ETV Bharat / city

నిలిచిన డ్రిప్​ పరికరాల సరఫరా... రెండేళ్లుగా రైతుల ఎదురుచూపులు

author img

By

Published : Mar 1, 2022, 2:21 PM IST

drip irrigation: రాష్ట్రంలో బిందు సేద్యాన్ని ప్రోత్సహిస్తున్నాం... ఆ దిశగా అన్ని చర్యలు తీసుకుంటున్నాం... ఈ ఏడాదిలో లక్షల ఎకరాల్లో బిందు సేద్యం ద్వారా సాగు చేపడతాం... ఇందుకు కోట్ల రూపాయల నిధులు ఖర్చు చేస్తాం... అవునా ఎవరు చెప్పారు? అనుకుంటున్నారా... ఇంకెవరూ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి చెప్పిన, ఇచ్చిన హామీలు ఇవి... కానీ అమలు విషయానికి వస్తే... పరిస్థితి మరోలా ఉందని రైతులు వాపోతున్నారు. ఇంతకు విషయం ఏమిటంటే...

drip irrigation
బిందు సేద్యానికి సమస్యలు

drip irrigation: రాష్ట్రంలో బిందు సేద్యాన్ని ప్రోత్సహించే దిశగా అన్ని చర్యలు తీసుకుంటున్నామని... 2021 జులై 8న రాయదుర్గంలో జరిగిన రైతు దినోత్సవ సభలో మంత్రి కన్నబాబు తెలిపారు. 2021-22 ఏడాదికిగానూ 3.25 లక్షల ఎకరాల్లో డ్రిప్‌ సాగు చేపడతాని హామీ ఇచ్చారు. ఇందుకు రూ.1,190 కోట్లు ఖర్చు చేయనున్నట్లు ప్రకటించారు. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారనీ చెప్పారు. కానీ ఇవేవీ ఆచరణకు నోచుకోవడంలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

drip irrigation: సూక్ష్మ సేద్యంపై రాష్ట్ర ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని రైతులు మండిపడుతున్నారు. ముఖ్యమంత్రి జగన్‌, మంత్రి కన్నబాబు ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోవడం లేదని ఆవేదన చెందుతున్నారు. గతంలో మాదిరిగా 90 శాతం రాయితీ కాకుండా 50 శాతం కల్పిస్తామని చెప్పారని.. అదికూడా ఆచరణకు నోచుకోలేదన్నారు. డ్రిప్‌ పరికరాల కోసం రెండేళ్లుగా ఎదురుచూస్తున్నామని తెలిపారు. కొందరు అన్నదాతలు రూ.లక్షలు ఖర్చు చేసి ప్రైవేటుగా పరికరాలు కొనుగోలు చేస్తున్నారు. మరోవైపు బకాయిలు చెల్లించకపోవడంతో సామగ్రి సరఫరా చేసే సంస్థలు కూడా చేతులెత్తేశాయని చెప్పారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి మార్గదర్శకాలు లేకపోవడంతో అధికారులు సమాధానం చెప్పలేక తలలు పట్టుకుంటున్నారు. అసలు పథకం కొనసాగుతుందా.. లేదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

"గడిచిన రెండేళ్లకుగానూ 64 వేల హెక్టార్లలో డ్రిప్‌ ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు. ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం." - ఫిరోజ్‌ఖాన్‌, ఇన్‌ఛార్జి పీడీ, ఏపీఎంఐపీ

డీడీలు వెనక్కి...

