ETV Bharat / city

Telangana Budget 2022: రూ.2,56,958 కోట్ల బడ్జెట్‌.. సంక్షేమానికి పెద్దపీట

author img

By

Published : Mar 7, 2022, 10:47 PM IST

Telangana Budget 2022: సంక్షేమం, సాగు, విద్యా, వైద్య రంగాల అభివృద్ధే ప్రధాన అజెండాగా భారీ పద్దులో రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. తన ప్రాధాన్యతలకు అనుగుణంగా కేటాయింపులు చేసింది. 2022-23 నాటికి రాష్ట్రం మొత్తం అప్పులు 3,29,998 కోట్లకు చేరుతాయని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన బడ్జెట్​లో పేర్కొన్నారు.

Telangana Budget 2022
Telangana Budget 2022

Telangana Budget 2022: రాష్ట్ర ప్రభుత్వం భారీ బడ్జెట్​ను ప్రవేశపెట్టింది. బడుగు, బలహీనవర్గాల జీవితాల్లో మార్పులు తీసుకురావడమే లక్ష్యంగా.. రూ.2,56,958 కోట్ల బడ్జెట్‌ను రాష్ట్ర ఆర్థిశాఖ మంత్రి హరీశ్​రావు శాసనసభలో ప్రవేశపెట్టారు. సంక్షేమం, సాగు, విద్యా, వైద్య రంగాలకు పెద్దపీట వేస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర ఆవిర్భావం నుంచి ఎన్నో సవాళ్లను అధిగమించి.. ప్రగతిశీల రాష్ట్రంగా ఎదిగినట్లు ప్రకటించారు. గవర్నర్​ ప్రసంగం లేకుండానే రాష్ట్ర బడ్జెట్​ను ప్రవేశపెట్టారు.

అప్పులు 3,29, 998..!

ఈ ఏడాది రెవెన్యూ రాబడి రూ.1,93,029 ఉంటుందన్న ప్రభుత్వం.. మూలధన రాబడి రూ.63,832 కోట్లుగా ప్రతిపాదించింది. రెవెన్యూ రాబడిలో పన్నుల ద్వారా రూ.1,08,211 కోట్లు, పన్నేతర ఆదాయం 25,421 కోట్లు వస్తుందని అంచనా వేసింది. కేంద్ర పన్నుల్లో వాటా 18,394 కోట్లు, గ్రాంట్ల ద్వారా రూ.41,001 కోట్లు వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్​లో ప్రతిపాదించింది. రుణాల ద్వారా రూ. 63,832 కోట్లు సమకూర్చుకుంటామని స్పష్టం చేసింది. మొత్తం ఆదాయంలో రెవెన్యూ వ్యయం రూ.1,89,274 కోట్లుగా ఉంటుందన్న రాష్ట్ర ప్రభుత్వం.. మూలధన వ్యయం రూ.29,728 కోట్లని తెలిపింది. రుణాలు, అడ్వాన్సుల చెల్లింపులకు రూ.26,253 కోట్లు, మూలధన పంపిణీ రూ.11,601 కోట్లని ప్రతిపాదనలు చేసింది. ఖర్చులు పోనూ రెవెన్యూ మిగులు రూ.3,754 కోట్లుగా ఉంటుందని ప్రతిపాదించారు. ద్రవ్య లోటు 52,167 కోట్లుగా ప్రతిపాదనలు చేసింది. 2022-23 నాటికి రాష్ట్రం మొత్తం అప్పులు రూ.3,29,998 కోట్లకు చేరుతాయని ఆర్థిక శాఖ మంత్రి తన బడ్జెట్​లో పేర్కొన్నారు.

వారికి మార్చిలోపు రుణ మాఫీ..

