ETV Bharat / city

రాష్ట్రాన్ని శవాలగుట్టగా మార్చేశారు : తెదేపా అధినేత చంద్రబాబు

author img

By

Published : May 20, 2021, 5:30 PM IST

Updated : May 21, 2021, 5:15 AM IST

బడ్జెట్ సమావేశాలపై ప్రభుత్వ తీరును నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ మాక్ అసెంబ్లీ కార్యక్రమాన్ని చేపట్టింది. మాక్ అసెంబ్లీకి స్పీకర్‌గా కొండపి ఎమ్మెల్యే డీబీవీ.స్వామి వ్యవహరించారు. మాక్ అసెంబ్లీలో ఇవాళ కొవిడ్‌పై చర్చించగా.. ప్రభుత్వ వైఫల్యాలపై వీడియోలు, క్లిప్పింగ్‌లు ప్రదర్శించారు.

mock assembly
mock assembly

కరోనాను కట్టడి చేయలేని ప్రభుత్వం షేమ్‌ షేమ్‌... ప్రజలకు వ్యాక్సిన్‌ ఇవ్వలేని ప్రభుత్వం షేమ్‌ షేమ్‌.. పరిపాలన గాలికొదిలేసిన ప్రభుత్వం షేమ్‌ షేమ్‌... రోగులకు ఆక్సిజన్‌ ఇవ్వలేని ప్రభుత్వం షేమ్‌ షేమ్‌.. అన్న నినాదాలతో మాక్‌ అసెంబ్లీ దద్దరిల్లింది. ప్రభుత్వ వైఖరికి నిరసనగా శాసనసభ సమావేశాల్ని బహిష్కరిస్తున్నామని ప్రకటించిన తెదేపా గురువారం సాయంత్రం 4 నుంచి 6.30 వరకు ఆన్‌లైన్‌లో మాక్‌ అసెంబ్లీ నిర్వహించింది. చంద్రబాబు సహా తెదేపా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్న ఈ మాక్‌ అసెంబ్లీ.. ఆసక్తికరంగా సాగింది. కొండపి ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయ స్వామి స్పీకర్‌గా వ్యవహరించారు. కొందరు తెదేపా సభ్యులు అధికార పార్టీకి చెందిన మంత్రులుగా వ్యవహరించారు. కరోనా నియంత్రణలో, ప్రజలకు వైద్య సదుపాయాలు కల్పించడంలో, వ్యాక్సినేషన్‌లో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఘాటుగా విమర్శిస్తూనే తెదేపా సభ్యులు పలు చెణుకులూ వేశారు.

మొదట కొవిడ్‌ మృతులకు సభ సంతాపం ప్రకటించింది. బద్వేలు ఎమ్మెల్యే జి.వెంకటసుబ్బయ్య మృతికి సంతాపం తెలిపింది. కరోనా మృతులకు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ సంతాప తీర్మానం ప్రవేశపెట్టగా.. ఎమ్మెల్సీ బుద్దా నాగజగదీశ్వర్రావు బలపరిచారు. ‘వైకాపా అధికారంలోకి వచ్చినప్పటినుంచీ ఏపీ శవాలగుట్టగా మారింది. కరోనా నియంత్రణలో పూర్తిగా విఫలమైంది. శ్మశానాల దగ్గర హౌస్‌ఫుల్‌ బోర్డులు పెట్టడమే ఈ ప్రభుత్వం సాధించిన పురోగతి’ అని రామ్మోహన్‌ ధ్వజమెత్తారు. క్లిష్ట సమయంలోనూ ముఖ్యమంత్రి తాడేపల్లిలోని విశాలమైన భవంతిలో దీర్ఘకాల క్వారంటైన్‌ కొనసాగిస్తున్నారని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి జగన్‌ గురువారం శాసనసభలో మాస్క్‌ పెట్టుకోకుండా ప్రజలకు ఏం సందేశమిస్తున్నారని సభ్యులు విమర్శించగా.. ‘మాస్క్‌ పెట్టుకోకపోయినా మేం ధైర్యంగా ఉండగలమని చెప్పడానికే సీఎం మాస్క్‌ ధరించడం లేదు. మీరూ మాస్క్‌ పెట్టుకోకుండా ప్రజలకు అలాంటి ధైర్యం ఇవ్వండి’ అని మాక్‌ అసెంబ్లీలో వైద్య, ఆరోగ్యశాఖ మంత్రిగా వ్యవహరించిన ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు వ్యాఖ్యానించారు.

