ETV Bharat / city

రాష్ట్రంలో రూ.16 వేల కోట్ల పెట్టుబడులకు ఆమోదం

author img

By

Published : Jun 23, 2022, 5:36 AM IST

ముఖ్యమంత్రి జగన్​ అధ్యక్షతన రాష్ట్ర పెడుబడుల ప్రోత్సాహక బోర్డు బుధవారం సమావేశమైంది. రూ.16వేల కోట్ల పెటుబడులతో వివిధ పరిశ్రమల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. వాటి ద్వారా 11 వేల మందికి ప్రత్యక్షంగా, 2,700 మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందని ప్రభుత్వం పేర్కొంది.

sipb
రాష్ట్రంలో రూ.16 వేల కోట్ల పెట్టుబడులు

రాష్ట్రంలో రూ.16,076.48 కోట్ల పెట్టుబడులతో వివిధ పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వాటి ద్వారా 11 వేల మందికి ప్రత్యక్షంగా, 2,700 మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందని పేర్కొంది. ముఖ్యమంత్రి జగన్‌ అధ్యక్షతన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (స్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ బోర్డు-ఎస్‌ఐపీబీ) సమావేశం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో బుధవారం జరిగింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ... 'రాష్ట్రంలో 30 వేల మెగావాట్ల గ్రీన్‌ ఎనర్జీ ప్రాజెక్టుల ఏర్పాటుకు 90 వేల ఎకరాల భూమి అవసరం అవుతుంది. భూములిచ్చిన రైతులకు ఎకరాకు ఏడాదికి రూ.30 వేల చొప్పున లీజు అందుతుంది. వర్షాభావ ప్రాంతాల రైతులకు స్థిర ఆదాయం అందితే ఆయా కుటుంబాలకు మేలు కలుగుతుంది. సుబాబుల్‌, జామాయిల్‌ వంటి పంటలు సాగు చేస్తున్న రైతులు కూడా తమ భూములను గ్రీన్‌ ఎనర్జీ ప్రాజెక్టులకు ఇస్తే వారికి లబ్ధి చేకూరుతుంది. ప్రపంచ ప్రసిధ్ధి చెందిన కంపెనీల ఉత్పత్తుల తయారీ కేంద్రంగా రాష్ట్రం మారాలి. దీనికోసం గ్లోబల్‌ కంపెనీల పెట్టుబడులను ఆకర్షించడంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలి. రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్‌, పర్యాటక, ఆతిథ్య రంగాల్లో పెట్టుబడులకు అనువైన పరిస్థితి ఉంది. కొప్పర్తికి ఎలక్ట్రానిక్స్‌ తయారీ పరిశ్రమలు వస్తున్నాయి. వాటికి అవసరమైన సామగ్రిని, ఉత్పత్తులను సులభంగా రవాణా చేయడానికి వీలుగా రైల్వేలైన్‌ ఏర్పాటు చేయాలి. పారిశ్రామిక పార్కులను రైలుమార్గాలతో అనుసంధానం చేయాలి' అని అధికారులను ఆదేశించారు. సమావేశంలో మంత్రులు ధర్మాన ప్రసాదరావు(రెవెన్యూ), ఆదిమూలపు సురేష్‌(పురపాలక), గుడివాడ అమర్నాథ్‌(పరిశ్రమలు), ఆర్‌కే రోజా(పర్యాటక), సీఎస్‌ సమీర్‌శర్మ, వివిధ శాఖల ఉన్నతాధికారులు కరికల్‌ వళవన్‌, రజత్‌ భార్గవ, విజయానంద్‌, కృష్ణబాబు, సౌరభ్‌ గౌర్‌ తదితరులు పాల్గొన్నారు.

sipb
.

ఎస్‌ఐపీబీలో ఆమోదించిన పరిశ్రమలు
అదానీ గ్రీన్‌ ఎనర్జీ సంస్థ శ్రీసత్యసాయి జిల్లాలోని చిత్రావతి, వైఎస్‌ఆర్‌ జిల్లాలోని గండికోట, పార్వతీపురం మన్యం జిల్లా కురుకుట్టి, కర్రివలసలలో 3,700 మెగావాట్ల గ్రీన్‌ ఎనర్జీ ఉత్పత్తికి పంప్డ్‌ స్టోరేజి ప్రాజెక్టుల (పీఎస్‌పీ) ఏర్పాటుకు ఆమోదం లభించింది. వీటి ద్వారా రూ.15,376 కోట్ల పెట్టుబడులు వస్తాయని, 4 వేల మందికి ఉపాధి లభిస్తుందని సంస్థ ప్రతిపాదించింది. 2022-23లో రూ.1,349 కోట్లు, 2023-24లో రూ.6,984 కోట్లు, 2024-25లో రూ.5,188 కోట్లు, 2025-26లో రూ.1,855 కోట్ల చొప్పున ఖర్చు చేస్తూ నాలుగు దశల్లో ప్రాజెక్టులను పూర్తిచేస్తుంది.

  • పంక్చుయేట్‌ వరల్డ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ కొప్పర్తి, పులివెందులలో దుస్తుల తయారీ యూనిట్ల ఏర్పాటుకు ప్రతిపాదించింది. ఒక్కోచోట రూ.50 కోట్ల చొప్పున పెట్టుబడులు పెట్టనుండగా మొత్తంగా 4,200 మందికి ఉపాధి లభిస్తుంది.
  • కృష్ణా జిల్లా మల్లవల్లి పారిశ్రామిక పార్కులో రూ.150 కోట్లతో అవిసా ఫుడ్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌ వారు రొయ్యల శుద్ధి పరిశ్రమ పెట్టనున్నారు. దీని ద్వారా 2,500 మందికి ఉపాధి లభిస్తుంది.
  • తిరుపతిలో నోవోటెల్‌ బ్రాండ్‌ కింద వీవీపీఎల్‌ సంస్థ రూ.126.48 కోట్లతో హోటల్‌ ఏర్పాటు చేయనుంది. దీని ద్వారా ప్రత్యక్షంగా 300 మందికి, పరోక్షంగా 2,700 మందికి ఉపాధి లభిస్తుంది.
  • కొప్పర్తిలో 1,200 ఎకరాల్లో మెగా ఇంటిగ్రేటెడ్‌ టెక్స్‌టైల్‌ రీజియన్‌, అపారెల్‌ పార్కు ఏర్పాటుకు ఆమోదం లభించింది.

ఇదీ చూడండి: సీఎం జగన్ పారిస్‌ పర్యటనకు.. సీబీఐ కోర్టు పచ్చజెండా

Viral Video: 11వేల వోల్టుల కరెంటు తీగ తాకి వ్యక్తి సజీవదహనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.