రైతు మెడకు చుట్టుకున్న అప్పుల ఉరిని తొలగించడానికి రూ.లక్ష వరకు రుణాన్ని మాఫీ చేయనున్నట్లు ప్రకటించింది. ఇప్పటి వరకు రూ.25 వేలు, రూ.50 వేలు ఉన్నవారిలో కొందరికే మాఫీ జరిగింది. రూ.50వేల లోపు రైతు రుణాలు మార్చిలోపు మాఫీ చేస్తామని మంత్రి హరీశ్​రావు ప్రకటించారు. వచ్చే ఆర్థిక ఏడాది రూ.75 వేల లోపు సాగు రుణాలు మాఫీ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ ఏడాది రూ.16,144 కోట్లను పంట రుణాల కోసం కేటాయించారు. రాష్ట్రంలో ఈ దఫాలో 5.12 లక్షల మంది రైతుల రుణాలు మాఫీ చేయనున్నట్లు హరీశ్ రావు తెలిపారు.

వ్యవసాయానికి తగ్గిన కేటాయింపులు..

రైతుల అభివృద్ధికి, సంక్షేమానికి పెద్దపీట వేసే తెలంగాణ సర్కార్ గతేడాది కంటే ఈ ఏడాది వ్యవసాయ రంగ బడ్జెట్‌ను తగ్గించింది. గతేడాది రూ.25వేల కోట్లు కేటాయించిన ప్రభుత్వం ఈ ఏడాది(2022-23)కి రూ.24,254 కోట్లు ప్రతిపాదించింది. రాష్ట్రంలో పామాయిల్‌ సాగుకు ప్రోత్సాహం అందిస్తున్నట్లు హరీశ్ రావు తెలిపారు. పామాయిల్‌ సాగుకు ఈ పద్దులో రూ.వెయ్యి కోట్లు కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. తెలంగాణలో 2.5 లక్షల ఎకరాల్లో అయిల్‌ పామ్ సాగుచేయాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు చెప్పారు.

సొంత స్థలం ఉంటే.. 3 లక్షల సాయం..

సొంత స్థలం ఉన్న 4 లక్షల మందికి రూ.3 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేయనున్నట్లు బడ్జెట్​ సందర్భంగా హరీశ్​రావు వెల్లడించారు. నియోజకవర్గానికి 3వేల ఇళ్లను కేటాయించినట్లు చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలో డబుల్‌ బెడ్​రూం ఇండ్ల నిర్మాణం కోసం 12,000 కోట్ల రూపాయలను ప్రభుత్వం ఈ బడ్జెట్​లో కేటాయించినట్లు చెప్పారు.

దళిత బంధుకు రూ.17,700 కోట్లు..

దళిత బంధు కోసం రూ.17,700 కోట్లు కేటాయించినట్లు మంత్రి హరీశ్​రావు వెల్లడించారు. దళిత బంధు పథకాన్ని హుజూరాబాద్‌ నియోజకవర్గంతో పాటు చింతకాని, తిరుమలగిరి, నిజాంసాగర్‌, చారగొండ మండలాల్లో ప్రభుత్వం ఇప్పటికే సంపూర్ణంగా అమలుచేస్తోందని తెలిపారు. దాంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గానికి వందమంది చొప్పున మొత్తం 118 నియోజకవర్గాల్లో 11,800 కుటుంబాలకు దళితబంధు పథకం కింద ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. వచ్చే సంవత్సరం ఆఖరునాటికి రెండు లక్షల మందికి లబ్ధి చేకూర్చాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు హరీశ్​రావు వెల్లడించారు.

పింఛన్ల కోసం రూ.11,728 కోట్లు..

వృద్ధాప్య పింఛన్ల మంజూరు కోసం విధించిన వయోపరిమితిని 65 ఏళ్లనుంచి 57 ఏళ్లకు తగ్గించినట్లు మంత్రి హరీశ్​రావు పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం నుంచి సడలించిన వయోపరిమితి ప్రకారం కొత్తగా చేరిన లబ్ధిదారులకు పింఛన్లను అందజేస్తామని పేర్కొన్నారు. ఆసరా పింఛన్ల కోసం 2022-2023 వార్షిక బడ్జెట్లో రూ.11,728 కోట్లు ప్రతిపాదించినట్లు తెలిపారు.

గొర్రెల పంపిణీ కోసం రూ.1000 కోట్లు..

