ETV Bharat / city

వారానికి 15 లక్షల డోసులు.. ఇలాగైతేనే నిరంతర టీకా పంపిణీ

author img

By

Published : Apr 19, 2021, 2:18 PM IST

కొవిడ్‌ టీకాల పంపిణీ ప్రక్రియ నిరాటంకంగా సాగాలంటే.. వారానికి కనీసం 15 లక్షల డోసులను కచ్చితంగా అందుబాటులో ఉండాలని వైద్యఆరోగ్యశాఖ భావిస్తోంది. ఇలాగైతేనే మొదటిడోసు వారికి, రెండోడోసు వారికి నిరంతరాయంగా టీకాలను అందించడానికి వీలుంటుంది.

corona vaccine
తెలంగాణలో వ్యాక్సిన్ల కొరత

తెలంగాణకు మూణ్నాలుగు రోజులకొకసారి 2-3 లక్షల టీకాలను పంపిస్తే.. పంపిణీలో ఆందోళన నెలకొంటుందని పేర్కొంటూ కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖకు టీకాల సరఫరాపై తెలంగాణ వైద్యశాఖ తాజాగా ప్రతిపాదనలను పంపించింది. దీనిపై ఆదివారం వైద్యఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు ప్రత్యేకంగా భేటీ అయ్యారు.

ఎందుకింత అవసరం?

కేంద్ర ప్రభుత్వం టీకాల కొరత లేదని పదేపదే చెబుతోంది. ఇటీవల 4 రోజుల పాటు టీకాల ఉత్సవం చేపట్టాలని ఆదేశించింది. వాస్తవ పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. రాష్ట్రంలో జనవరి 16న తొలిడోసు ప్రారంభానికి ముందు ఒకేసారి 10 లక్షల డోసులు పంపిన కేంద్రం.. తర్వాత కూడా 4-5 లక్షల చొప్పున ఇప్పటివరకూ సుమారు 30 లక్షల డోసులను సరఫరా చేసింది. మొదట్లో వైద్యసిబ్బందికి, తర్వాత పోలీసులు, రెవెన్యూ, పురపాలక, పంచాయతీరాజ్‌ సిబ్బందికి ఇచ్చారు. ఆయా శాఖల సిబ్బంది ఆశించిన రీతిలో టీకాలను పొందడానికి ముందుకు రాలేదు. మార్చి 1 నుంచి 60 ఏళ్లు దాటిన వారికి, 45-59 ఏళ్ల మధ్య వయస్కులకు టీకాల పంపిణీని ప్రారంభించాక.. కార్యక్రమం ఊపందుకుంది. రోజుకు సగటున 30-40 వేల వరకూ టీకాలను స్వీకరించారు. గత 3 వారాలుగా 45 ఏళ్లు పైబడిన వారందరికీ టీకాలను ఇస్తుండడంతో.. పంపిణీ జోరందుకుంది. ప్రస్తుతం రోజుకు సగటున 1.30 లక్షల తొలి డోసు, 20 వేల వరకూ రెండో డోసును స్వీకరిస్తున్నారు. మొత్తంగా రోజుకు 1.50 లక్షల డోసుల పంపిణీ రాష్ట్రంలో జరుగుతోంది. ఇకనుంచి రెండో డోసు కోసం వచ్చేవారి సంఖ్య 50-70 వేలకు చేరుకుంటుంది. ఈ పరిస్థితుల్లో రోజూ సగటున 1.30 లక్షల మందికి తొలి డోసును, సుమారు 70 వేల మందికి రెండో డోసును ఇవ్వాలంటే.. రోజుకు సుమారు 2 లక్షల డోసులు అందుబాటులో ఉండాలి. వారానికి కనీసం 14 లక్షలు అవసరం. ఒకవేళ సంఖ్య పెరిగినా.. వృథాను కలిపితే కచ్చితంగా వారంలో 15 లక్షల డోసులు అవసరమని వైద్యశాఖ ప్రతిపాదించింది. ఇప్పటికే రాష్ట్రంలో 26 లక్షల మందికి తొలి డోసును, 3.6 లక్షల మందికి రెండో డోసును అందజేయడంతో రాష్ట్రంలో 45 ఏళ్లు పైబడిన అర్హులందరికీ టీకాలను మే నెలాఖరులోగానే పూర్తి చేయవచ్చంది.

రాష్ట్రానికి చేరిన 2.7 లక్షల డోసులు

రాష్ట్రానికి మరో 2.7 లక్షల కొవిషీల్డ్‌ కొవిడ్‌ టీకా డోసులను కేంద్ర ప్రభుత్వం ఆదివారం పంపింది. ప్రత్యేక విమానంలో శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకోగా.. వైద్యశాఖ ఉన్నతాధికారులు వాటిని కోఠి ఆరోగ్య కార్యాలయంలోని అతిశీతల గోదాములోకి చేర్చారు. అప్పటికే జిల్లాల నుంచి ప్రత్యేక శీతల వాహనాలు కోఠి చేరుకున్నాయి. అందుబాటులో ఉన్న టీకాలను వెంటనే వాహనాల్లోకి చేర్చారు. రాత్రికిరాత్రే జిల్లాలకు, అక్కడి నుంచి సోమవారం ఉదయానికల్లా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఇతర ఆసుపత్రులకు సరఫరా చేయనున్నట్లు వైద్యవర్గాలు తెలిపాయి. సోమవారం నుంచి అన్ని కేంద్రాల్లోనూ టీకాల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నాయి.

నెక్లెస్‌ రోడ్‌లో సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణం పిచికారీ

కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో వైరస్‌ నియంత్రణ చర్యలు తీసుకోవడంతో పాటు నాలుగు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా, ముఖ్యంగా పట్టణాల్లో ఎక్కడా పారిశుద్ధ్య సమస్య కనిపించవద్దని రాష్ట్ర పురపాలక మంత్రి కేటీఆర్‌ ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్‌లోని నెక్లెస్‌ రోడ్‌లో సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణాన్ని సిబ్బంది పిచికారీ చేశారు.

ఇదీ చూడండి:

కరోనాతో మరో ఇద్దరు సచివాలయ ఉద్యోగులు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.