ETV Bharat / city

Coal Mining Tenders: బొగ్గు గనుల వేలానికి దూరంగా సింగరేణి

author img

By

Published : Dec 16, 2021, 9:46 AM IST

Coal Mining Tenders
Coal Mining Tenders

Coal Mining Tenders: బొగ్గు గనుల వేలంలో పాల్గొనకుండా సింగరేణి సంస్థ దూరంగా ఉంది. కనీసం టెండర్లు కూడా వేయలేదు. ఏటా కోటీ 20 లక్షల టన్నుల బొగ్గును తవ్వి తీయడానికి అవకాశమున్న 4 గనులను దక్కించుకోవడానికి ప్రయత్నం చేయకుండా సింగరేణి ఎందుకు దూరంగా ఉండిపోయిందనేది బయటికి చెప్పడం లేదు.

Coal Mining Tenders: బొగ్గు గనుల వేలంలో పాల్గొనకుండా సింగరేణి సంస్థ దూరంగా ఉంది. కనీసం టెండర్లు కూడా వేయలేదు. తెలంగాణలో 4 గనులను కేంద్రం వేలానికి పెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఉన్న పాత గనులకు దగ్గరగా ఎంతో అనుకూలంగా ఉన్న ఈ నాలుగింటిని దక్కించుకోవాలంటే సింగరేణి టెండర్లు వేయాల్సింది.. కానీ, వేయలేదు. దరఖాస్తు దాఖలు గడువు ఈ నెల 14తో ముగిసింది. టెండర్లలో ఎక్కువ ధరలను కోట్‌ చేసిన కంపెనీలకు ఈ గనులను వచ్చే నెల 6న కేంద్రం కేటాయిస్తుంది.

కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకే...

ఏటా కోటీ 20 లక్షల టన్నుల బొగ్గును తవ్వి తీయడానికి అవకాశమున్న 4 గనులను దక్కించుకోవడానికి ప్రయత్నం చేయకుండా సింగరేణి ఎందుకు దూరంగా ఉండిపోయిందనేది బయటికి చెప్పడం లేదు. కానీ, ఒకసారి వేలంలో పాల్గొంటే ఇక ప్రైవేటు కంపెనీలతో పోటీపడేందుకు అంగీకరించినట్లే అవుతుందని.. దూరంగా ఉంటే రాష్ట్ర ప్రభుత్వమే కేంద్రంపై ఒత్తిడి తెచ్చి గనులు ఇప్పించవచ్చని సింగరేణి అంచనా వేస్తున్నట్లు సమాచారం.

మూడుసార్లు వేలం...

వరసగా మూడుసార్లు వేలంలో కొత్త గనులకు టెండర్లు రాకున్నా.. లేదా టెండరు వేసిన కంపెనీలు వాటిని దక్కించుకునే అర్హత పొందకున్నా అప్పుడిక చేసేది లేక కేంద్రమే నేరుగా వాటిని ఏదో ఒక ప్రభుత్వ సంస్థకు కేటాయించే అవకాశం ఉంటుంది. తెలంగాణలో గనుల తవ్వకానికి ప్రైవేటు కంపెనీలేవీ ముందుకు రాకపోవచ్చని.. మూడుసార్లు వేలం పాటలయ్యేదాకా ఎదురుచూసి చివరికి కేంద్రమే తమకు కేటాయిస్తుందని సింగరేణి భావిస్తోంది. కానీ, అలా జరుగుతుందా లేక ఈ లోగా వేలంలో ఏదైనా ప్రైవేటు కంపెనీ వాటిని దక్కించుకుంటుందా అనేది త్వరలో తేలనుంది. ఈ వేలాన్ని వ్యతిరేకిస్తూ సింగరేణి కార్మిక సంఘాలు ఈ నెల 9, 10, 11 తేదీల్లో సమ్మె చేశాయి. దానివల్ల సంస్థకు రూ.120 కోట్ల నష్టం వాటిల్లింది. సమ్మెతో కేంద్రం దిగివస్తుందని కార్మిక సంఘాలు, రాష్ట్ర ప్రభుత్వం భావించాయి. కానీ, ఈ సమ్మెను రాష్ట్ర ప్రభుత్వమే చేయించిందని, వేలం ఆపేది లేదని కేంద్రం స్పష్టం చేసింది. ఈ పరిస్థితుల్లో అసలు వేలంలో పాల్గొనని సింగరేణికే ఈ గనులను కేంద్రం భవిష్యత్తులో కేటాయిస్తుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సత్తుపల్లి, కోయగూడెం, శ్రావణపల్లి, కళ్యాణఖని గనులను వేలంలో పెట్టగా కోయగూడెం గనికి అత్యధికంగా 4 కంపెనీలు టెండర్లు వేసినట్లు సమాచారం.

లాభాల్లో 189 శాతం వృద్ధి...

2021-22 ఏప్రిల్‌ నుంచి నవంబరు వరకూ రూ.16,512 కోట్ల అమ్మకాలు జరిపినట్లు సింగరేణి తెలిపింది. వీటిపై రూ.924.40 కోట్ల లాభాలు వచ్చాయని వివరించింది. గతేడాది ఇదే సమయంతో పోల్చితే లాభాల్లో 189 శాతం వృద్ధి నమోదైనట్లు తెలిపింది.

ఆ నాలుగు గనులను సింగరేణికే అప్పగించాలి..

ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం వేలానికి సిద్ధంచేసిన నాలుగు బొగ్గు గనులను ఆ ప్రక్రియ నుంచి తొలగించి సింగరేణికి అప్పగించాలని భారతీయ మజ్దూర్‌సంఘ్‌ అనుబంధ సంస్థ సింగరేణి కోల్‌మైన్స్‌ కార్మిక సంఘ్‌ కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషీకి విజ్ఞప్తిచేసింది. బీఎంఎస్‌ జాతీయ నాయకుడు కె.లక్ష్మారెడ్డి, కార్మికసంఘ్‌ ప్రధాన కార్యదర్శి పి.మాధవ్‌నాయక్‌ల ఆధ్వర్యంలో సింగరేణి కార్మికులు బుధవారం రోజు కేంద్రమంత్రిని కలిసి వినతిపత్రం సమర్పించారు. అందుకు ప్రహ్లాద్‌జోషీ సానుకూలంగా స్పందించారని లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. ఇంతవరకూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎంగానీ, సింగరేణి సీఎండీకానీ వ్యక్తిగతంగా సమస్యను కేంద్రం దృష్టికి తేవడంలో విఫలమయ్యారని ప్రహ్లాద్‌ జోషి తమతో అన్నట్లు చెప్పారు.

ఇదీ చదవండి: Handloom sector: చేనేతపై ధరల పిడుగు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.