ETV Bharat / city

Thunder effect: గతేడాదిలో ఒకే రాష్ట్రంలో 20 లక్షల పిడుగులు.. ఎక్కడో తెలుసా?

author img

By

Published : Jul 26, 2021, 7:05 AM IST

Updated : Jul 26, 2021, 11:58 AM IST

పిడుగుల వర్షం ప్రజలను భయపెట్టిస్తోంది. దేశంలో గతంలో పోలిస్తే 34 శాతం తీని తీవ్రత అధికమైంది. ఒడిశాలో ఏడాదిలో 20.43 లక్షల పిడుగులు పడ్డాయి. బిహార్​లో 401 మంది పిడుగు పడి మృతి చెందారు. పిడుగులు పడే ప్రాంతాన్ని ముందే గుర్తించి అప్రమత్తం చేసే వ్యవస్థను ఇప్పుడు వాతావరణ శాఖ అందుబాటులోకి తెచ్చింది. ఆంధ్రప్రదేశ్‌ 2017లోనే అమెరికాకు చెందిన ఎర్త్‌ నెట్‌వర్క్‌ సాయంతో.. పిడుగుపాటుపై ముందస్తు హెచ్చరికల వ్యవస్థను ఏర్పాటు చేసింది.

Thunder effect
Thunder effect

దేశంలో పిడుగుల తీవ్రత పెరుగుతోంది. వాతావరణ మార్పులతో... ఉష్ణోగ్రతలు పెరిగి వర్షంలా భూమివైపు దూసుకొస్తున్నాయి. ఏటా వందల మందిని బలిగొంటున్నాయి. గతంతో పోలిస్తే.. భారత్‌లో పిడుగుల తీవ్రత 34% పెరిగింది. ఒడిశాలో పిడుగుల వర్షమే కురుస్తోంది. బిహార్‌లో అత్యధిక మరణాలు చోటు చేసుకుంటున్నాయి. గ్రామాల్లో మరణాలు 96% ఉంటే, పట్టణాల్లో 4% ఉంటున్నాయి.

Thunder effect
పిడుగు భయం.. గతంతో పోలిస్తే 34% అధికం

దేశవ్యాప్తంగా పెరిగిన తీవ్రత

2019-20తో పోలిస్తే... ఈసారి పంజాబ్‌లో 331% అధికమయ్యాయి. బిహార్‌లో 168%, హరియాణా 164%, పుదుచ్చేరి 117%, హిమాచల్‌ప్రదేశ్‌ 105%, పశ్చిమబెంగాల్‌లో 100% పెరిగాయి. గోవా, దమన్‌ దీవ్‌, హవేలీలో 70%, త్రిపుర 70%, నాగాలాండ్‌ 60%, కర్ణాటక 34%, అస్సాం 27%, కేరళ 19%, మేఘాలయ 12%, తమిళనాడులలో 12% తగ్గాయి.

1,619 మంది మృతి

* దేశంలో 2020 ఏప్రిల్‌ 1 నుంచి 2021 మార్చి 31 మధ్య 1,619 మంది పిడుగుపాటుతో మరణించారు. పిడుగుల సంఖ్యలో తొలిస్థానంలో ఉన్న ఒడిశాలో మరణాలు 156 ఉంటే.. తొమ్మిదో స్థానంలో ఉన్న బిహార్‌లో అత్యధికంగా 401 మంది చనిపోయారు. ఆంధ్రప్రదేశ్‌ పిడుగుల తీవ్రతలో 11వ స్థానంలోనూ, మరణాల్లో 13వ స్థానంలోనూ ఉంది.

* పర్వతప్రాంతాల్లో 68% మరణాలు చోటు చేసుకోగా.. మైదాన ప్రాంతాల్లో 32% ఉన్నాయి.

కొన్ని ప్రాంతాల్లోనే ఎందుకు?

* తూర్పు, పశ్చిమగాలులు, ఉష్ణోగ్రతలు, భూమి నుంచి పైకి వెళ్లే వేడి గాలులు, మేఘాలు పిడుగులకు ప్రధాన కారణాలు. రాజస్థాన్‌, ఉత్తర్‌ప్రదేశ్‌లో ఇటీవల పిడుగుల వర్షానికి 74 మంది వరకు మృతి చెందారు. నైరుతి రుతుపవనాలు అక్కడ ప్రవేశించే సమయంలో.. అప్పటి వరకు ఉన్న వాతావరణంలో మార్పులు చోటు చేసుకోవడమే దీనికి కారణంగా నిపుణులు పేర్కొంటున్నారు.

