ETV Bharat / city

'ఆర్​ఎంసీ నిర్ణయాలు ఆమోదయోగ్యం కాదు'.. కేఆర్​ఎంబీకి తెలంగాణ లేఖ

author img

By

Published : Jun 12, 2022, 4:28 AM IST

telangana letter to krmb
telangana letter to krmb

Telangana govt letter to KRMB: కృష్ణా నదీ యాజమాన్యబోర్డు ఏర్పాటు చేసిన రిజర్వాయర్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ (ఆర్‌ఎంసీ) చేసిన ప్రతిపాదనలేవీ తమకు ఆమోదయోగ్యం కాదని తెలంగాణ స్పష్టం చేసింది. ఆ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు తమ అభిప్రాయాలకు భిన్నంగా ఉన్నాయని.. వీటికి తాము కట్టుబడబోమని పేర్కొంటూ.. కృష్ణా బోర్డుకు తెలంగాణ లేఖ రాసింది.

శ్రీశైలం, నాగార్జునసాగర్‌ల నిర్వహణకు సంబంధించి కృష్ణా నదీ యాజమాన్యబోర్డు ఏర్పాటు చేసిన రిజర్వాయర్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ (ఆర్‌ఎంసీ) చేసిన ప్రతిపాదనలేవీ తమకు ఆమోదయోగ్యం కాదని తెలంగాణ స్పష్టం చేసింది. జూన్‌ 15వ తేదీ తర్వాత సమావేశం జరపాలని తాము కోరినా ఇందుకు భిన్నంగా తమ గైర్హాజరీలో రెండు సమావేశాలు నిర్వహించి తీసుకొన్న నిర్ణయాలు తమ అభిప్రాయాలకు భిన్నంగా ఉన్నాయని, వీటికి తాము కట్టుబడబోమని తేల్చి చెప్పింది. నాగార్జునసాగర్‌ పరిధిలో బేసిన్‌ సాగు, తాగు అవసరాలకు తగ్గట్టుగా శ్రీశైలంలో విద్యుదుత్పత్తి చేయాల్సిందేనని, దీని ప్రకారం తెలంగాణ అవసరం 168.5 టీఎంసీలైతే, ఆంధ్రప్రదేశ్‌ అవసరం 54 టీఎంసీలు మాత్రమేనని, దీని ప్రకారం రెండు విద్యుత్తు బ్లాక్‌ల నుంచి ఉత్పత్తి చేయాలని తెలిపింది. రిజర్వాయర్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ పేర్కొన్నట్లు శ్రీశైలం కనీస నీటిమట్టం 854 అడుగులు కాదని... సాగు, విద్యుదుత్పత్తి అవసరాలకు కనీస నీటిమట్టం 830 అడుగులని పేర్కొంది. ఈ మేరకు తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ మురళీధర్‌ కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఛైర్మన్‌కు తాజాగా రెండు వేర్వేరు లేఖలు రాశారు. ఈ నెల 16న రిజర్వాయర్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ సమావేశం జరగనున్న నేపథ్యంలో ఈ లేఖలకు ప్రాధాన్యం ఏర్పడింది. రెండు లేఖల్లోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.

  • శ్రీశైలం నుంచి బేసిన్‌లోని సాగునీటి అవసరాలకు తగ్గట్లుగా విద్యుదుత్పత్తి జరగాలన్నది తెలంగాణ అభిప్రాయం. దీని ప్రకారం బేసిన్‌లోని అవసరాలను తీసుకొంటే నాగార్జునసాగర్‌ ఎడమకాలువ కింద 100 టీఎంసీలు, ఎస్‌.ఎల్‌.బి.సి.కి 40 టీఎంసీలు, హైదరాబాద్‌ తాగునీటికి 28.5 టీఎంసీలు కలిపి తెలంగాణ మొత్తం నీటి అవసరం 168.5 టీఎంసీలు. ఆంధ్రప్రదేశ్‌కు నాగార్జునసాగర్‌ ఎడమకాలువ కింద 22 కుడికాలువ కింద 32 టీఎంసీలు కలిపి 54 టీఎంసీలు కావాలి. నాగార్జునసాగర్‌లో ప్రధాన విద్యుత్తుహౌస్‌ ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణకు సంబంధించింది. కేంద్ర జలసంఘం పోలవరం ప్రాజెక్టును అనుమతించిన తర్వాత సాగర్‌ విద్యుదుత్పత్తి కేంద్రం నుంచి కృష్ణాడెల్టా, పులిచింతలకు నీటిని విడుదల చేయాల్సిన అవసరం లేదు. ఇదే సమయంలో కుడి,ఎడమకాలువలపై ఉన్న విద్యుదుత్పత్తి కేంద్రాలను ఆయా రాష్ట్రాలు నిర్వహించుకోవచ్చు.
  • రూల్‌కర్వ్‌కు సంబంధించి శ్రీశైలం నుంచి ఆంధ్రప్రదేశ్‌ 34 టీఎంసీలకు మించి మళ్లించడానికి వీలులేదు.
  • గోదావరి నుంచి మళ్లించే నీటి ద్వారా లభ్యమయ్యే 45 టీఎంసీలను 1980లలో చేపట్టిన ఎస్‌.ఎల్‌.బి.సి.కి అందుబాటులో ఉంచాలి.
  • శ్రీశైలం, నాగార్జునసాగర్‌ నుంచి తీసుకొనే నీటిని 50 శాతం చొప్పున తాత్కాలిక వినియోగించాలి. ఈ అంశాన్ని పరిష్కరించేందుకు బోర్డు అపెక్స్‌కౌన్సిల్‌ను కానీ, మరో వేదికను కానీ సంప్రదించాలి. 75 శాతం నీటి లభ్యత కింద శ్రీశైలం వద్ద 582.5 టీఎంసీలు అందుబాటులో ఉంటాయి. ఈ నీటి నుంచి బేసిన్‌లోని ఎస్‌.ఎల్‌.బి.సి.(40టీఎంసీలు), కల్వకుర్తి(40టీఎంసీలు), నెట్టెంపాడు(25.4 టీఎంసీలు), పాలమూరు-రంగారెడ్డి(90 టీఎంసీలు), డిండి(30 టీఎంసీలు)కి ఇవ్వాలి. గెజిట్‌ నోటిఫికేషన్‌లో ఆమోదం లేని ప్రాజెక్టుల జాబితా నుంచి వీటిని తొలగించాలి. రిజర్వాయర్లు నిండి పొంగి ప్రవహించినపుడు మళ్లించే నీటిని లెక్కలోకి తీసుకోకపోవడం తెలంగాణకు ఆమోదయోగ్యం కాదు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.