గొల్ల కురుమల సంక్షేమం కోసం ప్రభుత్వం పెద్దఎత్తున నిధులు కేటాయిస్తోందని మంత్రి హరీశ్​రావు చెప్పారు. అందులో భాగంగా 11 వేల కోట్ల రూపాయల వ్యయంతో 7.3 లక్షల యూనిట్ల గొర్రెల పంపిణీ లక్ష్యంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ బడ్జెట్లో గొర్రెల పంపిణీ కోసం వేయి కోట్ల రూపాయలు కేటాయింపులు చేసినట్లు చెప్పారు.

నేతన్నలకు ఐదు లక్షల బీమా...

రైతు బీమా మాదిరిగానే నేతన్నలు మరణిస్తే వారి కుటుంబాలను ఆదుకునేందుకు ఐదు లక్షల రూపాయల బీమా పథకాన్ని అమలు చేయాలని ఈ బడ్జెట్​లో ప్రతిపాదించినట్లు హరీశ్​రావు వెల్లడించారు. రైతు బంధు ప‌థ‌కం త‌ర‌హాలో నేత కార్మికుల కోసం ప్ర‌త్యేక ప‌థ‌కాన్ని ప్ర‌భుత్వం ఈ ఏడాది ప్రారంభించాల‌ని నిర్ణ‌యించిందని తెలిపారు.

ల‌క్ష మంది కార్మికుల‌కు మోటార్ సైకిళ్ల‌ు..

గీత కార్మికుల సంక్షేమం కోసం వంద కోట్ల రూపాయలతో ప్రత్యేక పథకాన్ని త్వరలో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి హరీశ్​రావు పేర్కొన్నారు. భ‌వ‌న నిర్మాణ కార్మికుల సంక్షేమానికి కొత్త ప‌థ‌కం ప్ర‌వేశ‌పెడుతున్నామని తెలిపారు. మొద‌టి విడత‌లో ల‌క్ష మంది కార్మికుల‌కు సబ్సిడీ కింద మోటార్ సైకిళ్ల‌ను ఇవ్వాల‌ని బ‌డ్జెట్‌లో ప్రతిపాదించామని.. త్వరలో విధివిధానాలను ప్రకటిస్తామన్నారు.

రూ.1,542 కోట్లు..

రాష్ట్రంలో రోడ్ల మరమ్మతులు, బీటీ రెన్యూవల్స్‌, నిర్వహణ కోసం రూ.1,542 కోట్లు ప్రతిపాదించినట్లు హరీశ్​రావు తెలిపారు. హైదరాబాద్‌లో రూ.858 కోట్లతో నాలా అభివృద్ధి పనులు, రూ.387 కోట్లతో సర్వీస్ రోడ్ల విస్తరణ జరుగుతోందన్నారు. సుంకిశాల నుంచి కృష్ణా జలాలను హైదరాబాద్‌ తరలించేందుకు రూ.725 కోట్లు కేటాయిస్తున్నామని తెలిపారు. ఓఆర్​ఆర్​ పరిధిలో తాగునీటి కోసం రూ.1,200 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు.

పాఠశాలలను అభివృద్ధికి రూ.7,289 కోట్లు..

రూ.7,289 కోట్లతో పాఠశాలలను అభివృద్ధి చేయనున్నట్లు హరీశ్‌రావు ప్రకటించారు. మన ఊరు- మన బడి, మన బస్తీ-మన బడి పేర్లతో బడుల్లో సకల సౌకర్యాలు కల్పిస్తామన్నారు. రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లోనూ వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంగ్లీషు మీడియంలో విద్యాబోధనను అందించడానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. 100 కోట్లతో మహిళా విశ్వవిద్యాలయం, మరో 100 కోట్లతో అటవీ వర్సిటీ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. 7 నూతన మెడికల్‌ కాలేజీల స్థాపన కోసం ఈ బడ్జెట్‌లో వెయ్యికోట్ల రూపాయలను కేటాయించినట్లు చెప్పారు.

ఇవీచూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.