ఒక రాజుని వేసేశాం.. నిన్నూ వేసేస్తాం..!
పౌరసరఫరాల మంత్రిగా వ్యవహరించిన రాజేంద్రప్రసాద్‌ చర్చలో పదేపదే జోక్యం చేసుకున్నారు. ‘కరోనా సమయంలో ఎవరింట్లో వారుండి పనులు చేసుకోమంటున్నారు. కాబట్టే మా ముఖ్యమంత్రి ఎప్పుడూ ఇంట్లోనే ఉంటున్నారు. ఎన్నడూ ఇల్లే కదలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆస్పత్రులకు వెళ్లి కరోనా రోగుల్ని పరామర్శిస్తున్నారంటే అది ఆయన అవసరం. మాకు ప్రజలు 151 మంది ఎమ్మెల్యేల్ని ఇచ్చారు కాబట్టి మాకు ఆ అవసరం లేదు’ అని ఆయన వ్యాఖ్యానించారు. తమ డిమాండ్లకు ప్రభుత్వం సమాధానం చెప్పనందుకు నిరసనగా సభ నుంచి వాకౌట్‌ చేస్తున్నామని సభ్యులు ప్రకటించగా.. ‘వెళ్లండి, వెళ్లి నిద్రపోండి’ అని రాజేంద్రప్రసాద్‌ వ్యాఖ్యానించారు. మీరు గుట్కా మంత్రి, వెళ్లి పేకాట ఆడించుకోండని ఎమ్మెల్సీ సత్యనారాయణరాజు అనగా.. ‘ఒక రాజును లోపల వేయించి అరికాళ్లపై కొట్టించాం. నిన్ను కూడా లోపల వేయించి అరచేతులపై కొట్టిస్తాం. పేకాడటం ఏమైనా దేశద్రోహమా? ఫైన్‌ వేస్తారు అంతే కదా!’ అని రాజేంద్రప్రసాద్‌ వ్యాఖ్యానించారు. గోరంట్ల బుచ్చయ్యచౌదరి ఏదో మాట్లాడుతుండగా.. ఎన్టీఆర్‌ హయాం నుంచీ పార్టీలో ఉన్నారు కాబట్టి ఊరుకుంటున్నామని, లేకపోతే మీ పనీ అయిపోయేదని ఆయన హెచ్చరించారు.


కేసీఆర్‌తో మాట్లాడాలంటే భయం
‘కరోనాకు రాష్ట్రంలో తగిన వైద్య సదుపాయాల్లేవు. వైద్యం కోసం పొరుగు రాష్ట్రానికి వెళుతున్న రోగుల్ని తెలంగాణ పోలీసులు సరిహద్దులో అడ్డుకుంటే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌తో జగన్‌ ఎందుకు మాట్లాడలేదు’ అని తెదేపా శాసనసభాపక్ష ఉపనేత నిమ్మల రామానాయుడు ప్రశ్నించగా.. ‘ఎన్నికల్లో డబ్బులిచ్చారు కాబట్టి’ అని ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌ వ్యాఖ్యానించారు. ఇతర రాష్ట్రాల మాదిరి 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్‌ వేయాలని, ఆక్సిజన్‌ పడకలు, ఐసీయూలు యుద్ధప్రాతిపదికన సిద్ధం చేయాలని, పేదలకు ఆర్థిక ప్యాకేజీ ప్రకటించాలని, కరోనాతో మరణించినవారి కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున, ఆక్సిజన్‌ కొరత వల్ల చనిపోయిన వారికి రూ.కోటి చొప్పున పరిహారం ఇవ్వాలని, జర్నలిస్టుల్ని ఫ్రంట్‌లైన్‌వారియర్లుగా గుర్తించి... చనిపోయినవారి కుటుంబాలకు రూ.50 లక్షలు చొప్పున సాయం అందించాలని డిమాండ్‌ చేశారు. బుచ్చయ్యచౌదరి, బెందాళం అశోక్‌, గౌనివారి శ్రీనివాసులు, బచ్చుల అర్జునుడు ఈ అంశంపై మాట్లాడారు. రాజధాని అమరావతి నిర్మాణం కొనసాగించి ఉంటే అక్కడ ఇప్పటికే పలు ఆసుపత్రుల్లో సుమారు 2 వేల పడకలు అందుబాటులోకి వచ్చేవన్నారు.