drip irrigation: జిల్లా వ్యాప్తంగా 2003 నుంచి 2019 వరకు 2.81 లక్షల మంది రైతులకు సంబంధించి 3.39 లక్షల హెక్టార్లకు ఏపీఎంఐపీ ద్వారా రాయితీతో డ్రిప్‌ అందించారు. వీటిలో 81 వేల హెక్టార్లు స్ప్రింక్లర్లు కాగా.. 2.42 లక్షల హెక్టార్లలో డ్రిప్‌ ఏర్పాటు చేశారు. 2019-20 గాను 32 వేల హెక్లార్లకు డ్రిప్‌ పరికరాలు మంజూరు చేయాలని లక్ష్యం పెట్టుకోగా.. 24,580 హెక్టార్లకు అందించారు. ఇంకా 3,941 మంది రైతులు ఎదురుచూస్తున్నారు. రైతుల నుంచి ఒత్తిడి పెరిగిపోవడంతో 3,582 మందికి డీడీల నగదు వెనక్కి ఇచ్చారు. ఇంకా 359 మందికి చెల్లించాల్సి ఉంది.

"2017లో నాలుగెకరాలకు డ్రిప్‌ ఇచ్చారు. ప్రస్తుతం పైపులు దెబ్బతిన్నాయి. మళ్లీ డ్రిప్‌ పరికరాలు పొందేందుకు అర్హత వచ్చింది. అధికారులను అడిగితే ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాలేదని చెబుతున్నారు. ప్రైవేటుగా కొనుగోలు చేయలేని పరిస్థితి. ప్రభుత్వం స్పందించి పథకాన్ని పునరుద్ధరించాలి."- రాజాకృష్ణ, పాతపాళ్యం, కనగానపల్లి

లక్ష్యం సరే.. అమలు?...

drip irrigation: బిందు సేద్యం పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అటకెక్కించినా ఏపీఎంఐపీ అధికారులు మాత్రం ఏటా లక్ష్యాలను నిర్దేశించుకుంటూనే ఉన్నారు. 2020-21కి 32 వేల హెక్టార్లు, 2021-22లో 32 వేల ఎకరాలు, మొత్తంగా రెండేళ్లకు కలిపి 64 వేల హెక్టార్లకు డ్రిప్‌ అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. రాయితీ ధరలు ఖరారు కాకపోవడం.. ప్రభుత్వం నుంచి ఎలాంటి మార్గదర్శకాలు రాకపోవడంతో ఒక్క ఎకరాకు కూడా అందించలేకపోయాని పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరానికి ఇంకా కొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో పథకంపై రైతులు ఆశలు వదులుకుంటున్నారు.

"నాకున్న ఐదెకరాల భూమిలో నాలుగెకరాల్లో దానిమ్మ పంటను సాగు చేశా. మొక్కలకు నీటిని సరఫరా చేసేందుకు డ్రిప్‌ పరికరాల కొనుగోలుకు రూ.లక్ష వెచ్చించాను. ఇది అదనపు భారంగా మారింది. గతంలో ప్రభుత్వం 90 శాతం రాయితీతో పరికరాలు ఇచ్చింది. ప్రస్తుత ప్రభుత్వం పట్టించుకోవడం లేదు."- వెంకటరాముడు, చెన్నేకొత్తపల్ల

రూ.180 కోట్ల బకాయి

drip irrigation: బిందు సేద్యం పరికరాల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం 36 కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంది. జిల్లా రైతులకు గతంలో సరఫరా చేసిన పరికరాలకు సంబంధించి రెండేళ్లుగా చెల్లింపులు చేయలేదు. ఈ సమస్య రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. జిల్లాకు సంబంధించి ఆయా సంస్థలకు రూ.180 కోట్ల వరకు బకాయిలు చెల్లించాల్సి ఉందని అధికారులు తెలిపారు. ఆ బిల్లులు వస్తేనే కొత్తగా పరికరాలు పంపిణీ చేస్తామని సదరు కంపెనీలు స్పష్టం చేస్తున్నాయి. రెండేళ్లుగా డ్రిప్‌ అందక అవస్థలు పడుతున్నామని, ప్రజాప్రతినిధులు స్పందించి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని రైతులు కోరుతున్నారు.

ఇదీ చదవండి: నిరుపయోగంగా ఉన్న స్థలం.. అభివృద్ధికి కర్నూలు నగరపాలక సంస్థ నిర్ణయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.