ETV Bharat / city

I T Concept Cities in AP: రాష్ట్రంలో మూడు ఐటీ కాన్సెప్ట్‌ నగరాలు ఇవే..!

author img

By

Published : Jul 17, 2021, 7:34 AM IST

2021-24 ఐటీ పాలసీని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. వచ్చే మూడేళ్లల్లో ప్రత్యక్షంగా 55 వేల మందికి, పరోక్షంగా 1.65 లక్షల మందికి ఉపాధి కల్పించే లక్ష్యంగా ఐటీ పాలసీ రూపకల్పన చేసినట్టు ఉత్తర్వుల్లో వెల్లడించింది. ప్రస్తుతం ఉన్న ప్రధాన ఐటీ నగరాలకు దగ్గరగా మూడు ఐటీ కాన్సెప్ట్‌ నగరాలను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది.

Three it concept cities in andhra pradesh
Three it concept cities in andhra pradesh

ప్రస్తుతం ఉన్న ప్రధాన ఐటీ నగరాలకు దగ్గరగా మూడు ఐటీ కాన్సెప్ట్‌ నగరాలను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. చైన్నైకి సమీపంలో తిరుపతి, బెంగళూరుకు సమీపంలో అనంతపురం, ఇప్పటికే పురోగతిలో ఉన్న విశాఖపట్టణం సమీపంలో మరోటి చొప్పున ఏర్పాటు చేస్తామంది. ఐటీ రంగాన్ని ఆదాయ కేంద్రంగా మార్చడం ద్వారా స్వీయ జీవనోపాధిని కల్పించేలా రాష్ట్ర ఐటీ పాలసీని రూపొందించినట్లు తెలిపింది. ఇందులో భాగంగా స్థానిక యువతకు ఉపాధి కల్పించే కంపెనీలకు భారీగా ప్రోత్సాహకాలు అందిస్తామంది.

‘‘సేవల రంగం, నూతన ఆవిష్కరణలు, అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాలపై ప్రత్యేక దృష్టితోపాటు పబ్లిక్‌ డేటాకు భద్రత కల్పించాలన్నదే లక్ష్యం. నూతన ఆవిష్కరణలు, పరిశోధనలు, నైపుణ్యమున్న మానవ వనరులను అందించేలా విశాఖపట్నంలో విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నాం. ఐటీ రంగంలో తగిన నైపుణ్య అభివృద్ధి కోర్సుల రూపకల్పన ద్వారా నైపుణ్య విశ్వవిద్యాలయాలకు ఈ వర్సిటీ సహకారం అందిస్తుంది. ప్రపంచ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా వాక్‌ టు వర్క్‌ విధానం, ప్లగ్‌ అండ్‌ ప్లే, సహ పని కేంద్రాల ఏర్పాటుకు పాలసీలో ప్రాధాన్యం కల్పిస్తున్నాం’’ అని ప్రభుత్వం వివరించింది.

ఇవీ రాష్ట్ర పాలసీ లక్ష్యాలు

  • అర్హత ఉన్న మానవశక్తిని గుర్తించి ఐటీ రంగంలో ఉపాధి కల్పించడం.
  • ఈ రంగంలోని పరిశ్రమలు, విభాగాల్లో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రోత్సహించడం.
  • అంకుర సంస్థలకు ప్రాధాన్యం ఇవ్వడం.
  • మారుతున్న పోకడలకు అనుగుణంగా ఇంటి నుంచి పని విధానాన్ని ప్రోత్సహించడం.

ఆదాయం సమకూర్చడానికి..

  • ప్రభుత్వ, ప్రైవేటు వినియోగదారులకు అందించే సేవలకు నిర్దేశిత విధానంలో ఛార్జీల వసూలు.
  • ఐటీ పార్కులు, కార్యాలయ స్థలాలు, కాన్సెప్ట్‌ సిటీలు, ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధి.
  • రాబడి ద్వారా స్వీయ సమృద్ధి విభాగంగా ఐటీ రంగాన్ని మార్చడం. వెంటనే పరిశ్రమను ఏర్పాటు చేయడానికి వీలుగా నైపుణ్యమైన మానవ వనరులను అందుబాటులోకి తేవడం.
  • ఆధునిక, అభివృద్ధి చెందుతున్న ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌, మెషిన్‌ లెర్నింగ్‌, డేటా అనలిటిక్స్‌, బ్లాక్‌ చెయిన్‌, ఆగ్మెంటెడ్‌ రియాలిటీ, వర్చువల్‌ రియాలిటీ, ఫిన్‌టెడ్‌ వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రోత్సహించడం.