సభ వాయిదా
స్పీకర్‌ ప్రశ్నోత్తరాల సమయాన్ని ప్రకటించగా.. కరోనాపై వాయిదా తీర్మానానికి తెదేపా నోటీసు ఇచ్చిందని, ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేసి, స్వల్పకాలిక చర్చ చేపట్టాలని బుచ్చయ్యచౌదరి డిమాండ్‌ చేశారు. తర్వాత చర్చిద్దామని స్పీకర్‌ చెప్పారు. కరోనాపై ప్రభుత్వమే తనంతటతాను చర్చ చేపడుతుందని ఆశించామని, మిగతా అజెండా అంతా పక్కనపెట్టి, ప్రజలంతా ఆందోళ చెందుతున్న కరోనాపై చర్చ చేపట్టాలని అచ్చెన్నాయుడు డిమాండ్‌ చేయడంతో స్పీకర్‌ చర్చకు అనుమతిచ్చారు. తమ డిమాండ్లకు ప్రభుత్వం నుంచి నిర్దిష్ట సమాధానం రానందుకు వాకౌట్‌ చేస్తున్నామని సభ్యులు ప్రకటించడంతో సభ వాయిదా పడింది.

ప్రజలకు ధైర్యం ఇవ్వడానికే మా సీఎం మాస్క్‌ పెట్టుకోలేదు
మాక్‌ అసెంబ్లీలో నేతల చెణుకులు

‘కరోనా అంశం ప్రభుత్వ అజెండాలో లేదు. కరోనా మాకు ప్రాధాన్యతాంశం కాదు. అది వస్తుంది, పోతుందని మా ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా చాలా స్పష్టంగా చెప్పారు. పారాసెట్మాల్‌ వేసుకుంటే చాలనీ అన్నారు. కానీ ప్రతిపక్ష నాయకులుగా మీరంతా పారాసెట్మాల్‌ ప్రాధాన్యాన్ని జనానికి వివరించడంలో విఫలమయ్యారు. బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లితే కరోనా పోతుంది. అందుకే మా ప్రభుత్వం అన్ని మందుల దుకాణాల్లో పారాసెట్మాల్‌, అన్ని మున్సిపాలిటీలు, పంచాయతీల్లో బ్లీచింగ్‌ పౌడర్‌ అందుబాటులో ఉంచింది. మీరు కూడా వాటి విలువ తెలుసుకుని ప్రజలకు అవగాహన కల్పించండి’

- తెదేపా మాక్‌ అసెంబ్లీలో వైద్య, ఆరోగ్యశాఖ మంత్రిగా వ్యవహరించిన ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు చెణుకులు ఇవి.

‘వింటున్నాం కదా అని ఎవరిష్టం వచ్చినట్టు వాళ్లు మాట్లాడుతున్నారు. మా గుడివాడలో ఇంతకంటే అడ్డగోలుగా మాట్లాడగలం. ఎవరైనా పిచ్చిపిచ్చిగా మాట్లాడితే తోలు తీసి అసెంబ్లీ గుమ్మానికి వేలాడదీస్తాం’

- పౌరసరఫరాల శాఖ మంత్రిగా వ్యవహరించిన ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్‌, ఆ శాఖ మంత్రి కొడాలి నాని హావభావాల్ని అనుసరిస్తూ వేసిన చతురోక్తులివి..

ఇదీ చదవండి

ఏపీ డెయిరీ ఆస్తుల వ్యవహారం: 'జీవో నెం.117 రాజ్యాంగ విరుద్దం'

Last Updated : May 21, 2021, 5:15 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.