ETV Bharat / city

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధం

author img

By

Published : Mar 13, 2021, 7:28 PM IST

mlc
మండలి పట్టభద్రుల పోలింగ్‌కు సర్వం సిద్ధం

హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం సర్వం సిద్ధమైంది. 93 మంది అభ్యర్ధులు బరిలో ఉండటంతో... దినపత్రిక పరిమాణంలో బ్యాలెట్ పత్రం, జంబో బ్యాలెట్ పెట్టెలను సిద్ధం చేశారు. కొవిడ్‌ నిబంధనల దృష్ట్యా మాస్కులు, శానిటైజర్లు, గ్లౌజులు సిబ్బందికి అందించారు. ప్రతి పోలింగ్ స్టేషన్‌లో ఓటింగ్ సరళిని వెబ్ కాస్టింగ్ ద్వారా పరిశీలించనున్నారు.

హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ పోరుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరగనున్న ఓటింగ్‌ కోసం... 799 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలో 5 లక్షల 31 వేల 268 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో సిబ్బందికి ఎన్నికల సామగ్రి పంపిణీ చేశారు.

పోస్టల్ బ్యాలెట్

పోలింగ్ కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు రిటర్నింగ్ అధికారి ప్రియాంక అల తెలిపారు. ఒక్కో పోలింగ్ కేంద్రంలో వెయ్యిమంది ఓటు వేసే అవకాశం ఉందని వెల్లడించారు. ఈ ఎన్నికలకు మెుత్తం 3, 835 మంది సిబ్బంది విధుల్లో పాల్గొననున్నారు. 459 మంది వృద్ధులు, కరోనా బాధితులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్నారు.

జంబో బ్యాలెట్

ఉమ్మడి మహబూబ్​నగర్ జిల్లాలోనూ పోరు కోసం పటిష్ఠ ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి పాలమూరు జిల్లావ్యాప్తంగా 173 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. జంబో బ్యాలెట్ బాక్సుల్లో ఓటువేయడానికి తగిన ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు. లక్షా 19,367 మంది పట్టభద్రులు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

బందోబస్తు పెంపు

పోలింగ్ సామగ్రిని మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, గద్వాల, నారాయణపేట జిల్లా కేంద్రాల నుంచి పంపిణీ చేశారు. దినపత్రిక పరిమాణంలో ఉన్న బ్యాలెట్ పత్రం, ఓటు వేసేందుకు వినియోగించే ఊదారంగు స్కెచ్ పెన్, ఓటర్ల జాబితా సహా ఇతర ఎన్నికల సామగ్రిని సిబ్బందికి అందించారు. పోలింగ్ కేంద్రాల్లో కనీస వసతులు సహా ర్యాంపులు, వీల్ చైర్లు అందుబాటులో ఉంచనున్నారు. రూట్​ ఆఫీసర్లు, జోనల్, సెక్టోరల్, నోడల్ అధికారులు సహా సూక్ష్మ పరిశీలకులు ఇప్పటికే విధుల్లో ఉన్నారు. ఇప్పటికే ఓటరు స్లిప్పులను ఇంటింటికీ వెళ్లి సిబ్బంది అందించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసు బందోబస్తును పెంచారు.

ఈనెల 17న సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో ఓట్లు లెక్కించనున్నారు. ప్రాధాన్యతాక్రమాలను అనుసరించి ఓట్లను లెక్కించాల్సి ఉన్నందున ఫలితం వెల్లడికి 48 గంటలు పట్టే అవకాశం ఉందని అధికారులు అంచనావేస్తున్నారు.

ఇదీ చూడండి : ఎన్నికల్లో వైకాపా అక్రమాలపై పోరాడతాం: భాజపా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.