ETV Bharat / city

YouWeCan: యూవీ ఉదారత.. తెలంగాణలోని ఓ ఆసుపత్రికి విలువైన సాయం!

author img

By

Published : Jul 31, 2021, 7:15 AM IST

Cricketer yvraj singh
యూవీ ఉదారత.

టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ఉదారతను చాటారు. మిషన్ 1,000 పడకల నినాదంతో ప్రభుత్వ ఆస్పత్రులకు పడకలు సమకూర్చుతున్నారు. తెలంగాణలోని నిజామాబాద్ పేదల ఆసుపత్రికి అండగా నిలిచారు. రూ. 2.5 కోట్ల విలువైన 120 ఐసీయూ బెడ్లు, ఇతర పరికరాలు అందించి పెద్ద మనసు చాటుకున్నారు. కొవిడ్ కాలంలో పేదలకు బాసటగా నిలిచిన నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి కి.. యువరాజ్ ఆధ్వర్యంలోని యూవీకెన్ ఫౌండేషన్ ఇచ్చిన పడకలతో సౌకర్యాలు మెరుగుపడ్డాయి. తెలంగాణలో తొలిగా ఇందూరు ఆసుపత్రి కి ఐసీయూ పడకలు, ఇతర పరికరాలు అందించింది యూవీకెన్ ఫౌండేషన్.

కొవిడ్ మొదటి.. రెండో దశలో తెలంగాణలో నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (Nizamabad General Hospital) పేదలకు అండగా నిలిచింది. రెండో దశలో వందల మంది కొవిడ్ బారిన పడి ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చారు. అధిక శాతం మంది కోలుకుని ఇళ్లకు వెళ్లారు. ఉత్తర తెలంగాణలో ప్రాంతానికి వైద్యంలో ఇందూరు ఆసుపత్రి పెద్ద దిక్కుగా నిలిచింది. ఉమ్మడి నిజామాబాద్ మాత్రమే కాకుండా ఆదిలాబాద్, మహారాష్ట్ర నుంచి సైతం రోగులు నిజామాబాద్ వచ్చారు. అయినప్పటికీ తాహతుకు మించి ఆసుపత్రిలో రోగులకు సేవలు అందించారు. ఆక్సిజన్, మందులు, సౌకర్యాలు.. అన్నింట్లోనూ కొరత లేకుండా అందించారు. ఖరీదైన ఇంజెక్షన్లు రోగులకు ఇచ్చి బతికించారు. కరోనా మూడో దశ ముప్పు నేపథ్యంలో యువరాజ్ సింగ్ ఫౌండేషన్ యూవీకెన్ (YouWeCan) దాతృత్వంతో ఆస్పత్రిలో సౌకర్యాలు మరింత మెరుగు పడ్డాయి.

యూవీ ఉదారత

120 ఐసీయూ బెడ్లు...

నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి యువరాజ్ సింగ్ ఫౌండేషన్ (Yuvraj Singh Foundation)యూవీకెన్ 120 ఐసీయూ బెడ్లను విరాళంగా అందించారు. అధునాతన సౌకర్యాలతో కూడిన పడకలు, అవసరమైన 20 రకాల పరికరాలు, ఆక్సిజన్ సిలిండర్లు అందించారు. మొత్తం రూ.2.5 కోట్లకు విలువైన సౌకర్యాలను ఆస్పత్రికి సమకూర్చారు. ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో 74 ఐసీయూ పడకలు, 75 వెంటిలేటర్లు ఉన్నాయి. యువీకెన్‌ ఫౌండేషన్‌ 120 ఐసీయూ పడకలు ఇవ్వడంతో వీటి సంఖ్య 194కు చేరింది. ఇందులో 18 వెంటిలేటర్ సౌకర్యం ఉన్న బెడ్లు ఉన్నాయి. 120 క్రిటికల్ కేర్ బెడ్లలో 40 బెడ్లను ప్రత్యేకంగా పిల్లల కోసం అందించారు. మూడో వేవ్ పిల్లలకే ముప్పు అంటున్న నేపథ్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో ఐసీయూ బెడ్లు లేకపోవడం వల్ల యూవీకెన్ ఆదుకున్నట్లయింది. అత్యాధునిక మానిటర్లు ఉన్నాయి. వీటితో రోగి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు స్పష్టంగా తెలుసుకొనే వీలుంటుంది.

పిల్లల కోసం ప్రత్యేకంగా...