విరివిగా ప్రోత్సాహకాలు..

  • ఉద్యోగుల వార్షిక జీతంలో 10 శాతానికి మించకుండా వన్‌టైమ్‌ ప్రోత్సాహకాన్ని ప్రభుత్వం అందిస్తుంది. దీని ప్రకారం స్థానిక యువతకు ఉపాధి కల్పించిన హైఎండ్‌ ఐటీ ఉద్యోగాలకు రూ.లక్ష, మధ్యస్థాయి ఉద్యోగులకు రూ.75 వేలు, ప్రవేశ స్థాయి ఉద్యోగాలకు రూ.50 వేలు ఇస్తుంది.
  • బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళా పారిశ్రామికవేత్తలకు వార్షిక జీతంలో 15 శాతానికి మించకుండా ప్రోత్సాహకాలను ప్రభుత్వం అందిస్తుంది. దీని ప్రకారం హైఎండ్‌ ఐటీ ఉద్యోగాలకు రూ.1.50 లక్షలు, మధ్యస్థాయి ఉద్యోగాలకు రూ.1.12,500, ప్రవేశ స్థాయి ఉద్యోగాలకు రూ.75 వేలు అందుతాయి.
  • వర్క్‌ఫ్రమ్‌ హోం విధానంలో రాష్ట్రం నుంచి పనిచేసేలా అనుమతించిన కంపెనీలకు సాఫ్ట్‌వేర్‌, హార్డ్‌వేర్‌ కోసం ఒక్కొక్కరికి రూ.20 వేల వంతున వన్‌టైం ప్రోత్సాహకం.
  • గిగ్‌వర్క్‌ సంస్కృతిని ప్రోత్సహించటంలో భాగంగా ల్యాప్‌టాప్‌, ఇంటర్నెట్‌ కోసం వెచ్చించే మొత్తంలో ఒక్కొక్కరికి గరిష్ఠంగా రూ.20 వేల వంతున 50% రాయితీ. దీనికోసం ఏడాదిలో కనీసం రూ.3 లక్షల విలువైన ప్రాజెక్టును పూర్తి చేయాలి.
  • రాష్ట్రంలో నమోదైన, ఇక్కడే ప్రాంగణాన్ని ఏర్పాటు చేసి యువతకు శిక్షణ ఇవ్వడం ద్వారా స్థానికంగా ఉపాధి కల్పించినందుకు ఒక్కొక్కరికి రూ.10 వేల వంతున వన్‌టైమ్‌ ప్రోత్సాహకం.
  • ఐటీ సంస్థకు భూముల కేటాయింపు కోసం గత మూడేళ్లలో వార్షిక టర్నోవర్‌ రూ.15 కోట్లు, 250 మంది ఉద్యోగులు ఉండాలి. భూములు కేటాయించినప్పటి నుంచి మూడేళ్ల లోపు ఎకరాకు కనీసం 500 మంది ప్రారంభ స్థాయి ఐటీ నిపుణులకు ఉపాధి కల్పించాలి.
  • భారత ఐటీ కంపెనీలు సొంత క్యాంపస్‌ను అభివృద్ధి చేయడానికి భూమిని కేటాయిస్తుంది. దీనికోసం గత మూడేళ్లలో రూ.500 కోట్ల టర్నోవర్‌/ప్రపంచ వ్యాప్తంగా కనీసం 10 వేల మందికి ఉపాధి కల్పించాలి.
  • విదేశీ ఐటీ కంపెనీలు సొంత ఐటీ క్యాంపస్‌ అభివృద్ధికి రూ.350 కోట్ల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ కలిగి ఉండాలి. మూడేళ్లలో ఎకరాకు కనీసం 500 మంది ప్రారంభస్థాయి ఐటీ నిపుణులకు ఉపాధి ఇవ్వాలి.

ఇదీ చదవండి:

Ministry of Jal Shakti: పార్లమెంటులో పెట్టే బిల్లులకంటే జాగ్రత్తగా గెజిట్‌ రూపొందించాం: జల్‌శక్తి శాఖ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.