* ఎండాకాలంలో సముద్ర తీరాన ఉండే అధిక ఉష్ణోగ్రతలు, భూగర్భ తీగల వ్యవస్థ కూడా పిడుగులను ఎక్కువగా ఆకర్షిస్తాయి.

* ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌ (విజయనగరం, శ్రీకాకుళం), తెలంగాణ అటవీ ప్రాంతంలో ఎక్కువ పిడుగులు పడతాయి.

* ఏప్రిల్‌ నుంచి అక్టోబరు వరకు ఎక్కువ ప్రభావం ఉంటోంది. కొన్ని రాష్ట్రాల్లో జనవరి నుంచే పిడుగులు పడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో మార్చి నుంచి మొదలై.. మే చివరి వారం వరకు అధికంగా ఉంటాయి.

ఏపీలోనే తొలి హెచ్చరిక వ్యవస్థ

Thunder effect
పిడుగు భయం.. గతంతో పోలిస్తే 34% అధికం

పిడుగులు పడే ప్రాంతాన్ని ముందే గుర్తించి అప్రమత్తం చేసే వ్యవస్థను ఇప్పుడు వాతావరణ శాఖ అందుబాటులోకి తెచ్చింది. ఆంధ్రప్రదేశ్‌ 2017లోనే అమెరికాకు చెందిన ఎర్త్‌ నెట్‌వర్క్‌ సాయంతో... పిడుగుపాటుపై ముందస్తు హెచ్చరికల వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఏ ప్రాంతంలో పిడుగులు పడే అవకాశముందో 40 నిమిషాల ముందే మండలాల తహసీల్దార్లు, జిల్లా అధికారులకు వాట్సప్‌ సమాచారం పంపుతుంది. పిడుగులు పడే ప్రాంతానికి చుట్టుపక్కల పది కిలోమీటర్ల పరిధిలోని.. బీఎస్‌ఎన్‌ఎల్‌ మొబైల్‌ నంబర్లకు సందేశాలు ఇస్తున్నారు. ఇలా గతేడాది 13 కోట్ల సందేశాలు ఇచ్చారు.

చెట్టు కిందనే ప్రాణాపాయం.. రైతులకు ముప్పు

మొత్తం మరణాల్లో 71% మంది వాన కురిసేటప్పుడు చెట్టు కింద నిలబడటం ద్వారా ప్రాణాలు కోల్పోయారు. 25% మందిపై నేరుగా పడగా.. 4% మంది పరోక్షంగా తీవ్రతకు గురై మరణించారు.

* మొత్తం మృతుల్లో 77% మంది రైతులే.. 23% ఇతరులు ఉన్నారు.

పసిగడితే.. అప్రమత్తం కావచ్చు

* పిడుగు పడే ముందు గాలి వేగం పెరుగుతుంది. ఇంట్లో రేడియో ఉంటే అందులో గడబిడ శబ్దాలు వస్తాయి.

* ఉరుములు, మెరుపులతో వర్షం కురిసే సమయంలో.. మెడ వెనక జుట్టు నిక్కబొడుచుకోవడం, శరీరం జలదరించడం తదితర లక్షణాలను పిడుగు పడటానికి సూచనగా చెబుతారు.

* ఉరుములు, మెరుపులతో వర్షం కురుస్తుంటే చెట్లు, టవర్లు, చెరువుల సమీపంలో ఉండొద్దు.

* ఎలక్ట్రిక్‌, ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలు, మొబైల్‌ ఫోన్లు, ఛార్జర్లు వాడొద్దు.

* రబ్బరు చెప్పులు ధరించి చెవులు మూసుకుని.. తలను నేలకు తగలకుండా మోకాలిపై వంగి కూర్చోవాలి.

* ఉరుముల శబ్దం ఆగాక.. 30 నిమిషాల వరకు ఇంట్లోనే ఉండాలి.

ఇదీ చదవండి:

ramappa temple: ప్రపంచ వారసత్వ కట్టడంగా రామప్ప ఆలయం

Last Updated : Jul 26, 2021, 11:58 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.