దాదాపు నెల రోజుల పాటు యూవీకెన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇక్కడి వాలంటీర్లు ప్రభుత్వ ఆసుపత్రిలో క్రిటికల్ కేర్ బెడ్లు ఏర్పాటు చేసేందుకు కృషి చేశారు. ఆసుపత్రిలో రెండు వార్డులు యూవీకెన్ ఆధ్వర్యంలో ఏర్పాటయ్యాయి. 80 ఐసీయూ పడకలతో పెద్దలు కొవిడ్ బారిన పడేందుకు చికిత్స అందించేందుకు ఒక వార్డు సిద్ధం చేయగా.. మరో 40 ఐసీయూ పడకలతో పిల్లల కోసం పిడియాట్రిక్ వార్డును సైతం ఏర్పాటు చేశారు. మూడో దశ పిల్లలపై ప్రభావం ఉంటుందన్న వార్తల నేపథ్యంలో ఆ అవసరాన్ని గుర్తించి యూవీకెన్ ఫౌండేషన్ ప్రత్యేకంగా పిల్లల కోసం పడకలు సిద్ధం చేసింది. ఇప్పటి వరకు ప్రభుత్వ ఆస్పత్రిలో పిల్లల కోసం ఐసీయూ బెడ్ల సౌకర్యం లేదు. యూవీకెన్ వల్ల ఆ కొరత తీరిపోయింది.

ఇన్‌ఫెక్షన్‌ పెరగకుండా...

పడకలతో పాటు దవాఖానాకు 16 సీపాప్‌, బైపాప్‌ పరికరాలు అందజేశారు. కొవిడ్‌ బాధితులకు సీపాప్‌, బైపాప్‌ ఉపయోగిస్తే గొంతులో నుంచి ఊపిరితిత్తులకు పైపు వేసే అవసరం ఉండదు. మెడ భాగంలో రంధ్రం చేసి ఊపిరితిత్తుల్లోకి వెంటిలేటర్‌ ఏర్పాటు చేయాల్సిన పని ఉండదు. వీటితో నేరుగా ఊపిరితిత్తులకు ఆక్సిజన్‌ పంపవచ్చు. ఆస్పత్రిలో 110 బల్క్ ఆక్సిజన్ సిలిండర్లు ఉండగా యూవీకెన్ మరో 100 అందించారు. దీంతో ఆక్సిజన్ అవసరమున్న రోగుల సంఖ్య పెరిగితే.. ఆ సౌకర్యం లేని పడకల వద్ద ఈ బల్క్ సిలిండర్ల ద్వారా ఆక్సిజన్ అందించవచ్చు. కొవిడ్‌ బారినపడి పరిస్థితి తీవ్రంగా ఉన్న వ్యక్తికి సక్షన్‌ ఆపరేటర్లు ఉపయోగిస్తారు. వీటితో లాలాజలం, వ్యర్థాలు ఎప్పటికప్పుడు తొలగించి ఇన్‌ఫెక్షన్‌ పెరగకుండా పనిచేస్తాయి.

మొత్తం 22...

22 సక్షన్‌ ఆపరేటర్లను ఆసుపత్రికి యూవీకెన్ అందించింది. గతంలో ఐసీయూలో బ్యాక్టీరియా, ఫంగస్‌, వైరస్‌లను రసాయనాలు ఉపయోగించి శుభ్రం చేసేవారు. కొత్తగా ఇచ్చిన ఫిమిగేషన్‌ యంత్రంతో ఎప్పటికప్పుడు గదిలో ఉన్న బ్యాక్టీరియా, ఫంగస్‌, వైరస్‌లు తొలగించవచ్చు. వీటితోపాటు ఇన్ఫ్యూషియన్ సిరంజీ పంపులు 25, క్రాష్ కార్ట్​లు 25, ఈసీజీ మిషన్లు 8, ఎల్ఈడీ ఎక్స్ రే వ్యూయింగ్ బాక్సు 4, మయో ట్రాలీస్ 5, డ్రగ్ రిఫ్రిజిరేటర్లు 2, ఇన్ ఫ్రారెడ్ థర్మోమీటర్​లు 10, పల్స్ ఆక్సీమీటర్లు 10, డిజిటల్ థర్మామీటర్లు 120, స్టెతస్కోప్​లు 10, స్ట్రెచర్​లు 5తోపాటు బెడ్లు కాకుండా మొత్తం 22 పరికరాలు అందించారు.

యూవీకి థ్యాంక్స్...

ఐసీయూ బెడ్లు, వెంటిలేటర్ల సంఖ్య పెరగడంతో నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో మరింత నాణ్యమైన వైద్య సేవలు ఇంకా ఎక్కువ మంది అందించే వీలు కలిగింది. తెలంగాణలో తొలిసారిగా నిజామాబాద్ ఆసుపత్రి పట్ల ఔదార్యం చూపించిన యువరాజ్ సింగ్​కు ఆసుపత్రి యాజమాన్యం, స్థానిక ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

ఇదీ చూడండి:

CM KCR Speech: 'కేసీఆర్ ఏదనుకుంటే అది కావాల్సిందే.. ఎలా ఆపుతారో నేనూ చూస్తా..'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.