ETV Bharat / city

రాజధాని భూ కొనుగోలు దర్యాప్తుపై హైకోర్టు స్టే యథాతథం: సుప్రీం

author img

By

Published : Nov 26, 2020, 6:41 AM IST

రాజధాని భూ కొనుగోలు దర్యాప్తుపైన హైకోర్టు విధించిన స్టేపై సుప్రీంకోర్టు జ్యోక్యం చేసుకోలేదు. అయితే రాజధాని భూములకు సంబంధించిన కేసులో మాజీ అడ్వొకేట్‌ జనరల్‌ దమ్మాలపాటి శ్రీనివాస్‌, మరికొందరిపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను, అందులోని వివరాలను మీడియాకు బహిర్గతం చేయకూడదనే హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులపై సుప్రీం కోర్టు స్టే విధించింది. తదుపరి విచారణ జనవరి చివరికి వాయిదా వేసింది. అప్పటివరకు తుది నిర్ణయం తీసుకోవద్దని హైకోర్టుకు సూచనలు ఇచ్చింది.

Supreme Court
Supreme Court

రాజధాని భూములకు సంబంధించిన కేసులో మాజీ అడ్వొకేట్‌ జనరల్‌ దమ్మాలపాటి శ్రీనివాస్‌, మరికొందరిపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను, అందులోని వివరాలను ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌, సామాజిక మాధ్యమాల ద్వారా బహిర్గతం చేయకూడదనే హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల(గ్యాగ్‌ ఆర్డర్‌)పై సుప్రీంకోర్టు స్టే విధించింది. అదే సమయంలో భూకొనుగోలుకు సంబంధించి దర్యాప్తును నిలిపివేస్తూ హైకోర్టు విధించిన స్టేపై సర్వోన్నత న్యాయస్థానం జోక్యం చేసుకోలేదు. భూముల కొనుగోళ్లకు సంబంధించి తనపై అవినీతి నిరోధక శాఖ కేసులు నమోదు చేయడాన్ని సవాలు చేస్తూ దమ్మాలపాటి శ్రీనివాస్‌ హైకోర్టును ఆశ్రయించారు.

కేసును విచారించిన హైకోర్టు అనిశా విచారణ, దర్యాప్తు నిలిపివేతతో పాటు ఎఫ్‌ఐఆర్‌లో వివరాల ప్రచురణ, ప్రసారం చేయకూడదంటూ సెప్టెంబరు 15న మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. ఈ నేపథ్యంలో హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేసింది. జస్టిస్‌ అశోక్‌భూషణ్‌, జస్టిస్‌ ఆర్‌.సుభాష్‌రెడ్డి, జస్టిస్‌ ఎం.ఆర్‌.షాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం బుధవారం ఈ పిటిషన్‌ను విచారించింది. వాదప్రతివాదరలు విన్న అనంతరం సెప్టెంబరు 15న ఏపీ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వుల్లోని మీడియా వార్తల ప్రచురణకు సంబంధించి జారీ చేసిన ఉత్తర్వులపై స్టే విధిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. కేసులోని ప్రతివాదులకు నోటీసులిచ్చింది. కేసును 2021 జనవరి చివరి వారానికి వాయిదా వేసిన ధర్మాసనం.. ఈ మధ్యలో ఏపీ హైకోర్టు ఈ పిటిషన్‌పై ఎలాంటి తుది నిర్ణయం తీసుకోవద్దని సూచించింది.

ఇదీ చదవండి: 'భూములను విక్రయిస్తే అధికారులపై కోర్టు ధిక్కరణ చర్యలు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.