహ్వానించారు.

ప్రకాశం జిల్లా గుండ్లకమ్మ దగ్గరలోని రెస్టారెంట్‌, 8 కాటేజీలు, స్విమ్మింగ్‌ పూల్‌ తిరుపతి జిల్లా పుత్తూరులోని రెస్టారెంట్‌ పల్నాడు జిల్లాలో ధ్యానబుద్ధ సమీపంలోని హోటల్‌, కోటప్పకొండలో రెస్టారెంట్‌ ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేట మండలం ముక్త్యాలలోని రెస్టారెంట్‌ లీజుకి ఇవ్వాలని నిర్ణయించారు. వీటితోపాటు శ్రీకాకుళం జిల్లా శాలిహుండంలోని ఎమినిటీ సెంటర్‌లో గదులు, రెస్టారెంట్‌ మన్యం జిల్లా అరకులోని డ్రైవ్‌-ఇన్‌ రెస్టారెంట్‌ బుద్ధిస్ట్‌ సర్క్యూట్‌లోని అమరావతి, బావికొండ, గుంటుపల్లె, భట్టిప్రోలు వసతులను లీజుకి పెట్టారు.

రాష్ట్రంలోని ఏకైక బ్లూఫ్లాగ్‌ బీచ్‌ కలిగిన రుషికొండలో ఇకపై అడుగుపెట్టాలంటే రుసుము చెల్లించాల్సిందే. ఎందుకంటే బీచ్‌ నిర్వహణను సైతం ప్రైవేట్‌ సంస్థకు అప్పగించాలని ఏపీటీడీసీ నిర్ణయించింది.

ఇవీ చదవండి:

Last Updated :Oct 4, 2022, 11:46 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.