ETV Bharat / city

పండుగ ప్రత్యేకం... ఈ రోజు దీపాలు ఎందుకు వెలిగిస్తామంటే...?

author img

By

Published : Nov 14, 2020, 12:00 PM IST

చతుర్దశి అమావాస్యకు దారితీసినట్లుగానే నరకాసుర సంహారం దీపావళి పర్వదినానికి తోవ చూపిందని పెద్దలమాట. పూర్వం నరకుడు అనే రాక్షసుడు లోక కంటకుడై చెలరేగినప్పుడు, వాడి బాధలను తట్టుకోలేక ఇంద్రాది దేవతలందరూ మహావిష్ణువుకు మొరపెట్టుకున్నారని, అప్పుడు మహావిష్ణువు కృష్ణుడిగా సత్యభామాసమేతుడై వాణ్ని సంహరించి, లోకానికి పట్టిన పీడను వదిలించాడని పురాణగాథ. నరకాసురుణ్ని చంపిన రోజు ఆశ్వీయుజ బహుళ చతుర్దశి కావడం వల్ల ఈ దినాన్ని ‘నరక చతుర్దశి’ అని పిలవడం సంప్రదాయంగా మారింది. దుష్టరాక్షసుడి వధానంతరం మరుసటి రోజైన అమావాస్యనాడు ఆనందోత్సాహాలతో దీపాలు వెలిగించి, పండుగ జరుపుకోవడం పరిపాటిగా మారింది.

dipalu spl
dipalu spl

నరక చతుర్దశికి, నరకాసురుడికి సంబంధం లేదనే వాదనలు కూడా ఉన్నాయి. అవి ఎలా ఉన్నా, మరొక ధార్మిక విషయం నరక చతుర్దశితో ముడివడి ఉందనేది యథార్థం. మానవులు మరణానంతరం నరకానికి, ఆ తరవాత స్వర్గానికి వెళ్తారని ప్రగాఢ విశ్వాసం. నరకలోకం అంధకారమయంగా ఉండటం వల్ల అక్కడికి వెళ్లినవారు చీకటిలోనే మగ్గుతుంటారని, దారి చూపడంకోసం భూలోకంలోని వారసులు దీపాలు వెలిగించాలని శాస్త్రం చెబుతోంది. పితృదేవతలకు నరకంలో చీకట్లు తొలగాలంటే, వారి కోసం భూమిపై దీపాలు వెలగాలన్న భావనతో దీపావళినాడు దీపాలను వెలిగిస్తారు. అంతేకాదు- దీపదానాలూ చేస్తారు. యముడి ప్రీతికోసం తర్పణాలు విడుస్తారు. ఇవన్నీ పితృదేవతలకు నరకలోక బాధలు లేకుండా చేయడానికే అనేది ఈ పండుగలోని పరమార్థం. ఆశ్వీయుజ బహుళ చతుర్దశినాడు ఎవరు దీపాలు వెలిగిస్తారో వారి పితరులు (మరణించిన తండ్రులు, తాతలు) నరక లోకాన్ని వీడి స్వర్గలోకం వైపు ప్రయాణిస్తారని ధర్మశాస్త్రం చెబుతోంది.

నరక చతుర్దశినాడు అభ్యంగనస్నానం విశేషమైన అంశం. తిలలు అంటే నువ్వులు. వాటి నుంచి తీసిన ద్రవమే తైలం. ఒంటికి తైలాన్ని మర్దన చేసుకొని తలస్నానం చేయాలని శాస్త్రం చెబుతోంది. ఇలా చేయడంవల్ల శరీరం ఆరోగ్యవంతం కావడమేగాక, మానసికంగానూ ప్రశాంతత లభిస్తుందని పెద్దలమాట. రాబోయేది హేమంత రుతువు. అంటే చలికాలం. చలికాలం రాగానే శరీరం అంతా పగులువారుతుంది. తైలమర్దనవల్ల శరీరం నిగనిగలాడుతూ తళుకులీనుతుంది.

అమావాస్య లక్ష్మీదేవి జన్మదినమని విశ్వాసం. లక్ష్మీదేవి తాండవించే ఈ శుభదినాన దీపాలు వెలిగించి, సిరిసంపదలు కోరుతూ లక్ష్మీపూజలు చేయడం మానవాళికి అలవాటు. బంగారం, వెండి, రత్నాలు, వజ్రాలు, ముత్యాలు... ఇలా అమూల్యమైన సంపదలన్నీ లక్ష్మీస్వరూపాలే. దీపావళినాటి రాత్రి అమూల్య సంపదలను పూజించి, దినదినాభివృద్ధిని కోరడం కనిపిస్తుంది. వర్తకవాణిజ్య రంగాల వారికి దీపావళి అత్యంత పూజ్యదినం.

మనిషి తన జీవితంలో అనుక్షణం వెలుగుకోసం తపిస్తాడు. ‘తమసోమా జ్యోతిర్గమయ’ అనే వేదసూక్తి మానవుడి మనోభావానికి అద్దం పడుతుంది. వెలుగులకోసం తపించే మనిషికి వెలుగులు కురిపించే దీపావళి పండుగ అంటే ఎంతో ఇష్టం.

నరకం నుంచి విముక్తి కావడం, తేజోమయ స్వర్గలోకానికి చేరుకోవడం అనే ప్రధాన లక్ష్యాలు- ఈ పండుగను విశ్వమనోహరంగా చేస్తున్నాయి. సూర్యచంద్ర నక్షత్ర కాంతులతో ఆకాశం ఎలా వెలిగిపోతుందో, అలాగే జీవితమంతా పర్వదినాల వెలుగులతో సుఖశాంతులను కురిపించాలని కోరడమే మానవాళి కర్తవ్యం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.